
MLA Rachamallu Sivaprasad Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ శ్రేణులు, నాయకులు అవసరానికి మించి రియాక్ట్ అవుతున్నారు. పులివెందులలో పలువురు నిరసన తెలియజేయగా.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఒక అడుగు ముందుకు వేసి భాస్కర్ రెడ్డికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడితో ఆగకుండా పలు చానల్లో నిర్వహించిన డిబేట్లలో పాల్గొని న్యాయాన్యాయాలను కూడా ఆయనే చెప్పేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే కాస్త లాయరుగా మారిపోయారంటూ పలువురు చలోక్తులు విసురుతున్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారుల పురోగతి సాధించారు. ఆదివారం ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్రెడ్డి అయితే ఈ కేసుకు సంబందించి కీలక నిర్ణయాలు చెప్పేస్తున్నారు. అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి మద్దతుగా బలమైన వాదనను ఎమ్మెల్యే వినిపిస్తుండడం గమనార్హం.
కుట్రపూరితంగా విచారిస్తున్నట్లు ఆరోపణలు..
ఈ అరెస్టుకు సంబంధించి, సిబిఐ విచారణకు సంబంధించి పలు చానల్లో నిర్వహించిన డిబేట్లలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. సిబిఐ విచారిస్తున్న తీరును తప్పుపట్టారు. వైఎస్ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సిబిఐ కుట్రపూరితంగా విచారిస్తున్నట్లు ఆరోపించారు. మొదట్లో వివేక కుమార్తె తన తండ్రిని హత్య చేసిన వారిలో టిడిపి నేతల పేర్లు ప్రస్తావించారన్నారు. మరి వారిని ఇప్పుడు ఎందుకు ఆమె పట్టించుకోవడంలేదని రాచమల్లు ప్రశ్నించడం గమనార్హం. వివేకానందరెడ్డని హత్య చేయడం వల్ల వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డిలకు వచ్చే ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు.

కీలక అంశాలు వెల్లడించిన రాచమల్లు..
ఈ సందర్భంగా పలు మీడియా ఛానళ్లతో మాట్లాడిన ఆయన కీలక అంశాలను వెల్లడించారు. ఈ హత్య వెనుక వివాహేతర, ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరు, వివేకా రెండో భార్య, ఆమె కుమారుడుకు ఆస్తి రాయించడం తదితర అంశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశాల్లో సిబిఐ సరిగా విచారణ సాగించడం లేదని ఆయన ఆరోపించారు. న్యాయపోరాటం చేస్తామని, అంతిమ విజయం తమదే అంటూ గట్టిగా వాదన వినిపిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం ఏ ఛానల్ చూసిన వైసీపీ తరఫున ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బలమైన వాదన వినిపిస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఎమ్మెల్యే కాస్త లాయర్ అవతారం ఎత్తారని పలువురు చెప్పుకుంటుండడం గమనార్హం.