Sambhav System: భారత సైన్యం బలోపేత.. కొత్త ఆయుధాల సమీకరణ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆయుధాల తయారీకి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ప్రాధాన్యం బాగాపెరిగింది. ఆత్మనిర్భర్ భారత్‌తో భాగంగా ఇప్పటికే కొత్త టెక్నాలజీని సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. తాజాగా కమ్యూనికేషన్ వ్యస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఈమేరు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు సూచనలు వెల్లడించారు. సంభవ్(Secure Army Mobile Bharat Version) అనే మొబైల్ నెట్‌వర్క్ వ్యవస్థ ఆపరేషన్ సిందూర్‌లో విజయవంతంగా ఉపయోగపడింది. దానిని ఆధునిక రూపం అయిన 2.0 దశకు సైన్యం సిద్ధమవుతోందని తెలిపారు.
సమాచార భద్రతలో స్వదేశి సాంకేతిక విప్లవం
సంభవ్ వ్యవస్థ భారత ఆర్మీ సాంకేతిక స్వావలంబనలో కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఇది పూర్తిగా స్వదేశీగా అభివృద్ధి చేసిన మొబైల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ వ్యవస్థ. సైనిక స్థావరాల మధ్య రహస్య సమాచార మార్పిడిని పూర్తి సురక్షిత మార్గంలో కొనసాగించేందుకు ఇది రూపుదిద్దుకుంది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పు తక్కువగా ఉండటం, సమాచార లీకేజీ అరికట్టడం వంటి ఫలితాలను సాధించింది.
ఆపరేషన్ సిందూర్ 2.0 దిశగా మార్పు..
ఆపరేషన్ సింధూర్ ప్రాజెక్టులో సంభవ్ మొదటి దశను ప్రయోగాత్మకంగా వినియోగించగా, 2.0 దశను మరింత ఆధునికంగా రూపొందిస్తున్నారు. కొత్త దశలో కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ సంకేతీకరణ వ్యవస్థలు, ఆటోమేటెడ్ సెక్యూరిటీ ఫీచర్లు ఉండనున్నాయి. యుద్ధభూమిలో సైనికులకు, దూరప్రాంత కమాండ్ యూనిట్లకు వేగవంతమైన, భద్రతా కంప్యూటింగ్ వాతావరణం అందిస్తుంది. జనరల్ ద్వివేది వ్యాఖ్యల ప్రకారం, సైన్యానికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థల్లో విదేశీ ఆధారిత సాఫ్ట్‌వేర్ ప్రభావం తగ్గించి, ‘‘మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ టెక్’’ పై ఆధారపడడం లక్ష్యంగా ఉంచారు. ఇది భారత సైన్యానికి వ్యూహాత్మక స్వతంత్రతను కల్పించడంతోపాటు, రక్షణ పరిశ్రమ రంగంలో దేశీయ కంపెనీల పాత్రను పెంచుతుంది.
సమకాలీన యుద్ధం సాంకేతిక ఆధారితంగా మారినప్పుడు, సమాచార ఆధిపత్యం ప్రధాన ఆయుధంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సంభవ్ వంటి వ్యవస్థలు సైన్యంలో సైబర్ రక్షణ సామర్థ్యాలను పెంపొందిస్తాయి. రియల్ టైమ్ డేటా ట్రాన్స్‌మిషన్, గూఢచారి వ్యవస్థల సమన్వయం, నిర్ణయాధికారి స్థాయిలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇవి కీలకంగా మారనున్నాయి. సంభవ్ 2.0 ప్రాజెక్టు ప్రారంభం, భారత రక్షణ రంగం స్వయంపరిపూర్ణత దిశగా మరొక కీలక అడుగుగా భావించవచ్చు.