Shock For Ippatam Villagers: రాజకీయ కక్షలకు ఇప్పటం గ్రామస్థులు బలయ్యారు. కేవలం జనసేన ఆవిర్భావ సభకు స్థలాలిచ్చారని రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చేశారు. నాడు ప్రభుత్వ పెద్దల మాటలు పెడచెవిన పెట్టారన్న కారణం చూపి రకరకాలుగా హింసించబడుతున్నారు.వారిపై ఏపీ సమాజం మొత్తం సానుభూతితో ఉన్నా వారికి స్వాంతన చేకూర్చలేకపోతున్నారు. ఇప్పుడు కోర్టులో మరోసారి బాధితులుగా మిగిలారు ఇప్పటం గ్రామస్థులు. కూల్చివేతకు సంబంధించి నోటీసులిచ్చినా.. ఇవ్వలేదని కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కో రైతుకు రూ.లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది. 14 మంది రైతులు రూ.14 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంది. అయితే రైతులు చేసినది ముమ్మాటికీ తప్పే. దానిని ఎవరూ కాదనలేరు. కానీ ప్రభుత్వ తప్పుదోవ పట్టిస్తున్న కేసుల సంగతేంటి? అన్న వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది. ప్రతిరోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు దాఖలవుతున్నాయి. కొన్ని కేసులు వాదనలకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏ కేసుకూ సరైన వివరాలు అందించడం లేదు సరికదా తప్పుదోవ పట్టిస్తున్నవే అధికం. మరి ఈ లెక్కన ప్రభుత్వానికి ఇంకెంత శిక్షవేయాలి?

పోనీ కోర్టు కేసులు అమలవుతున్నాయా అంటే అదీ లేదు. ఏడాదిలో వేలాదిగా ధిక్కరణ పిటీషన్లు దాఖలవుతున్నాయి. ఏ కేసును పరిశీలించినా ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదు. చివరకు విశాఖలో రుషికొండ కేసునే తీసుకుందా. కొండను పూర్తిగా తొలగించినా.. అందుకు తగ్గ వివరాలు కోర్టుకు అందించలేదంటే దానిని ఏమనాలి? ఈ కేసు విషయంలో ప్రభుత్వం కోర్టుకు ఎన్నిసార్లు తప్పుదోవ పట్టించిందో చెప్పనక్కర్లేదు. అటు అక్కడ పనులు చేస్తూనే మరోవైపు.. ఇప్పటికీ కోర్టుకు అదే చెబుతూ కాలం వెళ్లదీస్తోంది. ఇప్పటివరకూ ఫలానా కేసులో సవ్యంగా వివరాలు అందించందంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అయినా పారా హుషార్ గా ప్రభుత్వం ఉంది. కోర్టుకు చెప్పకుండా ఎన్నో దురాగతాలకు పాల్పడింది. మరెన్నో వాస్తవాలను మరుగున పరచింది. వాటితో పోలిస్తే మాత్రం ఇప్పటం గ్రామస్థులు చేసినది పొరపాటు మాత్రమే. అందులో అవగాహన లోపమే ఎక్కువగా కనిపిస్తోంది.

ఒక వైపు కళ్లెదుటే కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుండడం చూసి కన్నీరు పెట్టుకోవడం తప్ప.. వారేమీ చేయలేకపోయారు. న్యాయస్థానానికి వెళితే తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. నోటీసులిచ్చారని చెబితే ఎక్కడ న్యాయస్థానం జోక్యం చేసుకోదో అని భావించారు. అది తప్పు అని తెలిసినా తప్పనిసరి అయి చేశారు. అయితే కోర్టు ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆగలేదు. కోర్టు ఆర్డర్ వచ్చిన తరువాత కూడా అవి కొనసాగాయి. అటు జరగాల్సిన నష్టం జరిగిపోగా.. ఇప్పుడు కొత్తగా కోర్టును తప్పుదోవ పట్టించారన్న అపవాదును ఇప్పటం రైతులు మూటగట్టుకున్నారు. రూ.లక్ష జరిమానాకు బాధ్యులయ్యారు. అధికారంలో ఉన్నవారు అంతులేని అధికార దాహంతో విర్రవీగితే బాధితులకు గుర్తుచ్చేది న్యాయస్థానాలే. ఇప్పుడు అవే న్యాయస్థానాలు జరిమానా రూపంలో బాధితులను భయపడుతుంటే .. ఇక వారికి దిక్కెవరు? అన్యాయం జరిగిందని అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించేదెవరు?