
Mekapati Chandrasekhar Reddy: ఎన్నికలకు ఇంకా పదిహేను నెలల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీ కూడా బలహీనంగా ఉంది. కానీ ఆ ఎమ్మెల్యే అధికారం వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. తాడోపేడో తేల్చుకుంటానంటూ సంకేతాలిచ్చాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే అధినేతను ధిక్కరించడానికి కారణమేంటన్న చర్చ జరుగుతోంది. అధికారం మళ్లీ రాదనా ? లేదా ఎమ్మెల్యే టికెట్ ఇక రాదనా ?. ఇప్పుడు ఏపీలో ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలియనివారు ఉండరు. వైసీపీలో ఆ కుటుంబం అంత కీలకమైనది. వైఎస్ జగన్ వెంట మొదటి నుంచి నడుస్తోంది. కాంగ్రెస్ ను ధిక్కరించి జగన్ కోసం పాటుపడింది. అలాంటి కుటుంబానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అధిష్టానం పై ఫైర్ అయ్యారు. తాడోపేడో తేల్చుకుంటానని తేల్చిచెప్పాడు. చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు సృష్టించాయి. అప్పటికే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్ఠానం పై ధిక్కార పతాకం ఎగురవేశారు. వారికి జంటగా మేకపాటి వ్యాఖ్యలు జత కలిశాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక అయోమయం నెలకొంది.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యల వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మేకపాటికి వైసీపీ అధిష్ఠానం మొండిచేయి చూపే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగతంగా ఆయన పై ఉన్న ఆరోపణలే. ఇటీవల తనను కొడుకుగా గుర్తించాలని ఒక యువకుడు, అతని తల్లి మీడియాకెక్కారు. తనతో కొడుకుని కని ఇప్పుడు సంబంధం లేదంటూ మేకపాటి గోడదూకుతుండటంతో ఆయన భార్య రోడ్డెక్కింది. దీని పై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే అనేక ఆరోపణలు మేకపాటి పై ఉన్నాయి. కానీ వాటిని వైసీపీ పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ .. ఆయన కొడుకు వ్యవహారం పై మాత్రం సీరియస్ అయిందట.

మేకపాటికి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ప్రత్యర్థులు చేస్తుంటారు. అదే సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలతో డబ్బులు వసూలు చేయడం, ఇతర అవినీతి ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేకపాటిని దూరం పెట్టాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తోందని తెలుస్తోంది. ఇదే విషయం మేకపాటికి ఈపాటికే అర్థమైంది. దీంతో అధిష్ఠానం పై తాడోపేడో తేల్చుకుంటానని సిద్ధమైపోయారు. ఏదో ఒక కారణం చూపి పార్టీ నుంచి బయటికి రావాలని మేకపాటి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయగిరి సమన్వయకర్త ధనుంజయ్ రెడ్డి వ్యవహారాన్ని బూచిగా చూపించి వైసీపీ అధిష్ఠానం పై ధిక్కార స్వరం వినిపించాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
వైసీపీలో జరుగుతున్న పరిణామాలను టీడీపీ నిశితంగా పరిశీలిస్తోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి వస్తే టికెట్ ఇస్తారా ? అన్న ప్రశ్న పుడుతోంది. ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుస్తారా ? అన్న చర్చ జరుగుతోంది. కానీ మేకపాటిని టీడీపీ వాడుకునే ప్రయత్నం మాత్రం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్ ఇప్పటికే టీడీపీ రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే మేకపాటి ఆరోపణలతో సరిపెట్టుకుంటారా ? వైసీపీని వీడుతారా ? అన్నది వేచిచూడాలి.
