Homeజాతీయ వార్తలుCM KCR: సిట్టింగులకే సీట్లు.. విఫల ప్రయోగమే.. ఇంత వ్యతిరేకతతో మూడోసారి కేసీఆర్ గెలుస్తాడా?

CM KCR: సిట్టింగులకే సీట్లు.. విఫల ప్రయోగమే.. ఇంత వ్యతిరేకతతో మూడోసారి కేసీఆర్ గెలుస్తాడా?

CM KCR: మునుగోడులో చావుతప్పి కన్ను లొట్టబోయిన సామెత తీరుగా గెలుపు దక్కింది. అది కూడా సూది, దబ్బుణం పార్టీల పొత్తుతో. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ జనంలోకి వెళ్లడం లేదు. సిట్ అధికారిగా సివి ఆనంద్ ను నియమించినా, అనుకూల మీడియాలో కథనాలు ప్రచారం చేయించినా అనుకున్నంత ఫాయిదా దక్కడం లేదు. దీనికి తోడు కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుస పెట్టి దాడులు చేస్తున్నాయి. ఆర్థిక మూలాలను పెకిలించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే “మై హోమ్” దూరమైంది. “మేఘా” సారీ అంటోంది. తల పోటులా ఢిల్లీ లిక్కర్ స్కాం ఉండనే ఉన్నది. చక్రాలు తిప్పుతా అని ప్రకటించిన బీఆర్ఎస్ అంత చైతన్యశీలంగా ఏమీ లేదు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రచారం చేస్తామని చెప్పినప్పటికీ అది నమస్తే తెలంగాణలో బ్యానర్ వార్త వరకే సరిపోయింది. ఇప్పుడు ఏమి చేయవలె? ముందస్తుకు పోవుటయ?

CM KCR
CM KCR

వారికి మళ్ళీ ఇస్తే కొంపకొల్లేరే

తెలంగాణలో అధికార యంత్రాంగం మొత్తం ఒకే వ్యక్తి వద్ద కేంద్రీకృతమైంది. ఆయనే షాడో సీఎం కేటీఆర్. ప్రతీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, నిధుల మంజూరుకు ఆయన సిఫారసు తప్పనిసరి. ఇప్పుడున్న ఏ ఎమ్మెల్యేలు కూడా నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసే పరిస్థితి లేదు. ఆ ధైర్యం కూడా చేయలేరు. ఒకవేళ కలవాలి అనుకుంటే కేటీఆర్ ను దాటి వెళ్లాలి. కానీ అది సాధ్యం కాదు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అంతంత మాత్రమే సాగుతున్నాయి. పెండింగ్ బిల్లులు వేల కోట్లకు చేరాయి . ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మన ఊరు మనబడి పథకానికి సంబంధించి పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. ఇక పల్లె ప్రకృతి వనం, ఎవెన్యూ ప్లాంటేషన్, స్మశాన వాటికలు, రైతు వేదిక వంటి పనులు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి లకు ప్రభుత్వం ఇంతవరకు ఒక రూపాయి కూడా చెల్లించలేదు. ఇటీవల మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో ప్రభుత్వం అక్కడ ఆగమేఘాల మీద అభివృద్ధి పనులు చేపట్టింది. గొల్ల, కురుమల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసింది. ఇంతా చేస్తే వచ్చింది పదివేల మెజారిటీ మాత్రమే.

రాజీనామా చేయండి సార్

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మానకొండూరు నియోజకవర్గం లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను రాజీనామా చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. ఇదే తీరుగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వంటి వారికి ఓటర్లు ఫోన్ చేసి మరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇవి ప్రజల్లో గూడుకట్టుకున్న నిరసనను తెలియజేస్తున్నాయి. ముందుగానే చెప్పినట్టు అధికారం ఒకే వ్యక్తి వద్ద కేంద్రీకృతం కావడంతో అతడు చెప్పినట్టే మిగతావారు వినాల్సి వస్తోంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు.

CM KCR
CM KCR

కనీసం ఒక కోటి రూపాయల బిల్లు మంజూరు చేయించుకునేంత స్థాయి కూడా ఎమ్మెల్యేలకు లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపడటం లేదు గాని.. అంతర్గత సంభాషణలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటివి లేనే లేవని కెసిఆర్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సిట్టింగ్ లకే సీట్లు ఇచ్చి ఎలా గెలిపించుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే 2018 మ్యాజిక్ పనిచేయదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో బీజేపీ అంతగా బలపడలేదని, ప్రజా కూటమిని ఆంధ్ర బూచి చూపి సెంటిమెంట్ రగిలించారని, కెసిఆర్ పప్పులు ఇప్పుడు ఉడకవని వారు చెబుతున్నారు. అయితే నిత్యం రాజకీయాల గురించి ఆలోచించే కెసిఆర్.. ఈసారి ఏ నమ్మకంతో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని ప్రకటించారో కాలం గడిస్తే కానీ అర్థం కాదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular