Samarasimha Reddy Train Scene: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మాత్రమే ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఆ సినిమాలు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అలాంటి సినిమాలలో సమరసింహారెడ్డి కూడా ఒకటి. అప్పట్లో పూర్తిస్థాయి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తొలి సినిమా ఇదే. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. చాలా ఏరియాల్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రికార్డులకెక్కింది.

అయితే ఈ సినిమా మొదలు కావడానికి చాలా పెద్ద కథ జరిగిందట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్టర్ బి.గోపాల్ కు చాలా కథలు చెబుతున్నా కూడా.. అవేవీ ఆయనకు నచ్చలేదు. అయినా కూడా విజయేంద్రప్రసాద్ అలాగే కథలు చెబుతున్నాడు. ఈ క్రమంలోనే బి.గోపాల్ కు వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. దీంతో ఆయన కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఈ సమయంలో విజయేంద్రప్రసాద్ ఓ అద్భుతమైన కథతో గోపాల్ వద్దకు వచ్చాడు.
ఆ కథ విన్న గోపాల్ ఈ సినిమాను ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో చేద్దాం అనుకున్నారట. కానీ ఈ కథను రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేయాలని డైలాగ్ రైటర్ ఏఎమ్ రత్నం సలహా ఇచ్చారట. దాంతో ఈ కథను ఆ విధంగా మలిచారట విజయేంద్రప్రసాద్. ఈ కథను బాలకృష్ణకు వినిపించారట బి.గోపాల్. ఆ సమయంలో విజయేంద్రప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు.

కథ నచ్చిన బాలకృష్ణ సినిమా చేయడానికి ఓకే చెప్పేశారు. అయితే ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే.. ఇంటర్వెల్ సమయంలో ట్రైన్ సీన్ కు వంగవీటి, దేవినేని కుటుంబాలకు సంబంధం ఉంది. మాటల రచయిత ఏఎం రత్నం ఓసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో తనకు ఎదురైన ఘటనను ఇందులో రాశారు. విజయవాడలో ఒకేసారి దేవినేని, వంగవీటి కుటుంబాలు ట్రైన్ దిగాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం కారణంగా.. వీరిని కలవడానికి వచ్చిన వారితో ఆ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే వీరిద్దరూ ఒకరికి ఒకరు ఎదురు పడటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అది కళ్ళారా చూసిన రత్నం.. ఆ సీన్ ను సమరసింహా రెడ్డి సినిమాలో ఇంటర్వెల్ సీన్ గా రాశారు. మూవీ లో ఈ సీన్ హై వోల్టేజ్ గా ఉంది. ఈ సీన్ ఇప్పటికీ చాలా ఫేమస్. కాగా సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది.