
CM Jagan’s Diet : పక్కవారి గురించి తెలుసుకోవడం అంటే మనుషులకు మహా సరదా. చేస్తున్న పనిని వదిలేసి చెవులు నిక్కబొడుచుకుంటాయి. ఇక సెలెబ్రిటీల సంగతంటే చెప్పనక్కర్లేదు. వారు ఏం తింటారు. ఏం తాగుతారు. ఎక్కడ ఉంటారు. ఎలా ఉంటారు. ఇలా పూసగుచ్చినట్టు చెబితే రోజంతా భారతం, భాగవతం విన్నంత శ్రద్ధగా వింటారు జనం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడితే వేల లైకులు, లక్షల వ్యూవ్స్ తో వైరల్ చేసేస్తారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దాని సంగతేంటో చూసేద్దాం రండి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి. అంతకు మునుపు ఓ పెద్ద వ్యాపారవేత్త. ఆయన తండ్రి అప్పటికే ముఖ్యమంత్రి. కోట్లలో ఆస్తులు, అంతస్థులు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి. ఇక ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో జగన్ వ్యక్తిగత విషయాలకు చెందిన వీడియోలు దుమ్ములేపుతుంటాయి. వైసీపీ అభిమానులు వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జగన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగన్ ఆరోగ్య రహస్యం, ఆహార నియమాల గురించి సాక్షాత్తు ఏపీ మంత్రి రోజా మీడియాతో పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో జగన్ ఆరోగ్య రహస్యం గురించి వెల్లడించారు. జగన్ ఒక పుల్కా, ఉడకబెట్టిన కూరగాయలు తింటారట. నాన్ వెజ్ వారానికి ఒకసారి మాత్రమే తింటారట. అందులో కూడా కొంచెం కీమానే తింటారు. ఒక లీటర్ పాలలో కొంచెం పచ్చి అల్లం వేసి .. వాటిని బాగా మరగబెడతారట. ఆ లీటర్ పాలు ఓ చిన్న గ్లాస్ అయ్యేంత వరకు పాలను మరగనిస్తారట. ఆ చిన్న గ్లాసుతో అల్లం మరిగించిన పాలు తాగుతారని రోజా చెప్పుకొచ్చారు. జగన్ లా తింటే జీరో సైజు ఖాయం అంటూ కామెంట్ చేశారు. ఆహారం విషయంలో జగన్ చాలా జాగ్రత్త తీసుకుంటారని తెలిపారు.
రోజాకు ఇవన్నీ ఎలా తెలుసని అనుకునేరు. జగన్ పాదయాత్ర సమయంలో నగిరి ప్రాంతంలో బస చేశారట. అప్పుడు జగన్ ఏం తింటారు, ఏం తాగుతారు అన్న విషయాలు తనకు తెలిసాయని రోజా చెప్పారు. ఇన్నాళ్లు ఎవరికీ తెలియని జగన్ ఆహార అలవాట్లు రోజా చెప్పారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రోజా చెప్పిన విషయాలను జనం ఆసక్తిగా వింటున్నారు. ఆహారం విషయంలో జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టే.. అంత ఫిట్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.