‘‘రాష్ట్రంలో అగ్రవర్ణాలుగా ఉన్నవారి సంఖ్య ఐదు శాతం లోపే. కానీ.. చట్ట సభల్లో వారి వాటా దాదాపు 60 శాతం. 50పైగా ఉన్న బీసీల వాటా 20 శాతమే. 30 శాతం ఉన్న దళితులకు చట్టసభల్లో ఇంకా అత్యల్ప స్థానం ఉంది. దీన్ని మార్చాలి. ఈ పరిస్థితి మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చాను’’ అంటూ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నల్గొండలో చేసిన గర్జన పొలికేక పెట్టిందనే చెప్పాలి. ఆదివారం నల్గొండలోని ఎన్జీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రవీణ్ సభకు ఎంత మంది వస్తారోనని ఎదురు చూసిన వారికి ఆశ్చర్యం కలిగించే రీతిలో జనాలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రవీణ్ కుమార్.. బహుజన గర్జన చేశారు. ‘‘తరతరాలుగా మమ్మల్ని బానిసలుగా చేశారు. తరాలుగా మా పిల్లల భవిష్యత్ ను లాగేసుకున్నరు. మేమెప్పుడూ ఇలాగే ఉండాలా? మేం ఇంజనీర్లు అయ్యేదెన్నడు? డాక్టర్లు అయ్యేదెన్నడు? ఈ పరిస్థితి ఇక సాగదు. మమ్మల్ని మేమే పాలించుకుంటాం’’ అని స్పష్టం చేశారు. లక్షలాది మంది బిడ్డల బతుకుల బాగుకోసమే.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని చెప్పారు.
తాను ఉద్యోగానికి రాజీనామా చేసే విషయం తన తల్లికి కూడా చెప్పలేదని అన్నారు. ‘‘ఎందుకురా వదిలేసినవ్’’ అని తల్లి అడిగితే.. ప్రవీణ్ కుమార్ ఒక్కడే కాదు. లక్షల మంది బిడ్డల భవిష్యత్ బాగు చేయాలంటే.. త్యాగాలు చేయాలని చెప్పి వచ్చానని అన్నారు. కనీసం అన్నం దొరకని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, వాళ్లందరికీ కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నాని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై, దళిత బంధుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తామే రాజకీయాలు చేస్తామని, దళిత బంధు పథకాలు పెడతామని చెబుతున్నారు.. ఆ పథకాలకు ఇచ్చే సొమ్ము ఎవరిది? అని ప్రశ్నించారు. మా మాలమాదిగ బిడ్డలు డప్పు కొట్టి సంపాదించిన డబ్బులు, మా గిరిజన బిడ్డలు అడవిలో తేనె పట్టి తెచ్చిన డబ్బులు.. నేతన్నల్లు నరాలను ధారాలుగా చేసి సంపాదించిన సొమ్ములు.. గౌడన్నలు తాడిచెట్టు ఎక్కి, గొల్ల కురుమలు, కుమ్మరులు కాయ కష్టం చేస్తే వచ్చిన డబ్బులు అని అన్నారు. నిజంగా కేసీఆర్ కు జనాలపై ప్రేమ ఉంటే.. సొంత ఆస్తులు పంచాలని డిమాండ్ చేశారు.
ఈ సభకు జనం హాజరైన తీరుపై ఎన్నో విశ్లేషణలు సాగుతున్నాయి. ఎవరి ఖర్చు వారే పెట్టుకొని, ఎవరి భోజనాలు వాళ్లే చూసుకొని సభకు రావాలని రెండు వారాలుగా బీఎస్పీ నేతలు గ్రామాల్లో తిరుగుతూ కోరారు. ఈ రోజుల్లో ఇది అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ.. సభకు వచ్చిన జనాన్ని చూసిన తర్వాత అంచనాలు తలకిందులయ్యాయి. ఇది దళిత, బహుజనుల్లో వచ్చిన మార్పునకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. నిజానికి తరాలుగా అధికారం అగ్రవర్ణాల చేతుల్లో ఉందనేది అందరికీ తెలిసిందే. మరి, దీన్ని మార్చేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నపు ఆరంభం ఘనంగానే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, మున్ముందు ఎలా సాగుతుందన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.