Vasupalli Ganeshkumar: విశాఖ నగర వైసీపీలో ముసలం ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త పదవికి ఎమ్మెల్యే వాసుపల్లి రాజీనామా చేయడం వైసీపీలో కలకలం రేపింది. నియోజకవర్గ సమీక్ష సందర్భంగా చేసిన శల్య పరీక్షను అవమానంగా భావించి తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పార్టీ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావులకు వాసుపల్లి లేఖ రాశారు. నియోజక వర్గంలో నెలకొన్న వర్గ పోరే వాసుపల్లి రాజీనామాకు దారితీసిందంటున్నారు.వాసుపల్లి గణేష్‌కుమార్ 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీ పంచన చేరారు.

ఆయన చేరిన కొద్దిరోజులకు అప్పటివరకూ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా వున్న ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిచెందడంతో…ఆ బాధ్యతలు వాసుపల్లికి అప్పగించారు. అయితే ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు అంగీకరించలేదు. వారంతా వాసుపల్లికి వ్యతిరేక వర్గంగా ఉంటూ పార్టీలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికల అనంతరం కొంతమంది కార్పొరేటర్లు కూడా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వాసుపల్లిని తీవ్రస్థాయిలో విమర్శించారు. అదే సమయంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ దక్షిణ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడం మొదలెట్టారు. నిరుపేదలకు కుట్టుమిషన్లు, దుస్తుల పంపిణీ, గర్భిణులకు సామూహిక సీమంతాలు చేస్తూ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గాన్ని తయారుచేసుకున్నారు. ఈ పరిణామం ఎమ్మెల్యే వాసుపల్లికి మింగుడుపడలేదు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గ టిక్కెట్ కేటాయింపుపై సుధాకర్‌కు అధిష్ఠానం హామీ ఇచ్చిందంటూ ఆయన వర్గీయులు ప్రచారం ప్రారంభించారు.దీనిపై అప్పటి ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త విజయసాయిరెడ్డికి వాసుపల్లి పలుమార్లు ఫిర్యాదు చేయడంతోపాటు నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు.

కొద్దిరోజుల కిందట విజయసాయిరెడ్డి స్థానే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. దీంతో పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని వాసుపల్లి ఆశించారు. ప్రాంతీయ సమన్వయకర్త హోదాలో వైవీ సుబ్బారెడ్డి గత నెలలో పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం సమీక్ష నిర్వహించారు. దీనికి నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే వాసుపల్లి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ కూడా హాజరయ్యారు. నియోజకవర్గంలో తమకు ఎవరు నాయకుడో తెలియని పరిస్థితి వుందని కొంతమంది కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో కొంతమంది వాసుపల్లికి అనుకూలంగా, మరికొందరు సుధాకర్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహానికి గురైన వైవీ సుబ్బారెడ్డి వారందరినీ వారిస్తూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యే వున్నందున ఎవరైనా ఆయన ఆధ్వర్యంలోనే పనిచేయాలని స్పష్టంచేశారు. దీంతో నియోజకవర్గంలో తనకు ఇబ్బంది తొలగినట్టేనని వాసుపల్లి భావించారు. కానీ తర్వాత కూడా సుధాకర్ నియోజకవర్గంలో కార్యకలాపాలను ఆపకపోగా…మరింత ముమ్మరం చేయడం, తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడంతో వాసుపల్లి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాసుపల్లి సమన్వయకర్త పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. టీడీపీలో తొమ్మిదేళ్లపాటు నగర అధ్యక్షుడిగా పనిచేశానని, తనను ఎంతో గౌరవంగా చూసేవారని వాసుపల్లి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
అవమానం భరించలేకే..
నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వాసుపల్లి తనకు అవమానంగా భావించారని, అందుకే సమన్వయకర్త పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నియోజకవర్గంలో కార్పొరేటర్లు, వార్డు స్థాయి నేతలు బహిరంగంగా విమర్శిస్తుండడంతో తట్టుకోలేకపోయారని పేర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి కొంతమంది అనుచరులతో సమావేశమైన వాసుపల్లి సమన్వయకర్త పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పినట్టు తెలిసింది.
కొనసాగుతున్న విభేదాలు..
ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గంలో తలెత్తిన పరిస్థితులు త్వరలో మరికొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తాయని పార్టీ నేతలు చెబుతున్నారు. నగరంలోని ఒకటి, రెండు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గపోరు తారస్థాయికి చేరిందని పేర్కొంటున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే మేయర్, వీఎంఆర్‌డీ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వేర్వేరు వర్గాలు నడుపుతున్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ను సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పిస్తే అవకాశం దక్కించుకునేందుకు డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ కో-ఆప్షన్‌సభ్యుడు బెహరా భాస్కరరావు, మరో కార్పొరేటర్ పోటీ పడుతున్నారు. మళ్లను సమన్వయకర్తగా ఇటీవల తప్పించి, శ్రీధర్‌ను నియమించడం పార్టీలో వివాదానికి దారితీసింది. దీంతో దీనిపై అధిష్ఠానం పునరాలోచనలో పడింది. పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి అంతర్గతంగా వుందని పేర్కొటున్నారు.