Sircilla Politics Review: తెలంగాణలో సిరిసిల్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియోజకవర్గం పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ ఇలాకా. తెలంగాణ రాకముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ 2009లో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో ఇక్కడ టీఆర్ ఎస్ తరఫున మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేకే మహేందర్ రెడ్డి మంచి పట్టుతో ఉన్నారు.

కానీ కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టేసి కేటీఆర్‌కు టికెట్ ఇచ్చి.. టీడీపీతో పొత్తు పెట్టుకుని మరీ ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ను గెలుపొందేలా చేశారు. అంతే.. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా కేటీఆర్ వరుసగా ఓటమి అన్నది ఎరగకుండా గెలుస్తూనే వచ్చారు. అయితే ప్రతి ఎన్నికల్లో తన మెజార్టీని పెంచుకుంటూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో ఏకంగా 80వేలకు పైగా మెజార్టీతో సత్తా చాటారు.
మరి సిరిసిల్లలో కేటీఆర్‌కు పోటీ ఎవరు అంటే.. అందరికీ గుర్తుకు వచ్చేది కేకే మహేందర్‌రెడ్డి మాత్రమే. ఆయన 2009 ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి వరుసగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ.. కేటీఆర్ చేతిలో ఓడిపోతూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న కొండూరు రవీందర్‌రావును టీఆర్ ఎస్‌లో చేర్చుకుని ఆయనకు కీలక పదవి ఇచ్చేశారు కేటీఆర్.

Also Read: సంచలన నిర్ణయం దిశగా షర్మిల.. ఎన్నికలకు దూరంగానే..?
దాంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లో కేకే తర్వాత అంత పెద్ద లీడర్ లేకపోవడంతో.. ఆ పార్టీకి మరో నాయకుడు అంటూ లేడు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున టీఆర్ ఎస్‌లోకి కాంగ్రెస్ నుంచి చేరికలు జరగడంతో ఆ పార్టీలో బలమైన నాయకుడు అంటూ లేడు. మండల స్థాయిలో కూడా టీఆర్ ఎస్‌ను ఎదుర్కునే దమ్మున్న లీడర్ లేకపోవడం గమనార్హం.
కానీ మహేందర్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ను వీడకుండా అలాగే ఉన్నారు. కేవలం ఎన్నికలప్పుడే ఆయన కనిపిస్తారు. అంతే గానీ.. మిగతా సమయాల్లో మండలం, గ్రామాల్లో ఆయన పర్యటించిన సందర్భాలు చాలా తక్కువ. ప్రజల సమస్యలపై పోరాడింది కూడా పెద్దగా లేదు. పెద్ద ఇష్యూ అయితే తప్ప ఆయన బయట పెద్దగా కనిపించరు.

సిరిసిల్లలో 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా బీజేపీకి పెద్ద పట్టు లేదు. కానీ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ కు ఇక్కడి నుంచి భారీగా ఓట్లు పడ్డాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ లో యూత్ ఎక్కువగా బీజేపీ వైపు చూస్తున్నారు. సిరిసిల్లలో కూడా యూత్ ఎక్కువగా బీజేపీ వైపు ఉన్నారు. ఈ నడుమ మండల స్థాయిలో చాలామంది బీజేపీలో చేరుతున్నారు. దీంతో టీఆర్ ఎస్‌కు కొంత చిక్కులు తప్పట్లేదు. ఇక్కడ మరో అంశం కూడా ఉంది.
బీజేపీ తరఫున కేటీఆర్ మీద పోటీ చేయగలిగే నాయకుడు లేడు. కాబట్టి కేకే మహేందర్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. పార్టీకి ఎలాగూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అది కేకేకు కలిసి వస్తుందని, ఆ విధంగా ఆయన్ను తీసుకు రావాలని చూస్తున్నారు.
అదే జరిగితే 2023 ఎన్నికల్లో కేటీఆర్ కు గట్టి పోటీ అయితే తప్పదు. అదే జరిగితే కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోతుంది. ఈ విషయాలను ముందుగానే గ్రహించిన కేటీఆర్.. నియోజకవర్గం కోసం బాగానే నిధులు ఖర్చు పెడుతున్నారు. గజ్వేల్ తరహాలో అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సిరిసిల్లలో ఉండే బలమైన సామాజిక వర్గం అయిన నేతన్నలకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా వారి కోసం కొన్ని స్కీములు పెడుతున్నారు.
Also Read: కాంగ్రెస్ తప్పులు సరే.. అధికారంలో ఉండి మీరు చేసిందేమిటి..? మోదీకి పలు ప్రశ్నలు
అయితే కేటీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటారని, నియోజకవర్గానికి రారనే విమర్శ అయితే బలంగా ఉంది. దీన్ని బీజేపీ వాడుకునే అవకాశం ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి కేకే పోటీ చేస్తే.. ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.

[…] […]