
Dharmana Prasada Rao: పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే ప్రతిఘటిస్తుంది. ఎదురుదాడి చేస్తుంది. ఈ విషయం సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు తెలియనట్టుంది. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించాలనుకుంటున్నారు. అలూ మగల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. బలవంతంగా మీటింగ్ లు పెట్టి ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు. అయితే అందులో వాస్తవాలు గ్రహిస్తున్న ప్రజలు భయపడి పరుగులు తీస్తున్నారు. కట్టడి చేయాలని చూసినా వారు వినడం లేదు. ఈ మధ్యనే శ్రీకాకుళం నగరంలో ఆసరా పథకంపై సమావేశం పెట్టి ధర్మాన అబాసుపాలయ్యారు. గేట్లు వేసి మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినలేదు. కొందరు అయితే గోడలు ఎక్కి మరీ బయటకు వెళ్లిపోయారు. వారిని అదుపుచేయడానికి నిర్వాహకులు పడరాని పాట్లు పడ్డారు. ఇప్పుడు ధర్మాన మీటింగ్ అంటేనే అధికారులు, ప్రజాప్రతినిధులు హడలెత్తిపోతున్నారు.
కామెంట్స్ వైరల్..
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో మంత్రి పదవి దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు లోలోపల ఎందుకో కంగారు పడుతున్నారు. దీనిపై సొంత పార్టీ నేతలే తలోరకం చర్చించుకుంటున్నారు. ఇటీవల ధర్మాన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తరచూ హైలెట్ గా మారుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా ఎవరూ చేయనన్ని వ్యాఖ్యలను ధర్మాన చేశారు. మూడు రాజధానులకు మద్దతు తెలపకుంటే చచ్చిన శవంతో సమానమని పేర్కొన్నారు. ఈ విషయంలో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణులతో జైకొట్టించలేకపోయారు. ఇప్పుడు వైసీపీకి ఓటు వేయకుంటే బుల్లెట్ దిగుతుందంటూ మహిళలను బెదిరించారు. అక్కడితో ఆగకుండా పురుషులు పోరంబోకులుగా అభివర్ణించారు. శ్రీకాకుళం నుంచి మంత్రిగా ఉన్న ఆయన తమ ప్రజల్ని కించ పర్చడానికి బెదిరించడానికి కూడా వెనుకాడటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ రాజధాని కాకపోతే ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు.
మగవాళ్లను తిడుతున్నారు..
అయితే సీనియర్ గా ఉన్న తన మాటలను ప్రజలు గుర్తించడం లేదన్న బాధ మంత్రి ధర్మాన ను వెంటాడుతోంది. ఉత్తరాంధ్రకు రాజధానికి మద్దతు తెలపాలని ప్రజలను కోరుతున్నా పట్టించుకోలేదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో సైతం తమ తీర్పునిచ్చారు. దీంతో పరిస్థితి తేడాగా మారిపోతోందని గుర్తించిన తర్వాత ఆయన మరింత చెలరేగిపోతున్నారు. మహిళలు కూడా ప్రభుత్వానికి ఓట్లేయరని ఆయన నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే బెదిరింపులకు దిగుతున్నారు. ఆసరా పథకానికి జగన్ మీట నొక్కారు. కానీ డబ్బులు పడలేదు. అయినా సంబరాలు చేస్తున్నారు. ఈ సంబరాల్లో ధర్మాన పాల్గొని ఆడవాళ్లను బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతే వచ్చే డబ్బులు రావని అంటున్నారు. వైసీపీకి ఓటు వేయకపోతే అకౌంట్లలో డబ్బులు పడవని హెచ్చరిస్తున్నారు. ఇందు కోసం మగవాళ్లను తిడుతున్నారు. ఇంత సీనియర్ కి ఎందుకీ పరిస్థితి అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏదీ వర్కవుట్ కావడం లేదు..
ప్రధానంగా మహిళలను టార్గెట్ చేసుకొని వైసీపీ సర్కారు రకరకాల పథకాలను అమలుచేస్తోంది. అందుకే వారి మద్దతుతోనే గట్టెక్కుతామని భావిస్తోంది. కానీ అది వర్కవుట్ కావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే పథకాల రూపంతో పన్నులు, చార్జీల రూపంలో వసూలు చేస్తున్న వాటిపై మహిళలకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే వారికి ఎన్నిరకాల మభ్యపెట్టాలని చూసినా వారు వినడం లేదు. గేట్లు వేసి బలవంతంగా వారిని సభలు, సమావేశాల్లో కూర్చోబెట్టాలని చూసినా వారు వినడం లేదు. ఇటువంటి సమయంలో వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడాల్సిన మంత్రి ధర్మాన కంగారులో ఏవేవో మాటలు అనేసి.. అబాసుపాలవుతున్నారు. తన కంగారు ద్వారా ఓటమికి భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు.