RK Kotha Paluku: “చంద్రబాబు బలహీనపడ్డారు. వయసుపరంగా కూడా ఆయన జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయలేని పరిస్థితి. ఏప్రిల్ నెలలో జరగనున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడికి అత్యంత ముఖ్యం. ఇప్పుడు అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్టే. ఈ కోణం నుంచి చూస్తే బిజెపితో పొత్తును చంద్రబాబు కాదనుకోలేని పరిస్థితి” చదువుతుంటే టిడిపి వ్యతిరేక కోణం కనిపిస్తోంది కదూ.. ఇదేదో సాక్షి లేదా టిడిపి వ్యతిరేక మీడియాలో ప్రచురితమైన అంగీకారానికి వచ్చారు కదూ? కానీ అది ముమ్మాటికీ కాదు. ఇది రాసింది.. చంద్రబాబు నాయుడి ప్రస్తుత రాజకీయ జీవితాన్ని ఇలా చెప్పింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబుకు డప్పు కొట్టే ఆయన ఒకేసారి ఇలా రాయడం ఆశ్చర్యకరమే..
ప్రతీ ఆదివారం ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు లో వర్తమాన రాజకీయ అంశాలపై తనదైన కోణాన్ని ఆవిష్కరించే రాధాకృష్ణ.. ఈ ఆదివారం మోడీకి ఎదురేదీ అనే శీర్షికతో భారీ వ్యాసమే రాశారు. ఈ పరంపరలో తెలంగాణ విషయాన్ని కాస్త పక్కన పెట్టి ఆంధ్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను తనకున్న పరిజ్ఞానంతో రాధాకృష్ణ రాసుకొచ్చారు. నిజానికి ఎన్నికల్లో బిజెపి అవసరం టిడిపికి గాని.. టిడిపి అవసరం బిజెపికి గాని లేదని కుండబద్దలు కొట్టిన రాధాకృష్ణ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాడు. మరి తెలుగుదేశం అధికారంలోకి వస్తే బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు ఎందుకు తహతహలాడుతున్నట్టు? సీట్ల కేటాయింపులకు సంబంధించి అమిత్ షా తో ఎందుకు చర్చలు జరుపుతున్నట్టు? టిడిపికి సొంతంగా అంత ప్రభ ఉంటే జనసేనతో ఎందుకు పొత్తు కుదుర్చుకున్నట్టు? ఇలాంటి విషయాలు జనాలకు తెలియదనా? లేక తను ఏం రాసినా చదువుతారనా? ఎన్నికలు సజావుగా జరగడం కోసం చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటున్నారట? మరి ఇదే చంద్రబాబు ఎన్నికలు సజావుగా జరగాలని 2019లో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? అప్పుడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే పోటీ చేశాడు కదా? ఎన్నికలు సజావుగా జరిగి ఉండకుంటే 2014లో చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చాడు? ఎన్నికలు సజావుగా జరిగేందుకు చంద్రబాబు మోడీ పంచన చేరుతున్నాడు అని రాసిన రాధాకృష్ణ.. ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు? అంటే ఎన్నికల సంఘం మోడీ చెప్పు చేతుల్లో ఉందనా? అలా ఉండి ఉంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బిజెపి దేశం మొత్తం అధికారంలో ఉండేది కదా? ఒక పాత్రికేయుడు రాయాల్సిన రాతలేనా ఇవి? జగన్ వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీకే మద్దతు ఇస్తారని తెలిసినప్పుడు.. బిజెపి నాయకులు ఎందుకు టిడిపి వైపు చూస్తారు? పాపం ఏదో రాసుకుంటూ పోయాడు కానీ లాజిక్ అస్సలు లేదు.
ఒకప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడినప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరించాయి. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు దేశంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అందరికీ తెలుసు. గత రెండు పర్యాయాలు కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో అందరూ చూశారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళ రిజర్వేషన్ బిల్లు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కొత్త పార్లమెంట్ ఏర్పాటు, ఇంకా చాలా విప్లవాత్మక నిర్ణయాలు వెలువడ్డాయి. అప్పట్లో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చక్రాలు తిప్పాడు. అంటే అలాంటి పరిస్థితి నేడు రావాలి అని రాధాకృష్ణ కోరుకుంటున్నాడా? వయసు రిత్యా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయలేనప్పుడు.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలి అని కోరుకోవడంలో అర్థం ఏమిటి? తమిళనాడు రాజకీయాలను ఉదాహరణగా చూపుతున్న రాధాకృష్ణ.. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేయకూడదనా? అవినీతికి పాల్పడిన నాయకులను అరెస్టు చేయకుండా.. వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కేంద్రం చూస్తూ ఉండాలా? ఇక మిగతా వ్యాసం గురించి చెప్పుకోవడం దండగ.. మొత్తానికి చంద్రబాబు నాయుడు పల్లవి ఎత్తుకొని ఏదేదో రాసుకుంటూ పోయాడు రాధాకృష్ణ.. నిప్పులు చిమ్మే విధంగా ఉండాల్సిన అతడి అక్షరాలు ఎందుకో గాడి తప్పుతున్నాయి. అన్నట్టు రేవంత్ రెడ్డిని తెగ ప్రమోట్ చేస్తున్న రాధాకృష్ణ.. ఈ వ్యాసంలో అతని ప్రస్తావన కనీసం లేషమాత్రమైనా తీసుకురాకపోవడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Rk kotha paluku bjp does not need tdp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com