Revanth Reddy : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు..కానీ సొంత పార్టీలో ఉన్న నేతల వల్ల ఆయన అడుగులు ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు.. దీంతోపాటు కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి తీరు పై ఇటీవల భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమయ్యారు. వేరే కుంపటి పెట్టేందుకు కూడా వెనుకాడ లేదు. ఈ క్రమంలో అధిష్టానం రంగంలోకి దిగడంతో కొంతమేర పరిస్థితి సద్దుమణిగింది.. అదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ను కాంగ్రెస్ హై కమాండ్ వెనక్కి పిలిచింది..అదే సమయం లో మాణిక్ రావు థాక్రే ను కొత్త ఇన్ ఛార్జ్ గా నియమించింది.

మళ్ళీ కట్టెలు
సీనియర్ల వ్యవహార శైలితో తీవ్రంగా నొచ్చుకున్న రేవంత్ రెడ్డి తన అనుచరులతో పార్టీ పదవులకు రాజీనామాలు చేయించాడు. అంతేకాదు సీనియర్లపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క తో కలిసి పలువురు సీనియర్లు హై కమాండ్ వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారికి చివాట్లు తప్పలేదు. చేసేది ఏమీ లేక వెనక్కి తిరిగి వచ్చారు. అదే సమయంలో రేవంత్ రెడ్డికి మరింత బలాన్ని హై కమాండ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి లాగా దూకుడుగా పని చేయకపోతే అధికారంలోకి రావడం కష్టమని రాహుల్ గాంధీ వాళ్ళు తేల్చి చెప్పడంతో ఇప్పుడు సీనియర్లకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
పాదయాత్రకు బ్రేక్
జనవరి 26 న భద్రాచలం రామాలయం నుంచి పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా తన అనుచరులకు సంకేతాలు కూడా ఇచ్చారు. వారు క్షేత్ర స్థాయి ఏర్పాట్లలో తలమునకలయి ఉన్నారు. ఇదే సందర్భంలో మాణిక్ రావు థాక్రే పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అయితే ఇందులో ఓ వర్గం నాయకులు తాము కూడా పాదయాత్ర చేసుకుంటామని, అనుమతి ఇవ్వాలని కోరారు. మరి కొందరైతే రేవంత్ రెడ్డి యాత్ర చేస్తే ఆయన సొంత మైలేజ్ పెరుగుతుందని మాణిక్ రావు దృష్టికి తీసుకువచ్చారు. అసలే కాంగ్రెస్ పార్టీ కొడిగడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సంకల్పించడాన్ని హర్షించాల్సింది పోయి… అడ్డు పుల్లలు వేయడం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల తీరును తెలియజేస్తోంది.