Revanth Reddy- KTR: గజ్వేల్ లో లక్షల మందితో సభ నిర్వహించి కేసీఆర్ కు షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ కు దమ్కీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు అడుగులు వేసిన రేవంత్ రెడ్డి.. ఈసారి మరింత బలంగా నడవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనే సామెత తీరుగా.. రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయిస్తున్న కేటీఆర్ నియోజకవర్గ సిరిసిల్లలో భారీ సభకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారని సమాచారం. వరంగల్లో రైతు డెకరేషన్ పేరుతో సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఈసారి నిరుద్యోగుల సైరన్ పేరుతో యువతను ఆకర్షించేందుకు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నారు.
బీజేపీకి మించి
మొన్నటిదాకా కేసీఆర్ కనుసన్నలలో నడిచిన బీజేపీ, కాంగ్రెస్ లు.. ఇప్పుడిప్పుడే జవసత్వాలను సంతరించుకుంటున్నాయి. అటు బండి సంజయ్, ఇటు రేవంత్ రెడ్డి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రెండు దఫాలుగా పాదయాత్ర నిర్వహించారు. జేపీ నడ్డాని, అమిత్ షాను, ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణకు తీసుకువచ్చారు. లక్షల మందితో సభలు నిర్వహించి బీజేపీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. పైగా వినూత్న తరహాలో నిరసనలు నిర్వహిస్తూ ఎక్కడ ఉంది అనే స్థాయి నుంచి పదేపదే బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చేలా చేశారు. ఇక రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడయ్యాక అనేక రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. పరిముఖ్యంగా యువతరాన్ని టార్గెట్ చేస్తూ రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో సభ నిర్వహించి ఔరా అనిపించారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ లక్షలాదిమంది సభ నిర్వహించి కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు తీసుకొచ్చారు. ఇదే సమయంలో తనను పదేపదే విమర్శించే కేటీఆర్ కు సరైన స్థాయిలో సమాధానం ఇచ్చేందుకు ఈసారి ఏకంగా సిరిసిల్లలో నిరుద్యోగ సైరన్ పేరుతో రాహుల్ గాంధీతో మరోమారు భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Charmy Kaur: ‘హీరోయిన్ల’ వ్యాపారం ప్లాన్ చేస్తున్న మాజీ హీరోయిన్
జిల్లా అధ్యక్షుల్లోనూ మార్పులు
తాను చేసే ప్రతీ పనికి అడ్డు తగులుతున్న సీనియర్ల బెడద విదిలించుకోవడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సామే అవుతున్నది. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొన్నారు. అయితే సోనియాగాంధీ కోటరీలో తనకు బలమైన పట్టు ఉండడంతో సీనియర్లు రాజశేఖర్ రెడ్డిని ఏమీ చేయలేకపోయేవారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కోటరీలో కీలకమైన కొప్పుల రాజు అత్యంత సన్నిహితుడు కావడంతో రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర్ రెడ్డి బాటనే అనుసరిస్తున్నారు. పైగా కొప్పుల రాజుతో రోజు ఫోన్ లో టచ్ లో ఉంటున్నారు. ఇదే సమయంలో సీనియర్లకు చెక్ పట్టే విధంగా పార్టీపై మరింత పట్టు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించిన 33 జిల్లాల అధ్యక్షులను కొత్తవారిని నియమించాలని ఇటీవల రాహుల్ గాంధీ ముందు ఒక ప్రతిపాదన ఉంచారు.
ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. తాను అధ్యక్షులను ఎంపిక చేస్తే స్థానికంగా గొడవలు జరిగే అవకాశం ఉన్నందున.. తాను ఎంపిక చేసిన వ్యక్తుల పేర్లు ముందుగానే కొప్పుల రాజుకు చెప్పి, ఆయన ద్వారానే సీల్డ్ కవర్లో వచ్చేలా ఏర్పాటు తీసుకున్నట్లు వినికిడి. పోడు భూముల విషయంలో, ధరణి సైటు వల్ల జరుగుతున్న తప్పిదాలను ఎండ కట్టడంలో బీజేపీ కన్నా కాంగ్రెస్ ముందు ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తోంది. వరంగల్ డిక్లరేషన్ ను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళేలా వివిధ రూపాల్లో ప్రచారాలు చేస్తోంది. ఇటీవల అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వస్తుండడంతో రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి బలమైన నమ్మకం ఏర్పడింది. ఇందులో బాగానే రేవంత్ రెడ్డి చేపట్టే ప్రతి కార్యక్రమానికి రాహుల్ గాంధీ సహకారం పూర్తిస్థాయిలో లభిస్తోంది. మొన్నటికి మొన్న అంతటి కాకలు తీరీన రేణుకా చౌదరి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం.. కొప్పుల రాజు కూడా భట్టి విక్రమార్కకు, ఉత్తంకుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి సోదరులకు క్లాస్ పీకడం.. రేవంత్ రెడ్డికి పార్టీ పై పెరిగిన పట్టును సూచిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా వీ హనుమంతరావును కట్టడి చేయడమే రేవంత్ రెడ్డికి పెద్ద తలకాయ నొప్పిగా మారింది.