https://oktelugu.com/

ఇదే జరిగితే సీఎంలు, నేతలు  శాశ్వతంగా తప్పుకోవాల్సిందేనా?

నేరమయమైన రాజకీయాల్లో ప్రక్షాళన మొదలుకాబోతోందా..? నేరచరిత కలిగి ఉన్న నేతలంతా తప్పుకునే పరిస్థితి రాబోతోందా..? గురువారం సుప్రీంకోర్టుల న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలు వీటికి బలాన్ని చేకూర్చుతున్నాయా..? క్రిమినల్‌ కేసులతోపాటు మనీ ల్యాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టం మొదలైన ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్‌ కేసుల వివరాలు రెండు రోజుల్లో సమర్పించాలని కోరడం ప్రజాప్రతినిధుల్లో భయం మొదలైందా..? Also Read: తెలుగు నేతలను పక్కనపెట్టిన కాంగ్రెస్? తెలంగాణ రాష్ట్రంలో 77 […]

Written By: , Updated On : September 12, 2020 / 12:55 PM IST
criminal political leaders

criminal political leaders

Follow us on

criminal political leaders

నేరమయమైన రాజకీయాల్లో ప్రక్షాళన మొదలుకాబోతోందా..? నేరచరిత కలిగి ఉన్న నేతలంతా తప్పుకునే పరిస్థితి రాబోతోందా..? గురువారం సుప్రీంకోర్టుల న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలు వీటికి బలాన్ని చేకూర్చుతున్నాయా..? క్రిమినల్‌ కేసులతోపాటు మనీ ల్యాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టం మొదలైన ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్‌ కేసుల వివరాలు రెండు రోజుల్లో సమర్పించాలని కోరడం ప్రజాప్రతినిధుల్లో భయం మొదలైందా..?

Also Read: తెలుగు నేతలను పక్కనపెట్టిన కాంగ్రెస్?

తెలంగాణ రాష్ట్రంలో 77 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులున్నాయి. 10 మంది ఎంపీలు, 67 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై అత్యధికంగా 52 కేసులు, ఎంపీ రేవంత్‌రెడ్డిపై 42 కేసులున్నాయి. తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల సత్వర పరిష్కారానికి ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానంలో 118 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని 2007లో నమోదైన కేసులుండటం గమనార్హం. సీఎం కేసీఆర్‌పైనా నాలుగు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌పై రెండు, కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌పై తలో కేసు పెండింగ్‌లో ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అత్యధికంగా 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 7 కేసులతో రేవంత్‌రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. 6 కేసులతో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మూడో స్థానంలో ఉన్నారు. 5 కేసులతో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 4 కేసులతో మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌పై రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలపై సుమారు 500 కేసులు ఉండగా, కొన్ని మాత్రమే ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి.

Also Read: బీజేపీ బండి సంజయ్ ముందున్న సవాళ్లు ఇవే..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2018 ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసింది. కోర్టు ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత జడ్జిని నియమించారు. ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు చేయలేదు. రాజకీయ నాయకులపై విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లోధా ఇచ్చిన తీర్పు అమలు కాకపోవడం, 2016లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినప్పటికీ విచారణలు ఆలస్యం కావడం కారణంగానే సుప్రీంకోర్టు రంగంలోకి దిగిందని భావిస్తున్నారు. గురువారం జస్టిస్‌ రమణ జారీ చేసిన ఆదేశాల్లో శిక్షపడ్డ నేరచరితులైన ప్రజాప్రతినిధులను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని 2016లో దాఖలైన పిటిషన్‌నూ పరిగణనలోకి తీసుకోవడం కీలకమైనదని వారు అంటున్నారు. ఒకవేళ నిషేధం వేటు పడితే చాలా మంది సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.