
Saidabad Rape Case: సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడి మృతి చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో రైలు ట్రాక్ పై కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతదేహాన్ని గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అతడి కుటుంబంలో విషాదం ఏర్పడింది. రాజు భార్య మాట్లాడుతూ తన భర్తను పోలీసులే పొట్టన పెట్టుకున్నారని వాపోయింది. తన భర్త అంతటి ఘోరం చేసి ఉండడని భావిస్తున్నట్లు తెలిపింది.
రాష్ర్టంలో సంచలనం సృష్టించిన కేసులో మొదటినుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఆత్మహత్యకు గురవడంపై అందరిలో హర్షం వ్యక్తమవుతున్నా కొందరు మాత్రం పోలీసులే ముందుగా అతడిని అదుపులోకి తీసుకుని చట్టపరంగా శిక్షిస్తే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తన భర్త పోలీసుల అదుపులోనే ఉన్నాడని అతడి భార్య ఆరోపణలు చేస్తోంది.
రాజు తల్లి కూడా పోలీసులపైనే ఆరోపణలు చేస్తోంది. తన కొడుకును పొట్టన పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. శవాన్ని అప్పగించాలని పేర్కొంది. రాజు ఆత్మహత్యపై కుటుంబసభ్యులు మాత్రం పోలీసులనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. కానీ అతడు ఆత్మహత్య చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా గురువారం మంత్రులు బాధిత కుటుంబానికి రూ.20 లక్షల చెక్కు అందించినా బాధిత కుటుంబీకులు తిరస్కరించారు. మాకు డబ్బులు అవసరం లేదని న్యాయం కావాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రాజు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేకెత్తిస్తోంది. మొత్తానికి నిందితుడికి సరైన శాస్తి జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ పోలీసులు పట్టుకుని చట్టరీత్యా శిక్షార్హుడైతే బాగుండేదని చెబుతున్నారు.