
KCR – Vizag Steel Bid : “మా కెసిఆర్ గొప్పోడు. భూదేవిని మించినంత ఉదారవాది. అందుకే మీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నాడు. ఆ పాపిష్టి మోదీ అదానీకి అమ్ముతుంటే సింగరేణి ద్వారా రక్షణ ఛత్రం అడ్డు పెట్టాడు.” సోషల్ మీడియాలో ఇలా సాగుతున్న భారత రాష్ట్ర సమితి ప్రచారానికి సింగరేణి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసింది. పంటి కింద ఇనుప గుగ్గిళ్ళను పెట్టినంత పని చేసింది..
విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్ లో పాల్గొంటామని ప్రకటన చేసిన సింగరేణి.. ఐదు రోజులు గడువు కోరడం భారత రాష్ట్ర సమితికి మింగుడు పడటం లేదు. వాస్తవానికి ఈ గడువు శనివారంతోనే ముగిసింది.. వైజాగ్ ఉక్కు పరిశ్రమ “ఆసక్తి వ్యక్తీకరణ” కోసం దరఖాస్తులు కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి అధికారుల బృందాన్ని పంపించింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో అధ్యయనం చేయించింది. అయితే ఈ సమయంలో తమకు ఐదు రోజుల గడువు కావాలని సింగరేణి యాజమాన్యం కోరింది. వైజాగ్ స్టీల్ యాజమాన్యం ఇందుకు అంగీకరించి ఈనెల 20 వరకు గడువు ఇచ్చింది. అంతేకాదు మిగతా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ లను మొత్తం 22 సంస్థలు వేశాయి. ఇందులో స్విట్జర్లాండ్ కు చెందిన ఇండో ఇంటర్ ట్రేడ్ ఏజీ, ఐఎంఆర్ మెటలర్జికల్ రిసోర్సెస్ ఏజీ సూరజ్ ముల్, ఇండో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ దుబాయ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్… ఇలా 22 సంస్థలు బిడ్లు చేశాయి. వీటిలో ఆరు వరకు విదేశీ సంస్థలు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒక సంస్థ మాత్రం ఎన్ని నిధులు కావాలన్నా కూడా సమకూరుస్తామని ఆఫర్ ఇచ్చింది..
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి బ్లాస్ ఫర్నేస్_3 ఏడాదిన్నరగా మూతపడి ఉంది.. కేవలం బీఎఫ్ 1,2 మాత్రమే ఉక్కును ఉత్పత్తి చేస్తున్నాయి. దీనివల్ల నిర్వహణ వ్యయం దారుణంగా పెరుగుతోంది. ఉత్పత్తి ధర కూడా అధికమవుతోంది. దీనివల్ల నష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్లాంటు పూర్తి సామర్థ్యంతో నడిస్తే తప్ప ఈ నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేదు. మరోవైపు బ్లాస్ ఫర్నేస్ 1,2 కు సంబంధించి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. వీటన్నింటికీ అవసరమైన ముడి పదార్థాలు, నిర్వహణ మూలధనం సమీకరణ కోసమే ఈవోఐ ఇచ్చారు.. బీ ఎఫ్_3 ని తిరిగి ప్రారంభించాలంటే ఏకధాటిగా నాలుగు నెలల సరిపడా అవసరమైన ముడి పదార్థాలను ముందుగానే సమీకరించుకోవాల్సి ఉంటుంది. బీఎఫ్ 1,2 కూడా పూర్తిస్థాయిలో ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ ఇతరాలు కూడా అవసరమవుతాయి. నెలకి 1000 కోట్ల చొప్పున, నాలుగు నెలలకి కనీసం నాలుగు వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ ఒక్కరు సమకూర్చినా, మరింతమంది చేరినా సరే ఒప్పందాలు జరుగుతాయని అంటున్నారు.
అయితే ప్రస్తుతం కార్మికులకు జీతాలు ఇచ్చేందుకే ఇబ్బంది పడుతున్న సింగరేణి సంస్థ ఈ స్థాయిలో ఆర్థిక భారాన్ని మోయగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో బిడ్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సింగరేణి సంస్థ.. తనకు ఐదు రోజుల గడువు కావాలని కోరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైజాగ్ స్టీల్ విషయంలో ముఖ్యమంత్రి తొందరపడి నిర్ణయం తీసుకున్నారని, తన రాజకీయ ప్రయోజనం కోసం సింగరేణి సంస్థను బలి పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొన్నటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో సింగరేణి సంస్థ చేస్తున్న అధ్యయనాలను ఆకాశానికి ఎత్తేసి రాసిన నమస్తే తెలంగాణ.. ఐదు రోజుల గడువు కోరే విషయాన్ని మాత్రం విస్మరించింది. అంటే దాదాపుగా ఈ బిడ్ నుంచి సింగరేణి సంస్థ తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ 20వ తేదీలోపూ బిడ్ దాఖలు చేస్తే.. పోటీ సంస్థలకు మించి సింగరేణి ఇవ్వాల్సి ఉంటుంది. అది సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సింగరేణికి అంత సత్తా గనక ఉండి ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత ప్రేమ గనుక ఉండి ఉంటే తాడిచర్ల గనులు ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.