Mani Shankar Aiyar: దేశంలో శల్య సారథులు ఎక్కువగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పొచ్చు. ఆ పార్టీలో ఉన్న విచ్చలవిడి ప్రజాస్వామ్యమో..లేక అధినాయకత్వాన్ని అప్పుడప్పుడు లైట్ తీసుకునే నేతల తత్వమో కానీ.. కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మాటలు ఆ పార్టీని అడ్డంగా ఇరికించేస్తున్నాయి. దీంతో సదరు నేతల గత,ప్రస్తుత స్టేట్మెంట్లను కవర్ చేయలేక పార్టీ అధినాయకత్వం నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ పాక్-భారత్ విదేశాంగ విధానంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారడం పెద్ద దుమారానికే దారితీసింది. పాక్ సర్వసత్తాక సార్వభౌమాధికారిక దేశమని..ఆ దేశంతో మనం గిచ్చుకోవడం మంచిది కాదని..ఆ దేశంతో కయ్యానికి కాలు దువ్వే బదులు..దాన్ని గౌరవించడం నేర్చుకుంటే బాగుంటుందన్నారు. అలా కాకుండా భారత్ తన మిలటరీ పాటవాన్ని చూపించాలని యత్నిస్తే..పాకిస్తాన్ ఇండియాపై అణుబాంబులు ప్రయోగించొచ్చన్నారు.
అయితే మణిశంకర్ అయ్యర్ చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించిన వీడియో లోక్ సభ ఎన్నికల వేళ సంచలనంగా మారింది. అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నిప్పులు చెరిగింది. మణిశంకర్ కామెంట్స్ ఆ పార్టీ మూల సిద్దాంతాలను ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు స్వరూపం ఇదేనంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అయితే ఎక్స్ వేదికగా అయ్యర్ వ్యాఖ్యలను తూర్పార పట్టేశారు. పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ యాసిన్ మాలిక్ వంటి ఉగ్రవాదులకు కూడా మద్దతునిచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని హేద్దేవా చేశారు. మరో బీజేపీ నేత షెహజాద్ పునావాలా అయ్యర్ వ్యాఖ్యలు పాకిస్థాన్-కాంగ్రెస్ మధ్యగల ప్రేమకథను ప్రతిబింబిస్తున్నాయంటూ..సెటైర్లు వేశారు.
అయ్యరే కాదు..ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్యాం పిట్రోడా కూడా భారతీయులపై జాత్యాంకార వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న దేశ పౌరుల్లో విదేశీ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయన్నారు. అరబ్బులు,చైనీయులు, నల్ల,తెల్ల జాతీయుల వంటి వర్ణ విబేధమైన లక్షణాలున్నాయంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదివారు నల్లగా..ఉత్తరాది వారు శ్వేతజాతీయుల మాదిరి తెల్లగా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే పిట్రోడా చేసిన ఈ కామెంట్స్ జాతీయ స్థాయిలో పెద్ద విమర్శలకే దారి తీశాయి. దీంతో విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా ఆ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్ విషయంలో చేసిన కామెంట్స్ కూడా తీవ్ర వివాదాస్పదం కావడంతో..ఆపార్టీ అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. లోక్ సభ ఎన్నికల వేళ ఈ శల్య సారథుల కామెంట్స్ గోల ఏంటంటూ బోరుమంటోంది. వీరిలా పార్టీలో ఇంకేంత మందున్నారో..అంటూ..వారిపై వేటు వేయలేక..ఇటు వారి కామెంట్స్‌పై సంజాయిషీలు ఇచ్చుకోలే అపసోపాలు పడుతోంది హస్తం అధినాయకత్వం.