
IT Attacks On Sonu Sood: ప్రముఖ సినీనటుడు, రియల్ హీరో సోనూసూద్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండు రోజులుగా సోనూసూద్ నివాసంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ సోనూసూద్ చేసుకున్న ఒప్పందంపై ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ అదికారులు సోనూసూద్ పై కొనసాగుతున్న ఆపరేషన్ పై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
అయితే సోనూసూద్ నివాసంపై ఐటీ అధికారుల సోదాపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సామాజిక సేవ చేస్తున్న సోనూసూద్ పై ఇలా కక్షపూరితంగా సోదాలు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్న సోనూసూద్ పై ఐటీ దాడులు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా మొదటి, రెండో దశల్లో ప్రజలను ఆదుకునేందుకు సోనూసూద్ చేసిన సాయం మరువలేనిది. ఎంతో మందికి ఆప్తుడయ్యాడు. అలాంటి ఆయన కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దాడులు చేయడంలో ఎవరి పాత్ర ఉందనే విషయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తనిఖీల నేపథ్యంలో ట్విటర్ వేదికగా సోనూసూద్ కు మద్దతు పెరుగుతోంది.
సోనూసూద్ ఇంటిపై ఇలా ఐటీ దాడులు చేయించడంలో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందో అర్థం కావడం లేదు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా దూసుకుపోతున్న సోనూసూద్ ఎదుగుదలను ఓర్వలేకే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. అయినా ఆయనపై ఎందుకు కక్ష కట్టారో అర్థం కావడం లేదని అభిమానులు పేర్కొంటున్నారు.