Russia – Ukraine Conflict: ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. యుద్ధ విమానాల రొదతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నా రష్యా మాత్రం వాటిని లెక్కచేయడం లేదు. ఫలితంగా ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా ఘాతుకానికి భారీ మూల్యమే చెల్లిస్తోంది. కానీ ఎంతకు తగ్గడం లేదు. రష్యా బెదిరింపులకు భయపడేది లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది.

రాజధాని కీవ్ నగరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు పొంచి ఉన్నాయి. కీవ్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పుతిన్ సైన్యం కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యాన్ని పంపిస్తామన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు దాన్ని తిరస్కరించారు. తాము ఒంటరిగానే రష్యాను ఎదుర్కొంటామని చెబుతున్నారు. దీంతో ఉక్రెయిన్ రష్యా వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. కీవ్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా సేనలను ముందుకు కదిలిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య భీకర పోరు సాగుతోంది.
రష్యా సామ్రాజ్యవాదంపై భద్రతా మండలిలో తీర్మాణం ప్రవేశపెట్టిన రష్యాకున్న వీటో అధికారంతో దాన్ని ఆమోదం పొందకుండా చేసింది. ఈ క్రమంలో జర్మనీ సైతం ఉక్రెయిన్ కు ఆయుధాలు సమకూర్చేందుకు ఒప్పుకుంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలకు బ్రిటన్ కూడా మద్దతు పలుకుతోంది. రష్యా చర్యలను ప్రతిఘటించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాయి. యుద్ధ వాతావరణం మంచిది కాదని వాదిస్తున్నాయి. కానీ పుతిన్ మాత్రం లక్ష్యపెట్టడం లేదు.
Also Read: భీమ్లానాయక్ అవకాశాన్ని వాడేస్తున్న టీడీపీ.. ఆ భయంతో బీజేపీ కూడా..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. శాంతి స్థాపనకు సహకరిస్తామని మోడీ హామీ ఇచ్చారు. కానీ రెండు దేశాల్లో యుద్ధ కాంక్ష మాత్రం చల్లారడం లేదు. దీంతో ఏం జరుగుతుందోననే ఆందోళన అందరిలో ఎక్కువవుతోంది. అక్కడ చిక్కుకున్న భారతీయులందరు స్వదేశానికి తిరిగి వచ్చారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ క్రమంలో యుద్ధ విమానాల శబ్దాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు మాత్రం దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్రంగా నష్టపోతోందని తెలుస్తోంది. కానీ వెనకడుగు మాత్రం వేయడం లేదు. రష్యాకు భయపడటం లేదు.
Also Read: కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ఆ ఇద్దరు.. పెద్ద స్కెచ్ వేశారుగా..!