YS Sharmila Meet Jagan: వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్ ను ఎట్టకేలకు కలిశారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సోదరి చెంతకు చేరారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత జగన్ తో షర్మిలకు సంబంధాలు తెగిపోయాయి. కనీసం వారి మధ్య మాట పలకరింపు కూడా లేదు. గతంలో వైయస్సార్ వర్ధంతి, జయంతి క్రిస్మస్ వేడుకల్లో ఇద్దరూ కలిసే పాల్గొనేవారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కలిసిన దాఖలాలు లేవు. సరిగ్గా కాంగ్రెస్ పార్టీలో చేరిక ముందే షర్మిల జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించి ఈ నెల 18న నిశ్చితార్థం, వచ్చేనెల వివాహం జరగనుంది. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందించేందుకు తాడేపల్లికి షర్మిల వెళ్లారు. అక్కడ ఆమెకు ఆత్మీయ స్వాగతం కనిపించింది. నిన్ననే ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ఆహ్వాన పత్రిక ఉంచి ఆశీర్వాదం అందుకున్నారు. ఈరోజు అక్కడ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ పగ్గాలు అందుకోనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు, పార్టీ శ్రేణులు షర్మిల కు మద్దతు తెలపడం విశేషం. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన అనుచరులతో రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాడేపల్లి లోని జగన్ నివాసానికి షర్మిల తో పాటు ఆమె తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, నూతన వధువు అట్లూరి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వారికి ఆత్మీయ స్వాగతం పలికినట్లు సమాచారం. తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని సోదరుడు జగన్ తో పాటు వదిన భారతీలను షర్మిల ఆహ్వానించారు. వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని షర్మిల విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ పగ్గాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో సోదరుడు జగన్ తో ఆ విషయం ఏమైనా చర్చించి ఉంటారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ బయటికి మాత్రం వెల్లడి కాలేదు. అది కేవలం వ్యక్తిగత పర్యటనే తప్ప రాజకీయాలకు తావు లేదని షర్మిల దగ్గర వర్గాలు చెబుతున్నాయి.