Homeఆంధ్రప్రదేశ్‌kakinada Tiger: బెంబేలెత్తిస్తున్న బెంగాల్ టైగర్..చిక్కదు..దొరకదు

kakinada Tiger: బెంబేలెత్తిస్తున్న బెంగాల్ టైగర్..చిక్కదు..దొరకదు

kakinada Tiger: ఇది ‘నాన్నా… పులి’ కథ కాదు! నిజంగానే… పెద్దపులి తిరుగుతోంది. చాలా తెలివిగా కదులుతోంది. పగటిపూట గుట్టుచప్పుడు కాకుండా ‘విశ్రాంతి’ తీసుకుని… అర్ధరాత్రి దాటాక వేట సాగిస్తోంది. సుమారు రెండు వారాలుగా ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో గత కొద్దిరోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. మూగ జీవాలను చంపుతోంది. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో మూగ జీవాలు పెద్ద పులికి బలయ్యాయి. కానీ ఇప్పటివరకూ మనుషులకు మాత్రం హాని జరగలేదు. మనిషి రక్తం రుచి చూడలేదు. అదే జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అటవీ శాఖ అధికారులు, పశుసంవర్థక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంతవరకూ ఆ పులి మనుషులకు కనిపించకపోవడం విశేషం.

kakinada Tiger
kakinada Tiger

.ఒడిసా అడవుల నుంచి తప్పిపోయి..బెంగాల్‌ టైగర్‌ దారి తప్పి ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి పరిసరాల్లోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా గుర్తించిన ఆనవాళ్ల ప్రకారం… అది మగ పులి అని, ఆరోగ్యంగా ఉందని, 150 కిలోల బరువు ఉంటుందని తేల్చారు. ఒడిసా అడవుల నుంచి ఆడపులి జత కోసం అన్వేషిస్తూ… దారి తప్పి ఇటువైపు వచ్చి ఉంటుందని శ్రీశైలం రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి వచ్చిన నిపుణులు తెలిపారు. దీనిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేశారు. గురువారమే ఇది దొరికిపోవాల్సింది. బోనులో ఉన్న ఆవు కళేబరం దగ్గరికి పులి వచ్చింది. కానీ… అక్కడ కొన్నిచెట్లు కొట్టి ఉంచడం, గొయ్యి తవ్విన ఆనవాళ్లు ఉండడంతో పులి జాగ్రత్త పడి తప్పించుకుందని ఏలేశ్వరం అటవీశాఖ రేంజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నిబంధనల ప్రకారం… పెద్ద పులులలను పట్టుకునేందుకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. బోన్లు పెట్టాలన్నా అనుమతులు తీసుకోవాలి. శుక్రవారం అథారిటీ అనుమతితో మరిన్ని బోన్లు పెట్టారు. అయినా… పెద్దపులి వాటిపైపు రాలేదు. తన ఆహారాన్ని తానే వేటాడుకుంటోంది. శనివారం తెల్లవారుజామున పొదరుపాక సమీపంలో ఓ లేగదూడను పెద్దపులి వేటాడింది. ‘‘ఈ పెద్ద పులి ఇప్పటి వరకు మనిషి రక్తం రుచి చూడలేదు. అందుకే… మనుషుల జోలికి రావడంలేదు’’ అని శ్రీశైలం నుంచి వచ్చిన వెటర్నరీ డాక్టర్‌ వివరించారు.

kakinada Tiger
kakinada Tiger

రోజులు గడుస్తున్నా పులి చిక్కకపోవడంతో… దానిపైకి మత్తు ఇంజక్షన్‌లు ప్రయోగించి పట్టుకోవాలని నిర్ణయించారు. దీనికి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అనుమతి లభించింది. శనివారం రాత్రి నుంచే నైట్‌ విజన్‌ పరికరాల ద్వారా పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మత్తు ప్రయోగించిన తర్వాత అరగంట వ్యవధిలో చెరువులో పడిపోయినా, కొండల పై నుంచి జారిపడినా పులి చనిపోయే ప్రమాదం ఉంది. పులి అలాంటి పరిస్థితి లేని చోట కనిపిస్తేనే మత్తు ఇంజక్షన్‌ను ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు. పెద్దపులి పట్టుబడిన తర్వాత ఏవైనా గాయాలు ఉంటే విశాఖ జూకి తరలించి చికిత్స అందిస్తామని… అది ఆరోగ్యంగా ఉంటే అడవుల్లోకి వదులుతామని అధికారులు చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular