
ఏపీ రాజకీయాల్లోకి ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ లాగానే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ పాత్రను వైఎస్ షర్మిల తీసుకోనుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల సైతం ఇప్పుడు తెలంగాణ ప్రజల తరుఫున ప్రశ్నిస్తానంటోంది. ఖమ్మంలో జరిగిన సంకల్ప సభలో ఫక్తు టీఆర్ఎస్ సర్కార్ ను, కేసీఆర్ పాలన తీరును ఎండగట్టిన షర్మిల ఇప్పుడు తెలంగాణ ప్రజల గొంతుకనై నిలుస్తానంటోంది. ఈ క్రమంలో తొలి పోరాటానికి వైఎస్ షర్మిల సిద్ధమైంది.
ఈ నెల 15 నుంచి హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర షర్మిల దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో వైఎస్ షర్మిల దీనిపై చేసిన ప్రకటనను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన ఆమె నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న వైఎస్ షర్మిల ప్రజల్లోకి తమ పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు అర్థమవుతోంది.
నిన్న ఖమ్మంలో జరిగిన సభలో మాట్లాడిన షర్మిల.. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయకుంటే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. దీనిపైనే ఆమె అనుచరులు శనివారం స్పష్టత ఇచ్చారు.
ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర షర్మిల దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఆమె దీక్ష చేసినప్పటికీ సర్కారు స్పందించకుంటే ఇతర జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆమె అనుచరులు చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల నిరాహార దీక్ష ఎలాంటి ప్రభావం చూపనుంది? ఆమె తెలంగాణ రాజకీయాలపై ఎలా ముందుకెళ్లనుందని మున్ముందు తెలియనుంది.