Vijayamma- Sharmila: కురుక్షేత్రంలో రక్తసంబంధికులను, దాయాదులను చూసి అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తానని చెప్పగా.. కృష్ణుడు గీతను బోధిస్తాడు. గీతానుసారం నడుచుకోవాలని కూడా సూచిస్తాడు. దీంతో కౌరవసేనపై యుద్ధం చేస్తాడు. ఇప్పుడు తెలుగునాట అటువంటి కురుక్షేత్రమే నడుస్తోంది. అయితే స్ట్రయిట్ ఫైట్ అయితే కాదు. అంతా లోలోపలే. ఈ ఫైట్ లో కుటుంబ సభ్యులు, రక్తసంబంధం.. ఇలా ఏవీ అక్కరకు రావడం లేదు. అవి అవసరం లేనట్టుగా ఇక్కడి రాజకీయాలు నడుస్తున్నాయి. నాడు కృష్ణుడు నడిపించినా.. ఇప్పుడు పరిస్థితులే నడిపిస్తున్నాయి. తల్లికొడుకులను వేరుచేస్తున్నాయి. తోడబుట్టిన వారి మధ్య అగాథం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలో రాజకీయాలకు సమిధిగా మారుతున్న కుటుంబాల జాబితాలో మరో కుటుంబం చోటు దక్కించుకుంటోంది. అదే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఎంతవారులైన కాంతదాసులే అన్న నానుడి మాదిరిగానే… రాజకీయ వికృత క్రీడలో వైఎస్ఆర్ కుటుంబం కూడా బాధితురాలిగా మిగులుతుండడం ఆవేదన కలిగిస్తోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో అదో వసుదైక కుటుంబం. ఆ ఫ్యామిలిలో మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. కుటుంబ బాధ్యతల వరకే పరిమితమయ్యేది. ఏవో వేదికల్లో కనిపించేవారు. కానీ వైఎస్సార్ అకాల మరణం తరువాత రాజకీయ పరిస్థితులు ఆ కుటుంబ మహిళలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకు కారణమయ్యాయి. కుమారుడికి అధికారాన్ని అందివ్వాలన్న ఆరాటం వైఎస్ విజయలక్ష్మి, సోదరుడికి అండగా ఉండాలని షర్మిళ చేయని ప్రయత్నం లేదు. జగన్ 16 నెలల జైలు జీవితంలో వైసీపీని నిలబెట్టడానికి వైఎస్ షర్మిల ఏపీ మొత్తం పాదయాత్ర చేసి రాత్రనక పగలనక పాటుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘బైబై బాబు’ అంటూ షర్మిల తెగ ప్రచారం చేసి అన్న జగన్ గెలుపునకు పాటుపడ్డారు. జగన్ ను సీఎం చేశారు. కానీ సీఎం అయ్యాక జగన్ అటు తల్లి విజయమ్మను పార్టీ అధ్యక్షురాలు పదవి వదులుకునేలా చేశాడు. చెల్లికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా దూరం పెట్టాడు. దీంతో వీరిద్దరూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో నిలబడి మరీ పోరాటం చేస్తున్నారు.
అయితే నాడు తాము అండగా నిలిచిన కుమారుడు జగన్ తల్లి విజయలక్ష్మి చేయిని పట్టుకొని పైకి లేపలేదు. కష్టకాలంలో నేను ఉన్నాను చెల్లెమ్మ అని షర్మిళకు భరోసా కల్పించలేదు. తెలంగాణ నడిరోడ్డుపై నిల్చున్న తల్లీ చెల్లెలను కనీసం పలకరించిన పాపాన పోలేదు. సహజంగా ఇది వారికి కృంగదీసే విషయం. పైగా వారు మహిళామూర్తులు. వారి స్వభావం ఎంత మృదువుగా ఉంటుందో.. అంతే కఠినంగా వ్యవహరిస్తారు. ఎంతటి తల్లి మనసు అయినా గాయపడుతుంది. అందునా ఆడపడుచు కష్టాల్లో ఉందని తెలిసినా పట్టించుకోని కుమారుడిపై కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అదే సీన్ విజయలక్ష్మిలో కూడా కనిపింది. ఆ ఆక్రోశంలోనే ‘ ఆ జగన్ మోహన్ రెడ్డితో.. ఆ ఆంధ్ర రాష్ట్రంతో మనకేంటమ్మా’ అని విజయలక్ష్మి అనేశారు. కుమారుడి జగన్ మరింత పలుచన చేశారు. ఇరకాటంలో పెట్టేశారు. దీనికి వైసీపీ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మరింత ఆజ్యం పోశారు. ‘విజయమ్మ, షర్మిళలు తెలంగాణలో చేస్తున్న పోరాటానికి వైసీపీకి ఏం సంబంధం? జగన్ కు ముడిపెట్టడం సరికాదు’ అంటూ వారి మధ్య బంధాన్ని ఒక్క మాటతో తెంచేశారు.

ఈ టైము కోసమే వెయిట్ చేస్తున్న పచ్చ మీడియా ఊరుకుంటుందా? మా ఎన్టీఆర్ కుటుంబంలోనే కాదు.. వైఎస్సార్ కుటుంబంలోనూ కూడా విభేదాలున్నాయని.. అధికారం కోసం ఎంతటి దాకైనా వెళతారని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జగన్ తో తమకు సంబంధం లేదని విజయమ్మ అన్నారో లేదో పచ్చ మీడియా విరుచుకుపడుతోంది. షర్మిల అరెస్ట్ అయినా.. తల్లి విజయమ్మ నడిరోడ్డుపై ధర్నాలు చేసినా ఏపీకి సీఎం అయ్యిండి వారి కోసం పాటుపడవా? అంటూ జగన్ ను తిట్టిపోస్తున్నారు. నీకోసం.. నీ పార్టీకోసం పాటుపడ్డ తల్లిచెల్లికి కనీసం మద్దతు పలకవా? నైతికంగా అండగా నిలబడవా? అంటూ శాపనార్థాలు మొదలుపోట్టేశారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. ఈ ఎపిసోడ్ తో తెలంగాణలో ఇప్పటివరకూ షర్మిళను పట్టించుకోని మీడియా హైప్ ఇచ్చింది. వైఎస్సార్ టీపీ ఒకటుందని గుర్తు చేసింది. కానీ జగన్ కు మాత్రం భారీగా డ్యామేమ్ చేసింది. వైఎస్సార్ అభిమానులను జగన్ ను దూరం చేసేందుకు దోహదపడుతోంది. అటు విజయమ్మ, ఇటు షర్మిళ చర్యలు కూడా అదే కోరుకున్నట్టు అభిప్రాయం తెలుగునాట వ్యాప్తి చెందుతోంది.