Homeఅంతర్జాతీయంShehbaz Sharif: ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బ.. నిజం ఒప్పుకున్న పాక్‌ ప్రధాని షరీఫ్‌!

Shehbaz Sharif: ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బ.. నిజం ఒప్పుకున్న పాక్‌ ప్రధాని షరీఫ్‌!

Shehbaz Sharif: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్, భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ దాడులతో నష్టం జరిగినట్లు తొలిసారి బహిరంగంగా అంగీకరించారు. గతంలో ఈ దాడులను తేలిగ్గా తీసిపారేసి, తమ సైన్యం విజయం సాధించిందని ప్రకటించిన షరీఫ్, తాజా వ్యాఖ్యలతో భారత సైనిక శక్తిని ఒప్పుకున్నారు. ఈ సంఘటన భారత్‌–పాక్‌ సంబంధాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.

Also Read: ఆపరేషన్ సిందూర్’తో చైనా వెన్నులో వణుకు.

ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్‌ మాట్లాడుతూ, ‘‘మే 9–10 మధ్య రాత్రి 2:30 గంటలకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సయ్యద్‌ అసీమ్‌ మునీర్‌ నాకు సురక్షిత ఫోన్‌లైన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. భారత్‌ బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ ద్వారా నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తో సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసిందని తెలిపారు’’ అని వెల్లడించారు. ఈ దాడులు ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా జరిగాయని, పాక్‌ వైమానిక దళం దీటుగా స్పందించినప్పటికీ భారత మిస్సైల్స్‌ తమ లక్ష్యాలను చేరాయని ఆయన అంగీకరించారు. నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్, రావల్పిండి సమీపంలోని వ్యూహాత్మక సైనిక కేంద్రం, 1971 యుద్ధంలో కూడా భారత దాడులకు గురైన చరిత్ర కలిగి ఉంది.

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యం
ఏప్రిల్‌ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది, ప్రధానంగా హిందూ పర్యాటకులు, ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించింది. పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (్కౌఓ)లోని 9 ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన మిస్సైల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో జైష్‌–ఏ–మహమ్మద్, లష్కర్‌–ఏ–తొయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం, సైన్యం, నౌకాదళం సమన్వయంతో పనిచేశాయి.

పాక్‌ స్పందన..
షరీఫ్‌ మొదట ఈ దాడులను ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించి, తమ సైన్యం 5 భారత యుద్ధ విమానాలను కూల్చిందని ప్రకటించారు. అయితే, ఈ వాదనకు ఆధారాలు లేకపోవడంతో పాక్‌ వాదనలు బలహీనపడ్డాయి. షరీఫ్‌ తాజా ఒప్పుకోలు, దాడుల తీవ్రతను అంగీకరించడం, పాక్‌ అంతర్గత రాజకీయ ఒత్తిళ్లను సూచిస్తుంది. పాక్‌ పార్లమెంట్‌లో షరీఫ్‌పై సొంత పార్టీ ఎంపీల నుండి విమర్శలు రావడం, ఆయన నాయకత్వంపై ప్రశ్నలు లేవడం గమనార్హం.

అంతర్జాతీయ ప్రతిస్పందన
ఈ దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా, రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఉభయ దేశాలను సంయమనం పాటించాలని కోరాయి. భారత్‌ తన దాడులు ఉగ్రవాద కేంద్రాలపైనే జరిగాయని, పౌర స్థావరాలను లక్ష్యంగా చేయలేదని స్పష్టం చేసింది. మే 10న ఉభయ దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, దీర్ఘకాలిక శాంతి అస్పష్టంగా ఉంది.

షరీఫ్‌ ఒప్పుకోలు ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని, భారత సైనిక శక్తి కచ్చితత్వాన్ని ధ్రువీకరిస్తుంది. ఈ సంఘటన పాక్‌ రాజకీయ, సైనిక వ్యవస్థలోని బలహీనతలను బయటపెట్టింది. భవిష్యత్తులో ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం, దౌత్యపరమైన చర్చలు కీలకం కానున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version