
ఎత్తుల జిత్తుల్లో రాజకీయ చాణక్యుడు మన కేసీఆర్ సారు. ఈ టీఆర్ఎస్ అధినేత ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్న సరే తనదైన రోజున తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారి మలుపు తిప్పగల యోధుడు. అలాంటి ఉద్దండుడు ఊరికే ఉండడు అంటారు. ఇప్పుడు బీజేపీ దూసుకొస్తున్న వేళ సడెన్ గా షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి దిగడం.. పవన్ యాక్టివ్ కావడం వెనుక కేసీఆర్ హస్తం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణలో గత కొన్ని నెలలుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆరేళ్లుగా ఏక ఛత్రాదిఫత్యం నడిపిన టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మేమున్నామంటూ బీజేపీ రెండు ఎన్నికల్లో ఝులక్ ఇచ్చింది. అయితే వ్యూహాత్మకంగా ఆ పార్టీని ఎదురుదెబ్బ కొట్టిన కేసీఆర్ కు షర్మిల రూపంలో మరో తలనొప్పి తయారైంది. అయితే అందరూ షర్మిల పార్టీ పెడితే టీఆర్ఎస్ కు ఎఫెక్ట్ అవుతుందా..? అని ఆలోచిస్తున్నవారు కొందరైతే.. షర్మిల రాజకీయ ప్రవేశం గులాబీ దళానికి మేలే జరుగుతుందని అనుకుంటారు. షర్మిలకు తోడుగా ‘జనసేన’లు కలిసి కేసీఆర్ కు మరోసారి అధికారాన్ని కట్టబెట్టేలా ప్రయత్నిస్తున్నారని వారి తీరును చూస్తే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పెద్దగా మెజారిటీ సాధించలేదు. అయితే అధికారంలోకి రావడానికి మాత్రం మార్గం సుగమనం అయింది. ఆ తరువాత పార్టీ అధినేత కేసీఆర్ తన వ్యూహంతో ప్రత్యర్థి బెడద లేకుండా చేశాడు. దీంతో ముందుగా టీడీపీ, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆంధ్రోళ్ల పార్టీలేంటి..? అనే ప్రచారాన్ని వాడుకున్న కేసీఆర్ ఆ పార్టీలపై ప్రజల నమ్మకాన్ని పోయేలా చేశాడన్నది పొలిటికల్ గా చర్చ సాగింది.
ఇక ఆరేళ్లుగా తిరుగులేని శక్తిగా పాలన సాగించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఝులక్ ఇచ్చింది. కేసీఆర్ ను జైలుకు పంపిస్తానన్న వ్యాఖ్యలతో కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రెండు చోట్ల బీజేపీ పటిష్టం కావడానికి కారకుడయ్యాడు. అయితే ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అది సాధ్యం కాలేదు. దీంతో అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించడంతో బీజేపీని పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు.
కొన్ని నెలలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ షర్మిల వైఎస్ అభిమానులతో సమావేశమవుతూ వస్తున్నారు. త్వరలోనే పార్టీ పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై వాడీ వేడీ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నుంచి కార్యకర్తలను స్పందించొద్దని ఆర్డర్ వేసిన అధినేత పెద్ద ప్లాన్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ, ఆమె రాజకీయ ఎంట్రీతో తనకు లాభం చేకూరడమే తప్ప నష్టం లేదని భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే గతంలో ఆంధ్రోళ్ల పెత్తనమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజల ఓట్లను మూటగట్టుకున్నాడు. ఇప్పుడ షర్మిల పార్టీ పెడితే మరోసారి ఆ వాదనను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా ఏ రాష్ట్రంలో బలంగా లేని జనసేన కూడా టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో జరిగిన గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు జనసేన పరోక్షంగా మద్దతిచ్చినట్లు గుసగుసలు వచ్చాయి. దీంతో అటు షర్మిల, ఇటు పవన్ కల్యాన్ లు కలిసి 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను మరోసారి అధికారంలో కూర్చొబెట్టే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది.