Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు, ఈవీఎంల మొరాయింపు మినహా ఓవరాల్‌గా ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఓటర్లు మెల్లగా కేంద్రాలకు రావడంతో ఉదయం 9 గంటల వరకు కేవలం 7.75 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి కొడగంల్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై మీడియా ప్రశ్నించగా రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయ స్ఫూర్తి ఉన్నవారని, సమస్యను అర్థం చేసుకోగలిగేవాళ్లన్నారు. ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం చేసుకుంటారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదిన్నరేళ్లలో ప్రశాంతగా ఉండి, ఎన్నికల సమయంలో ఇలాంటివి జరగడం వెనుక కుట్ర ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఈవో బాధ్యత తీసుకుని ఆ అంశంపై చర్చించాలన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ అసమర్థత కారణంగానే ఇలాంటివి ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు.
డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం..
డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తర్వాత ఏపీ సహా ఏ ఇతర రాష్ట్రంలో నీటి సమస్యలు ఉన్నా కూర్చొని పరిష్కరించుకుంటామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలు, ఆస్తుల పంపకాలు, ఇతర వివాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. స్పందించిన రేవంత్.. పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ సీఎం అభ్యర్థులే అనుకుని కష్టపడాలన్నారు. ప్రజలు వారిని గెలిపించాలని చమత్కరించారు. కాంగ్రెస్‌లో 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు కూర్చొని నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.