Sentiment politics: సానుభూతి పవనాలు రాజకీయ నాయకులకు సాయం చేసే రోజులు పోయాయి. ప్రజలు ఈ సానుభూతిపై విరక్తతో ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా ఇక సానుభూతితో గెలవలేమని.. ప్రజలు దీనికి కరగడం లేదని తెలుసుకున్నారు. అందుకే ఈ సానుభూతి అస్త్రాన్ని పక్కనపెట్టి గెలుపు సోపానం ఎక్కడానికి ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నారు. నాయకులు ఎంత గుక్కపెట్టి ఏడ్చినా జనాలు వినోదంగా.. ఓ రియాలిటీ షో చూసినట్టు చూస్తున్నారే తప్ప పెద్దగా స్పందించడం లేదు. తాజాగా చంద్రబాబు కన్నీళ్లకు వచ్చిన స్పందన చూశాక ఇదే అర్థమైంది.
బాధితుడిగా ఆ సానుభూతిని ప్లే చేయడం.. దానిపై ప్రజల ముందు బోరుమనడం తాజా రాజకీయాల్లో అతిపెద్ద జోక్ గా చెప్పొచ్చు. చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ ఆయన ఇమేజ్ కు.. ఆయన పార్టీకి నల్లటి మచ్చగా నిలిచింది. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రగురామకృష్ణం రాజు కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. సానుభూతి కార్డును ఉపయోగిస్తూ సెంటిమెంట్ రగిలిస్తున్నాడు.
తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తనపై దేశ ద్రోహం కేసు ఎపిసోడ్ లో పోలీసులు చాలా దారుణంగా కొట్టారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. పెద్ద పెట్టున కేకలు వేశానని వాపోయాడు. అయితే రఘురామ చేసే చేష్టలకు.. జగన్, వైసీపీపై చేసిన విమర్శలకు ఆయనకు సానుభూతి దక్కలేదు. రాజకీయాల్లో తట్టుకొని నిలబడాలి.. లేదా పోరాడాలి.. కానీ బహిరంగంగా ఏడవకూడదు.. అదే ఇప్పుడు చంద్రబాబు, రఘురామకు మైనస్ గా మారింది.
కొన్నాళ్ల క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా జైలు పాలై అష్టకష్టాలు పడ్డాడు. అయినా ఏనాడు బాధితుల కార్డును వాడలేదు. మొదట తన ఓర్పుతో ఉండి.. తరువాత శక్తితో పోరాడాడు. జగన్ పై నమోదైన కేసులు, అతడిపై ప్రయోగించిన చిత్రహింసులు ఊహించలేనంత పెద్దవి.
ప్రజలు ఎప్పుడూ కూడా బలమైన నాయకులకు వెన్నుదన్నుగా నిలుస్తాయి.. కానీ బలహీనంగా ఏడిస్తే వారికి సామర్థ్యం లేదని పక్కనపెడుతారు. శాంతియుత పాలన కావాలని.. తమ నాయకుడు మానసికంగా ధృఢంగా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు.
చంద్రబాబు ఎంత ఏడ్చినా టీడీపీ నాయకుల్లో ఒక్కరు కూడా నోరు విప్పి ఆయనకు మద్దతుగా పవర్ ఫుల్ గా మాట్లాడలేదు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అయితే సీఎం జగన్ పై బూతులు తిట్టినప్పుడు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చంద్రబాబు కన్నీళ్లతో మౌనం దాల్చడం పలుచన అయ్యారు. నాయకులు ఎప్పుడూ ప్రజల్లో బలహీనంగా కనిపించకూడదనే కఠోరనిజం ఇదీ.
రఘురామకృష్ణం రాజు తన సానుభూతి కార్డుతో ప్రజలనుంచి కాస్తంత పాపులారిటీ పొందాలని ఆశిస్తున్నారు. అయితే ఇలా ఏడ్చే మొగాళ్లను ఇంట్లో వాళ్లే కాదు.. జనాలు కూడా నమ్మరని.. సానుభూతి మంత్రం ఇక రాజకీయాల్లో పనిచేయదని వారు గుర్తుంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.