SIT report on Lakhimpur Khairi: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్లో రైతులు అనుకోకుండా మృతి చెందలేదని, ఇది కావాలని చేసిన కుట్రేనని విచారణ సంస్థ ‘సిట్’ కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా ఇది హత్య చేసేందుకు పన్నిన పథకమేనని అభిప్రాయపడింది. వ్యవసాయ చట్టాలపై బీజేపీ నాయకులను నిలదీసేందుకు రైతులు నిరసన తెలుపుతుండగా వారిపై నుంచి కావాలనే వాహనాలను వెళ్లనిచ్చారని తెలిపింది. దీంతో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శల దాడికి దిగుతున్నాయి. ‘మోదీజీ.. మరోసారి మీరు రైతులకు క్షమాపణలు చెప్పాలి..’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడితోసహా 12 మందిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చారు. ఆ తరువాత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్వగ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పర్యటన సమాచారం అందుకున్న రైతులు నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. టికునియా పట్టణలో ఓ రోడ్డుపై నిరసన తెలుపుతున్న సమయంలో రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లంది.
దీంతో ఓ రైతు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఓ కారుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారు. వారిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఈ సంఘటనలతో డిప్యూటీ సీఎం కార్యక్రమం మధ్యలోనే ఆపేశారు. అంతేకాకుండా అక్కడికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు. అయితే ఈ ఘటన తరువాత ప్రతిపక్ష నాయకులంతా చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు యత్నించారు. కానీ యూపీ ప్రభుత్వం వారిని అడ్డుకుంది.
కాగా ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు నేరారోపణలు ఎదుర్కోవడంతో మంత్రిని సస్పెండ్ చేయాలని, ఆయన కుమారుడిపై తీవ్రమైన కేసులు పెట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లఖింపూర్ ఖేరీ కేసును సుప్రీం కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరిపింది. ఈ కేసులు న్యాయవిచారణ వివరాలను తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసంన యూపీ ప్రభుత్వాన్ని కోరింది.
Also Read: ‘మల్లన్న’ సైన్యంపై గురిపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్?
ఈ కేసులో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా సహా నిందితులపై భారత శిక్షాస్మృతిలో తీవ్రమైన సెక్షన్లను విధించాలని సిట్ సూచించింది. ‘నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల గాయాలు పరచడం 307, సెక్షన్ 326 విధించాలని సూచించింది. అయితే లఖింపూర్ ఘటన తరువాత ఆశిశ్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. కానీ సిట్ విచారణలో మాత్రం ఆశిశ్ కుట్ర పన్ని హత్యకు పాల్పడినట్లు తేలిందని తెలిపింది. మరోవైపు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సమక్షంలో న్యాయవిచారణ కూడా జరుగుతోంది.
సిట్ విచారణ సిఫార్సుల విషయం తేలిన తరువాత విపక్షాలు బీజేపీపై విమర్శలు కొనసాగిస్తున్నాయి. ‘ లఖీంపూర్ ఘటనలో ఎవరున్నారో తెలియుద..?ఆ ఘటన గురించి మరిచిపోగలరా..?’ అని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తన కుమారుడు అశిశ్ మిశ్రాను కలిసేందుకు జిల్లా జైలుకు వెళ్లారు. ‘నేను నా కొడుకును కలవడానికి వచ్చాను’ అని మీడియాతో చెప్పారు. నిందితులందరినీ మంగళవారం కోర్టులో హాజరుపరిచి సిట్ సిఫార్సులను విచారిస్తామని అడిషినల్ ప్రాసిక్యూటింగ్ అధికారి తెలిపారు.
Also Read: పీఆర్సీ లొల్లి.. వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తింపు