Nara Lokesh Padayatra
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నిర్ణయం ఒకటి వెలువడింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈనెల 29న తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చేవారం విచారణకు రానున్న నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేయాలని టిడిపి సీనియర్ నేతలు లోకేష్ ను కోరారు. ఇందుకు యువనేత సమ్మతించడంతో పాదయాత్ర వాయిదాను తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా యువ గళం పేరిట లోకేష్ పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో దాదాపు 3000 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం లో పాదయాత్ర ఉండగా చంద్రబాబు అరెస్టుకు గురయ్యారు. దీంతో లోకేష్ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు రిమాండ్ తదనంతర పరిణామాలతో లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఈనెల 29 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించారు. కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ల నుంచి వచ్చిన విన్నపం మేరకు మరి కొద్ది రోజులు పాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు లోకేష్ ను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే దీనిపై ముందస్తు బెయిల్ కు హైకోర్టులో లోకేష్ దాఖలు చేసుకున్నారు. అక్టోబర్ మూడు తర్వాత సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో.. లోకేష్ ఢిల్లీలో ఉండడమే శ్రేయస్కరమని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని భావించి పాదయాత్రను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ లోకేష్ ను అక్రమంగా అరెస్టు చేస్తే.. మిగతా పాదయాత్రను ఆయన సతీమణి బ్రాహ్మణితో పూర్తి చేయించడానికి టిడిపి సీనియర్లు ఓ వ్యూహం రూపొందించారు. అయితే అక్టోబర్ 3 వరకు లోకేష్ ఢిల్లీలో గడపనున్నట్లు సమాచారం.