Homeజాతీయ వార్తలుRevanth Reddy: కలిసి లేకుంటేనే కలదు సుఖం.. ఈ కాంగ్రెసోళ్లు మారరా?

Revanth Reddy: కలిసి లేకుంటేనే కలదు సుఖం.. ఈ కాంగ్రెసోళ్లు మారరా?

Revanth Reddy: ఫర్ డిబేట్ సేక్.. ప్రస్తుత భారత రాష్ట్ర సమితిలో కేసీఆర్ మాట జవదాటే పరిస్థితి లేదు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే శంకరగిరి మాన్యాలు చూడాల్సిందే. అంతటి ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి మేమే ఓనర్లం అంటూ చేసిన ఒక వ్యాఖ్య ఆయనను బయటకు సాగనంపింది. రాములు నాయక్, రఘునందన్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది..ఈ పరిస్థితి కాంగ్రెస్ లో ఉంటుందా? పార్టీ లైన్ దాటి మాట్లాడితే బయటికి పంపే దమ్ము ఆ పార్టీకి ఉందా? అదేంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇది ఎలా సాధ్యమవుతుంది? అని అంటారా? కానీ పార్టీ అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉండాలి. నియమ నిబంధనలు ఉండాలి. నేతలకు వాక్ స్వాతంత్రం తో పాటు నాలుక మీద అదుపు ఉండాలి. అంతకు మించి ఏం మాట్లాడుతున్నారో సోయి ఉండాలి. ఇవేవీ కాంగ్రెస్ నేతల్లో ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే ఖమ్మం లాంటి మహాసభలో నాలుగు లక్షల మంది జనం వచ్చినప్పటికీ.. హస్తం వైపు చూసినప్పటికీ.. కాంగ్రెస్ నాయకులు మాత్రం తమకు అలవాటైన రీతిలో కొట్టుకుంటున్నారు. జనం ముందు చులకన అవుతున్నారు.

చెప్పినంత మాత్రాన అయిపోతుందా?

ఇక మొన్న కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తానా సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశం ఇచ్చిందని.. రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోందని, ఉచిత విద్యుత్ వల్ల డిస్కం లు నష్టాల్లోకి వెళ్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితి నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఎవరైనా చేసి ఉంటే దానికి సమర్థనగా మిగతా నాయకులు మాట్లాడేవారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. అందులోనూ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగానే రేవంత్ రెడ్డి పై వ్యతిరేక స్వరాలు వినిపించాయి. అందులోనూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు అడుగులు ముందుకేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను నిర్ణయించేది అధిష్టానమని, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాదని అన్నారు. సరిగా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ అధికార పార్టీ మీడియా, సోషల్ మీడియా తెలంగాణలో ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇక్కడే భారత రాష్ట్ర సమితి ఉచిత విద్యుత్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఉచిత విద్యుత్ ను తామే ప్రవేశపెట్టామనే విషయాన్ని ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది.

వెనకేసుకు రాలేరా

తానా మహాసభలో రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకు అలా మాట్లాడారు? ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులకు ఉంది. అది ఇలాంటి సందర్భాల్లో అవసరం కూడా. కానీ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా సీనియర్లు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. కనీసం మహేష్ కుమార్ గౌడ్ కు ఉన్న సోయి కూడా పార్టీ సీనియర్ నాయకులకు లేకపోవడం బాధాకరం. ఎంతసేపటికీ పార్టీలో పట్టు పెంచుకోవడానికి పోటీ తప్పిస్తే మరొకటి వారిలో కనిపించడం లేదు. భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ.. ఇలా అందరు సీనియర్లు తమ తమ ప్రాభవాన్ని కాపాడుకోవడంలో చూపిస్తున్న ఆసక్తి.. పార్టీ ప్రతిష్టను పెంచడంలో మాత్రం ప్రదర్శించడం లేదు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ జనాలకు చేరువ కాలేకపోతోంది. చేరువైనప్పటికీ దానిని నిలుపుకోలేక పోతోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నాయకుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించవచ్చు గాక.. కాలంలో అది పార్టీకి ఎంత నష్టం చేకూరుస్తుందో గుర్తు ఎరకపోవడం అత్యంత బాధాకరం. “ఇప్పటికే రెండు మార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి జనాల్లో కొంత సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. మళ్లీ అంతర్గతంగా కొట్టుకుంటుంది. ఇది ఆ పార్టీకి మరింత నష్టం కలగజేస్తుంది” అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎలా చక్కదిద్దుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular