CM KCR: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు.. కేసీఆర్ ప్రకటన ఇప్పుడు టిఆర్ఎస్ ఆశావహుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో వారు ఈసారి టికెట్ రాకుంటే ఎలా? ఏం చేద్దాం? అని అంతర్గత ఆలోచనలో ఉన్నారు.. అధికారంలో ఉన్నందున ఇప్పుడప్పుడే బయటపడకున్నా.. సమయం చూసి తమ తడాఖా చూపించాలని స్థాయికి కొందరు నేతలు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తమకు దక్కని సీటు విషయంలో , తమకున్న పట్టును ప్రత్యామ్నాయ పార్టీలో అయినా చూపించాలని విహాన్ని కొందరు అమలు చేసే దిశగా ఉన్నారు. గతంలో టిక్కెట్లు దక్కని కొందరికి ఈసారి కి వదిలేయాల్సిందే.. వచ్చేసారి మీకే అని.. టిఆర్ఎస్ అగ్ర నేతలు ఇచ్చిన అంతర్గత హామీలు కూడా ఉన్నాయి.. కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చిన పాలు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన టిఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు.. అదే సమయంలో వామ పక్షాలకు ఇచ్చిన హామీ మేరకు కొన్ని నియోజకవర్గాల్లో అవకాశాలు వదులుకోవాల్సిన టిఆర్ఎస్ నాయకులు కూడా గుబులుగా ఉన్నారు.. రాజకీయ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, తదితర అంశాలపై టిఆర్ఎస్ అధిష్టానం అనేక సర్వేలు చేయించింది.. ఎప్పటికప్పుడు చేయిస్తున్న ఈ సర్వేల ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఈసారి మార్చక తప్పదన్న అంతర్గత అంచనాలు కూడా పార్టీలో ఉండేవి. అయితే వీటిని మొత్తం పక్కన పెడుతూ ఇప్పుడు టిఆర్ఎస్ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలందరికీ మళ్లీ సీట్లు కాయమని కేసీఆర్ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. అయితే ఇది సీటింగ్ ఎమ్మెల్యేలకు సంతోషం కలిగించింది.. అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఇతర నేతల్లో మాత్రం గుబులు రేపింది. ప్రస్తుతం వీరంతా కూడా లో గొంతుకతో ఉన్నారు. సీటు దక్కదని తేలిన నాడు పక్క పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చోటా నుంచి బడా నేతల వరకు
సీట్ల విషయంలో ఆందోళన చోటా నేతల నుంచి బడా నేతల వరకు ఉంది. పార్టీకి విశ్వాసంగా ఉండి, పార్టీ కోసం అంతర్గతంగా పనిచేస్తూ ఒక్కసారైనా టికెట్ రాకపోతుందా అని ఎదురుచూస్తున్న వారు కొందరు ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక స్థానంలో అధిష్టానం లోని నేతలకు సన్నిహితంగా ఉన్న ఒక నేత గతం నుంచీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం అవసరం వచ్చినప్పుడల్లా ఖర్చు చేసేందుకు వెనుకాడరు.. గతంలోనూ సిట్టింగ్ కి స్థానం ఇవ్వాల్సి వచ్చింది. ఈసారైనా వస్తుందేమోన ఆశ భావంతో ఉన్న సదరన్ నేతకు ఇప్పుడు ఏం పాలుపోని పరిస్థితి నెలకొంది.. ఒక్కసారైనా సీట్ రావాలనే ఇలాంటి నేతలన్నుంచి మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్సీలు, డిసిసిబి చైర్మన్ లు గా ఉన్న నేతల వరకు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చేదు గులికను మిగిలించింది.
జిల్లాల వారీగా ఇలా
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఎప్పటినుంచో ఉంది.. అయితే ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రకటన మహేందర్ రెడ్డి కి మింగుడు పడడం లేదు.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో పైరేట్ రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్న నేపథ్యంలో అతనికి మళ్లీ సీటు ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుందని ఈ ప్రకటనకు ముందు నుంచే ప్రచారంలో ఉంది.. చేవెళ్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలే యాదయ్యకే సీటు ఇస్తే ఈ స్థానం ఆశిస్తున్న మాజీమంత్రి కె ఎస్ రత్నం ప్రత్యామ్నయం చూసుకునే అవకాశాలు ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు కాకుండా తనకు టికెట్ ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవా లక్ష్మీ అడుగుతున్నారు.. కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో ఈమెకు టికెట్ వచ్చేది అనుమానమే. ఇక మంచిర్యాల ఎమ్మెల్యేగా బాల్క సుమన్ ఉన్నారు.. ఇదే స్థానం టికెట్ ను అందాల ఓదెలు అడుగుతున్నారు.. ఐదు నెలల క్రితం ఆయన కాంగ్రెస్ లో చేరారు. తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేశారు. తనకు టికెట్ దక్కుతుందని పూర్తి ఆశాభావంతో ఉన్నారు. కొల్లాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సీటును గట్టిగా ఆశిస్తున్నారు.. కల్వకుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజయ్య ఉన్నారు. ఈ సీటును తులసి కడియం శ్రీహరి ఆశిస్తున్నారు.. వీరిద్దరూ పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నారు..

ఈ మాట ఎందుకు మాట్లాడినట్టు
కెసిఆర్ ప్రకటన ఇంత తొందరగా ఎందుకు చేశారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. మందస్తుకు వెళ్లే అవకాశం లేదని కెసిఆర్ అంటున్నారు.. ఏ వ్యూహంతో ఈ ప్రకటన చేశారన్న అంశంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.. మునుగోడు అనుభవం తర్వాత ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకే కెసిఆర్ ఈ ప్రకటన చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు సీటింగ్ ఎమ్మెల్యేలకు బిజెపి గాలం వేస్తున్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు కేసిఆర్ ఈ ప్రకటన చేశారని మరికొందరు అంటున్నారు.. కెసిఆర్ తాను చేసిన ప్రకటనకు చివరి వరకు కట్టుబడి ఉంటారా అనేది ఎన్నికలు వస్తే గాని తేటతెల్లం కాదు.