
BJP- YCP: అవశేష ఆంధ్రప్రదేశ్ లో 2019లో రెండోసారి ఎన్నికలు జరగాయి. ఇవి ఏపీ రాజకీయ సమీకరణలే మార్చాయి. మిత్రులు శత్రువులుగా మారారు. రాజకీయ ప్రత్యర్థులు స్నేహహస్తం అందించుకున్నారు. 2014 ఎన్నికల తరువాత కలిసి నడిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాన్ని పంచుకున్న బీజేపీ, టీడీపీలు విడిపోయాయి. చంద్రబాబు దశాబ్దాల సైద్ధాంతిక విభేదాలు పక్కనపెట్టి కాంగ్రెస్ తో దోస్తీ కట్టగా.. భారతీయ జనతా పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చంద్రబాబు ప్రత్యర్థి జగన్ కు స్నేహహస్తం అందించింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ రెండు పార్టీల మధ్య ఓ రేంజ్ లో స్నేహం కొనసాగుతూ వస్తోంది. అవసరం లేకున్నా కేంద్రానికి వైసీపీ అన్నివిధాలా సహకరిస్తూ వస్తోంది. అటు రాష్ట్ర బీజేపీ నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని హైకమాండ్ జగన్ కు అన్నివిధాలా ప్రోత్సహించింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది.
పీలో వైసీపీ, బీజేపీ మధ్య 2019లోనే స్నేహం చిగురించింది. రాష్ట్ర విభజన హామీల సాధనలో చంద్రబాబు ఫెయిలయ్యారని వైసీపీ ఊరూవాడా ప్రచారం చేసింది. చంద్రబాబును కార్నర్ చేసి మైండ్ గేమ్ ఆడింది. ఈ సమయంలోనే చంద్రబాబు బీజేపీతో విభేదించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మపోరాటానికి సిద్ధపడ్డారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపారు. అయితే చంద్రబాబు ఒకటి తలస్తే మరొకటి జరిగింది. దేశంలో అత్యధిక మెజార్టీతో భారతీయ జనాతా పార్టీ గెలుపొందింది. రాష్ట్రంలో వైసీపీ అంతులేని మెజార్టీతో విజయం సాధించింది. చంద్రబాబుపై ఉన్న కోపంతో జగన్ ను బీజేపీ హైకమాండ్ చేరదీసింది. నాలుగేళ్లలో ఈ స్నేహం చెక్కుచెదరలేదు. వైసీపీకి బలం తగ్గలేదన్న అంచనా అందుకు కారణం. అయితే ఇప్పుడు మూడు ప్రధాన ప్రాంతాల్లో వైసీపీకి ఓటమి ఎదురయ్యేసరికి కాషాయదళం పునరాలోచనలో పడింది.
అయితే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కంటే.. వైసీపీ ఓటమే హైకమాండ్ కు ఆశ్చర్యపరచింది. అదే సమయంలో టీడీపీ ఆధిక్యతతో దూసుకెళ్లడం కూడా వారికి మింగుడుపడడం లేదు. ఇప్పటివరకూ ఎన్నిక ఏదైనా వైసీపీ ఏకపక్ష విజయాన్ని నమోదుచేస్తూ వస్తోంది. ఫస్ట్ టైమ్ కీలకమైన తూర్పు, పశ్చిమ రాయలసీమతో పాటు రాజధాని ఏర్పాటుచేస్తామంటున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. వైసీపీ భావిస్తు,న్నట్టు ఏపీలో ఏకపక్షం లేదని తెలడంతో అధికార పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. అదే సమయంలో సిట్టింగ్ స్థానమైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం కోల్పోవడంతో బీజేపీలో కలవరం ప్రారంభమైంది.

ఏపీలో బీజేపీకి ఈ పరిస్థితికి ముమ్మాటికీ వైసీపీయే కారణమని భారతీయ జనతా పార్టీల నాయకులు గుర్తిస్తున్నారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య పొత్తు ఉందన్న ప్రచారమే తమ కొంప ముంచిందని చెబుతున్నారు. బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ లాంటి వాళ్లు ఇప్పుడు ఇదే భావనను వ్యక్తం చేశారు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కైందని రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు భావించారని.. అందుకే వైసీపీపై ఉన్న వ్యతిరేకత బీజేపీపై చూపిందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ముద్ర వదిలించుకోకుంటే అసలుకే ప్రమాదం వస్తుందని.. కనీసం ఉనికి కూడా ఉందని భావిస్తున్నారు. టీడీపీతోనే దోస్తీ కట్టాలని ఎక్కువ మంది సూచిస్తున్నారు.అదే కానీ జరగకుంటే చాలామంది కాషాయ నాయకులు టీడీపీ గూటికి వెళ్లే చాన్స్ ఉంది. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన వర్గం టీడీపీలో చేరింది. ఇప్పుడు విష్ణుకుమార్ రాజుతో పాటు మాధవ్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని వైసీపీతో ఉన్న బంధం తెంపుకునేందుకు బీజేపీ సిద్ధపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.