
Revanth Reddy Padayatra: అనేక తర్జనభర్జనల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రేవంత్ యాత్రను అడ్డుకునేందుకు టీ కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేక సీనియర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.. కొత్త ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే కూడా రేవంత్ పాదయాత్రను సమర్థించారు. కాంగ్రెస్ హైకమాండ్ చేప్పిన యాత్ర వేరని, రేవంత్ చేపట్టబోతతున్న యాత్ర వేరని థాక్రే వద్ద సీనియర్ల తరఫున ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ థాక్రే మాత్రం కాన్సెప్ట్ ఏదైనా లీడర్లు ప్రజల్లో ఉండటం ముఖ్యమని, మీరు కూడా ఆసక్తి ఉన్న నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయమని సలహా ఇచ్చారు. దీంతో థాక్రే కూడా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ జాబితాలో చేరిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని ఆటంకాలు దాటుకుని యాత్ర ఫిబ్రవరి 6న మేడారం నుంచి ప్రారంభం అవుతోంది.
50కి పైగా నియోజకవర్గాల్లో సాగేలా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నాడు సీఎల్పీ నేతగా ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. చేవెళ్ల నుంచి చేపట్టిన యాత్ర సుమారు 3 వేల కిలోమీటర్లుల సాగింది. ఫలితంగా కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన అడుగు జాడల్లో నడవాలనుకుంటున్న రేవంత్ రెడ్డి కూడా నాడు వైఎస్సార్ నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం చేవెళ్ల నుంచి ప్రారంభించినట్లుగానే.. నేడు రేవంత్‌రెడ్డి కూడా పీసీసీ చీఫ్ హోదాలో మహిళా ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గం ములుగులోని మేడారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యాత్రను యాభై, అరవై నియోజకవర్గాల్లో నిర్వహించాలని అనుకుంటున్నారు. తాము తీసుకొచ్చిన డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అయితే ఆయన యాత్రలో విపక్షాలతోపాటు సొంత పార్టీ నేతలను ఎదుర్కోక తప్పడం లేదు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రపై ఆలోచన చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేసి ఎలా వైఎస్ అధికారంలోకి తెచ్చారో తాను అలా చేయాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ రాజకీయాలు ఆయనకు అడ్డం పడుతూనే వస్తున్నాయి.
అప్పట్లో వైఎస్‌కు కూడా ఇలాంటి అడ్డంకులు వచ్చాయి. అదే స్ఫూర్తితో అన్నింటినీ అధిగమించి ఆయన పాదయాత్రకు సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రాల్లో పాదయాత్రలు చేయాలని హైకమాండ్ ఇచ్చిన సూచనలను తన పాదయాత్రకు అనువుగా మల్చుకున్నారు. ఆయనకు మాస్‌లో క్రేజ్ ఉండటంతో హైకమాండ్ తరపున వచ్చే ఇన్‌చార్జిలు కూడా ఆయన మాటనే సమర్థిస్తున్నారు. దీంతో సీనియర్లకు గర్వభంగం తప్పడం లేదు.

యాత్రతో అధికారం ఎలా..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ములుగులోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 60 రోజులపాటు రేవంత్ పాదయాత్ర నిర్వహించేలా రూట్ మ్యూప్‌ను సిద్దం చేసుకున్నారు. అటు రాష్ట్రానికి చెందిన సీనియర్లు కూడా పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అందరూ కలిసికట్టుగా చేసే ప్రయత్నమే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లోల వ్యక్తమవుతోంది. ఇలా ఎవరికి వారు యాత్రలు చేస్తే అది పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంటున్నారు. మరి వైఎస్సార్ బాటలో నడుస్తున్న రేవంత్ యాత్రతో ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.