Homeజాతీయ వార్తలుPower Crisis: ఎప్పటికి "కోల్"కునేది?

Power Crisis: ఎప్పటికి “కోల్”కునేది?

Power Crisis: విద్యుత్ కోతలతో దేశం అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు ఉష్ణపవనాలు… మరోవైపు బొగ్గు కొరత, ఫలితంగా కరెంట్‌ కష్టాలు. ఇప్పుడు దేశమంతటా ఇదే పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జమ్మూ– కశ్మీర్‌ … సహా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణావనుల్లోని కనీసం 16 రాష్ట్రాలంతటా అదే దృశ్యం. గడచిన 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి అత్యధిక ఉష్ణోగ్రతలు గత నెలలో వాయవ్య, మధ్య భారతావనిలో నమోదయ్యాయంటే వర్తమాన వేసవి కాలపు మహోగ్ర రూపం అర్థం చేసుకోవచ్చు. కేవలం బొగ్గు రవాణా, విద్యుత్ కోతల నివారణ పై ఐటీవల కేంద్ర స్థాయిలో ఒకటికి రెండు ఉన్నత స్థాయి సమావేశాలు జరగడం పరిస్థితి తీవ్రతకు దర్పణం. ఉష్ణ పవనాల ముప్పుపై ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల సమావేశం జరిపింది. అలాగే, బొగ్గు కొరత – రవాణాలో సవాళ్ళపై హోమ్‌ మంత్రి నివాసంలో విద్యుత్, బొగ్గు, రైల్వే మంత్రులతో ఉన్నత స్థాయి భేటీ సాగింది. పలు రాష్ట్రాలు అదనపు విద్యుత్‌కై అభ్యర్థించాక ఎట్టకేలకు కేంద్రం బరిలోకి దిగింది.

Power Crisis
Power Crisis

ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా

ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు మన దేశంలో విద్యుత్‌ కొరత ఏటా ఉండేదే. దానికిప్పుడు ఉడుకెత్తిస్తున్న ఉష్ణ పవనాలు అదనం. విద్యుత్‌ గిరాకీ, సరఫరాల మధ్య ప్రతిసారీ తలెత్తుతున్న అంతరానికీ, తాజా సంక్షోభానికీ బొగ్గుపైనే ఆధారపడడమే కారణం. దాదాపు 400 గిగావాట్ల విద్యుచ్ఛక్తిని, అందులోనూ దాదాపు 40 శాతాన్ని కాలుష్యరహితంగా ఉత్పత్తి చేసే స్థాపక సామర్థ్యం మన దేశానిది. కానీ, ఈ ఏప్రిల్‌ ఎండల్లో దేశంలో గరిష్ఠ డిమాండ్‌ ఒక రోజు 205 గిగావాట్లకు పెరిగింది. మన దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యంలో సగానికి పైగా బొగ్గు నుంచి తయారవుతుంది. కానీ, 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సిన విద్యుత్కేంద్రాల్లో కొన్ని రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. నిల్వలు లేవని రాష్ట్రాలు, ఉన్నాయని కేంద్రం భిన్న వాదాలకు దిగుతుండటం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం

Also Read: Cordelia Cruise Ship: విశాఖలో.. విహార నౌక.. క్రేజీ క్రూయిజ్‌ వచ్చింది!!

కోవిడ్ తర్వాత విద్యుత్కు గిరాకీ పెరిగింది

మరోపక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో కోవిడ్‌కు మునుపటి రోజులకు విద్యుత్‌ గిరాకీ పెరిగింది. వేసవి తాపం ఏప్రిల్‌లోనే విజృంభించేసరికి, ఏసీల వాడకం హెచ్చింది. అదీ ఉక్రెయిన్‌ యుద్ధం దెబ్బతో రష్యా చమురు, గ్యాస్‌పై వివిధ దేశాల నిరోధాలతో, అంతర్జాతీయంగా ఆ కొరతను బొగ్గుతో తీర్చాల్సిన పరిస్థితి. అలా ప్రపంచ విపణిలో బొగ్గు రేట్లు నింగికెగసాయి. సాధారణంగా మనం ఇండొనేషియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల నుంచి 200 మిలియన్‌ టన్నులకు పైగా బొగ్గు దిగుమతి చేసుకుంటాం. తీరా టన్ను 100 డాలర్లుండే ఆస్ట్రేలియా బొగ్గు ఇప్పుడు 440 డాలర్లు పలుకుతోంది. అది తాళలేక మన బొగ్గు దిగుమతిదారులు స్థానిక వనరుల వైపు చూస్తున్నారు. ఇక్కడేమో బొగ్గు కొరత. గనుల నుంచి విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు తగినన్ని రైల్వే ర్యాక్‌లు లేక మరో ఇబ్బంది. జాతీయంగా, అంతర్జాతీయంగా బొగ్గు రేట్లు పెరిగేసరికి, రూ. 3–4 ఉండే యూనిట్‌ విద్యుత్‌ ధర ఇప్పుడు రూ. 12 అయింది.

స్థూలంగా ఇదీ పరిస్థితి.

తవ్వే కొద్దీ తరిగిపోయేదే గనక, భవిష్యత్తులో ఈ శిలాజ ఇంధన వనరులు మరింత క్షీణించి, సంక్షోభం తీవ్రమవుతుంది. భవిష్యత్‌ మాట అటుంచితే, ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలను అవసరమైన చోటికి సమర్థంగా తరలించడంలోనూ అలసత్వమే కనిపిస్తోంది. బొగ్గు, విద్యుత్, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వెక్కిరిస్తోంది. బొగ్గు రవాణాకు కావాల్సిన రైలు ర్యాక్‌లను సమయానికి అందించాల్సిన బాధ్యత రైల్వే శాఖది. ఆ ర్యాక్‌లలో బొగ్గును నింపడం, గమ్యస్థానం చేరాక దింపడం బొగ్గు శాఖ పని. విద్యుత్‌ శాఖ లక్ష్యాలు చేరడానికి ఆ తొలి రెండు శాఖల సమన్వయం, సమర్థత కీలకం. తీరా ఇప్పుడు దేశంలో బొగ్గు ఉత్పత్తి బాగున్నా, రోజు వారీ వ్యవహారంగా సాగాల్సిన రవాణా కుంటుపడింది. ఈ శాఖల మధ్య సమన్వయ లోపం సామాన్యులకు శాపమైంది. రైల్వేల సరకు రవాణాలో దాదాపు 18 శాతం వాటా ఈ బొగ్గు రవాణాదే. దేశీయంగా బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతుందని తెలిసినా, రైల్వే శాఖ ముందుగా తగిన ర్యాక్‌లు సిద్ధంగా పెట్టుకోకపోవడం ఘోరమైన స్వీయతప్పిదం. చివరకు విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా కోసం మే చివరి వరకు 21 ప్రయాణికుల రైళ్ళలో దాదాపు 753 ట్రిప్‌లను రైల్వే శాఖ రద్దు చేయాల్సి వచ్చింది. కరెంట్‌ కష్టాలు తప్పించే చర్యలో భాగంగా రైళ్ళను రద్దు చేసి, ప్రయాణికుల్ని కష్టాల పాలు చేసింది.

coal-shortage
coal-shortage

భారత ప్రభుత్వ శాఖలు ఇలా సమన్వయ రహితంగా దేనికది పని చేస్తే పెద్ద చిక్కే. బొగ్గు తవ్వకందార్లు, విద్యుదుత్పత్తిదార్లు, రవాణా చూసే భాగస్వామ్య పక్షాలు ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడమే సరిపోతోంది. బొగ్గు ఏమీ తరగని గని కాదు గనక, భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు మరిన్ని తప్పవు. ఇకనైనా కళ్ళు తెరవాలి. పునర్వినియోగ ఇంధన వనరుల్ని ఆశ్రయించాలి. సౌర, పవన విద్యుత్‌ సహా రకరకాల ప్రత్యామ్నాయాల వైపు గట్టిగా దృష్టి సారించాలి. ఇతర దేశాల అనుభవాలనూ అర్థం చేసుకోవాలి. కొన్ని దేశాలు అర్ధంతరంగా బొగ్గు నుంచి పునర్వినియోగ ఇంధనాల వైపు మారి, మరిన్ని చిక్కులు కొని తెచ్చుకున్నాయి. అందుకే,

క్రమంగా అటువైపు మారడం మంచిది.
పదే పదే తలెత్తుతున్న బొగ్గు సమస్యను సాంప్రదాయిక దృష్టి కోణం నుంచే కాకుండా, శరవేగంతో మారుతున్న వాతావరణం వైపు నుంచి కూడా చూడాలి. భాగస్వామ్యపక్షాలన్నీ కలసి కూర్చొని, సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా సాగితే, బొగ్గుపై ఆధారపడడం తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక పరిష్కారాలు చూడవచ్చు. ఉమ్మడి జాబితాలోని విద్యుత్‌పై రాష్ట్రాలూ, రాష్ట్ర జెన్కోలూ వాస్తవిక దృష్టితో సాగాలి. వాతావరణం అనూహ్యంగా మారిపోతుంటే, ఆలస్యంగా అడుగులు వేస్తామంటే అర్థం లేదు. వేసవిలో దాహం తప్పదని తెలిశాక, ముందుగానే నూతిని తవ్విపెట్టుకోవడమే విజ్ఞత.

Also Read:Nara Lokesh Zoom Meeting: లోకేష్ కు లైవ్ లో షాకిచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version