Homeజాతీయ వార్తలుSecunderabad Railway Station : ఎయిర్ పోర్టును తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వేష్టేషన్.. మోడీ మార్క్ అభివృద్ధి...

Secunderabad Railway Station : ఎయిర్ పోర్టును తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వేష్టేషన్.. మోడీ మార్క్ అభివృద్ధి ఇదీ!

Secunderabad Railway Station : దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్‌. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో అత్యధిక ప్రజారవాణా జరిగేది ఇక్కడి నుంచే. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఈ రైల్వే ష్టేషన్‌లో రద్దీకి అనుగుణంగా కేంద్రం ఒక్కో మార్పు చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు. ఈనెల 8న సికింద్రాబాద్‌ అభివృద్ధిని స్వయంగా నరేంద్రమోదీ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ఊహా చిత్రాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు రిలీజ్‌ చేశారు. ఎయిర్‌ పోర్టును తలపించేలా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మారబోతోంది అంటూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.
ఏళ్లనాటి ప్రతిపాదన.. 
బ్రిటిష్‌ కాలంనాటి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పునర్నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ క్రమంలో ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 8న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు.
రూ.719 కోట్లతో అభివృద్ధి.. 
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను మొత్తం రూ.719 కోట్లతో ఎయిర్‌ పోర్ట్‌ హంగులతో అభివృద్ధి చేయనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణంకు సంబంధించిన డిజైన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌.నర్సింహారావు ట్వీట్‌ చేశారు. ఈ డిజైన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. త్వరలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎయిర్‌ పోర్టును తలపించేలా మారిపోనుంది. అని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మౌలిక సదుపాయాలు, రైల్వే ప్రయాణాన్ని మార్చేస్తోందని, తెలంగాణకు అత్యాధునిక రైల్వే స్టేషన్ల లో ఒకటిగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అవతరించబోతోంది అని ట్వీట్‌ చేశారు.

గ్రేడ్‌–1 గుర్తింపు..
 ఏటా 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తూ, రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వే స్టేషన్లు గ్రేడ్‌–1 పరిధిలోకి వస్తాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్‌ సబ్‌ అర్బన్‌ గ్రేడ్‌ 1 స్టేషన్‌గా గుర్తించిన ఏకైక రైల్వే స్టేషన్‌ సికింద్రాబాద్‌ కావడం విశేషం. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణ గడువు మూడేళ్లుగా నిర్ణయించారు. ఈమేరకు భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి నిత్యం 200 రైళ్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటాయి. రోజూ 1.8 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనుంది.
రద్దీని దృష్ట్యా అప్‌గ్రేడ్‌.. 
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలతో ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందించడానికి స్టేషన్‌ కాంప్లెక్స్‌ను ఇంటిగ్రేట్‌ చేస్తూ ఓ మాస్టర్‌ ప్లాన్‌ను ఇప్పటికే రూపొందించింది. ఎ + 3 అంతస్తులతో ఉత్తరంవైపు ఒక స్టేషన్‌ భవనం, దక్షిణంవైపు మరో భవనం నిర్మించనుంది. రెండు అంతస్తుల స్కై కన్కోర్స్‌ కూడా నిర్మించనుంది. ఉత్తరం వైపు మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేస్తుంది. దక్షిణంవైపు అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. ఉత్తరం, దక్షిణం భవనాల దగ్గర ట్రావెలేటర్‌లతోపాటు 7.5 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేసేలా రెండు నడక మార్గాలను నిర్మించనుంది. ఇక ఈస్ట్, వెస్ట్‌ మెట్రో స్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేస్తుంది.
కొత్త రైల్వే స్టేషన్‌ వాతావరణానికి సరిపోయేలా ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫాంలను పునరుద్ధరించనున్నారు. ఇక ఎంట్రీ, ఎగ్జిట్‌ బ్లాక్స్‌ వేర్వేరుగా ఉండబోతున్నాయి. రైల్వే స్టేషన్‌ మొత్తానికి విద్యుత్‌ అందించేందుకు 5 వేల కిలో వాట్స్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేయనుంది భారతీయ రైల్వే.
మొత్తంగా మరో మూడేళ్లలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. ఎయిర్‌పోర్టుకు ఏమాత్రం తీసిపోకుండా రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version