Revanth Reddy : తెలంగాణలో కొద్దిరోజుల వరకు చప్పబడిన రాజకీయం.. ఒక్కసారిగా వేడెక్కింది. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుండడం ఆసక్తిని కలిగిస్తున్నది. మేడి గడ్డ పగుళ్లను రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను మొత్తం తీసుకెళ్లి చూపిస్తే.. కృష్ణా జలాలపై తెలంగాణ వాటా కు సంబంధించి కెసిఆర్ నల్లగొండలో సభ నిర్వహించారు.
మేడి గడ్డలో రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తే.. కెసిఆర్ అదే మేడిగడ్డను బొందల గడ్డతో పోల్చారు. ఏం పీకుతారంటూ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి సవాల్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి కాలేశ్వరం ఎత్తిపోతల పథకం పై మరింత ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను ప్రజల ముందు పెట్టి దోషులను శిక్షిస్తామని అన్నారు. తాము చేసిన ఉద్యమం వల్లే కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని అన్నారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలతో కెసిఆర్, రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తే.. బుధవారం కూడా దానిని రేవంత్ రెడ్డి కొనసాగించారు.
పోలీస్ అభ్యర్థులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ విధానాలను విమర్శించారు. మేడిగడ్డ రూపంలో ప్రభుత్వ సొమ్మును దోచుకున్న కేసీఆర్.. మళ్లీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రమ్మంటే రాలేకపోతున్న కేసీఆర్.. నల్లగొండ పొయ్యి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు..”సెక్రటేరియట్లో నాతో మాట్లాడాలి అని అటెండర్ విన్నవించాడు. నేను ఎవరు పిలిచినా మాట్లాడతాను. ఎక్కడికైనా వెళ్లే పని ఉన్నప్పటికీ ఆగి మరి వారు చెప్పింది వింటాను. నాతో మాట్లాడిన ఆ అటెండర్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కంచర గాడిదను ఇంటికి పంపించి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని నన్ను ఉద్దేశించి అటెండర్ వ్యాఖ్యానించాడని” రేవంత్ రెడ్డి అన్నారు. కాగా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసాయి. అంతేకాదు నిన్న కెసిఆర్ మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తాలూకూ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సర్క్యులేట్ అవుతోంది. అటు భారత రాష్ట్ర సమితి నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చకు దావతీస్తోంది.