Ketan Agarwal Case: దేశంలో సంచలనం కలిగించిన కేతన్ అగర్వాల్ కేసు విషయంలో అనేక రకాలుగా మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు కేతన్ కు కాబోయే భార్య సియా.. ఆమె ప్రియుడు చేతన్.. ఇంకా కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి దర్యాప్తు సాగిస్తూనే ఉన్నారు.
సీన్ రిక్రియేషన్ కోసం సియాను ఘటన జరిగిన ప్రాంతం వద్దకు తీసుకెళ్లారు. సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఇతర బ్యాంకు లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దర్యాప్తు చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కేతన్ ను అత్యంత కుట్రపూరితంగానే అంతం చేసినట్టు పోలీసులు గుర్తించారు. పైగా అతడి ద్వారా తన ప్రియుడికి సియా ఆర్థికంగా లబ్ధి కలిగించిందని పోలీసులు గుర్తించారు.
సియా వ్యవహారాన్ని ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఆమె తండ్రి ప్రవీణ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఒకవేళ ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నదని తెలిస్తే కఠిన శిక్ష విధించాలని కోరారు. ఇప్పటికే మానసికంగా ఇబ్బంది పడుతున్నామని.. ఇలాంటి తరుణంలో తమకు అటువంటి శిక్ష వేయకూడదని ఆయన చెబుతున్నారు. తమ కుటుంబాన్ని చాలామంది లక్ష్యంగా చేసుకున్నారని.. తీవ్రమైన ఒత్తిడిలో జీవిస్తున్నామని ఆయన కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.
“నా కూతురు తప్పు చేసిందని తెలిస్తే ఏ నిర్ణయమైనా తీసుకొండి. అవసరమైతే ఆమెను కూడా కేతన్ వద్దకు పంపించండి . ఎందుకంటే అతను ఎటువంటి తప్పు చేయలేదు. అతను కేవలం పెళ్లి చేసుకోవాలి అని మాత్రమే అనుకున్నాడు. ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోతే సియా తన మనసులో ఉన్న మాట చెప్తే సరిపోయేది. ఆమె నిర్ణయాన్ని గౌరవించే వాళ్ళం. అలాకాకుండా ఒక మనిషిని ఇలా చేయడం అత్యంత బాధాకరం. వారి కుటుంబం దుఃఖిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో వారి బాధను నేను అర్థం చేసుకున్నాను. ఒక తండ్రిగా నేను చెబుతున్నాను. పోలీసులు సియా విషయంలో కనికరం చూపొద్దు. నేరానికి పాల్పడిన వ్యక్తికి మినహాయింపు ఇవ్వకూడదని” ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ చేయడం విశేషం. కాగా, ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. మంచి తండ్రి కడుపులో సియా చెడ పుట్టిందని కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు కఠిన శిక్ష విధించాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు.
