https://oktelugu.com/

Minister: ఎన్నికలవేళ సొంత పార్టీ నాయకుల రాజీనామా..పాపం ఆ మంత్రికి ఎన్ని కష్టాలో?

అంతేకాదు ఆ మంత్రి తన నియోజకవర్గ పరిధిలో ఒక మండలానికి భారీగా నిధులు కేటాయించుకున్నారని, తన బినామీలకు మాత్రమే పనులు కట్టబెట్టారని సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : October 16, 2023 2:33 pm
    Minister
    Follow us on

    Minister:  ఆయనది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి ఎమ్మెల్యేగా, ఎంపీ గా, ఎమ్మెల్సీగా పని చేశారు. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఆయన కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే విజయం సాధించి తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు. ఆ పార్టీ పెద్దలకు అత్యంత దగ్గర అయిపోయారు. ముఖ్యంగా ఆ పార్టీలో నెంబర్_2 గా చలామణి అవుతున్న వ్యక్తికి అత్యంత సన్నిహితుడు అయిపోయారు. అతనితో ఉన్న సాన్నిహిత్యం వల్ల తన నియోజకవర్గానికి వందల కోట్లు కేటాయించుకున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకులను తనకు ఎదురు చెప్పలేని పరిస్థితి సృష్టించుకున్నారు. పోలీసులతో కేసులు పెట్టించారు. ఒకరకంగా వారిని తీవ్ర వేధింపులకు గురి చేశారు. అంతేకాదు సొంత పార్టీ నాయకులను కూడా ఆయన వదల్లేదు. గత ఎన్నికల్లో సీనియర్ నాయకుల ఓటమికి కూడా ఆయన కృషి చేశారని ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎదురే లేదు అనే విధంగా పరిస్థితులను సృష్టించుకుని అధిష్టానం వద్ద మంచి మార్కులు పొందారని, ఆ తర్వాత మంత్రి పదవి సాధించుకున్నారని ఇప్పటికీ ఆ జిల్లాలో టాక్ వినిపిస్తుంది.

    రోజులన్నీ ఒకే తీరుగా ఉండనట్టు ఇన్ని రోజులు ఆ మంత్రి ఆగడాలను భరించిన వారంతా ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. ఆయన తీరును నిరసిస్తూ రాజీనామాలు చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీ పామ్ అందుకుంటున్న సమయంలోనే కొంతమంది నేతలు.. ఆ మంత్రి తీరును నిరసిస్తూ సొంత జిల్లాలో నిరసనగలం వినిపించారు. పార్టీలో కీలక నేత ఫోన్లో సముదాయించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. పైగా ఆయన ఆగడాలను ఒక్కొక్కటిగా వివరించారు. అయినప్పటికీ ఆ కీలక నేత నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో.. ఆయన ఉంటే మేము పార్టీలో మన గలగలేము అంటూ రాజీనామా ప్రకటించారు. కొంతమంది సీనియర్ నాయకులు, కొంతమంది కార్పొరేటర్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఇదే బాటలో ఆ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన మేయర్ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ నాయకుల వ్యాపారాలపై అధికారులతో సదరు మంత్రి దాడులు చేయించారని, ఇలాంటప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని ఎలా సమర్థించాలంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

    అంతేకాదు ఆ మంత్రి తన నియోజకవర్గ పరిధిలో ఒక మండలానికి భారీగా నిధులు కేటాయించుకున్నారని, తన బినామీలకు మాత్రమే పనులు కట్టబెట్టారని సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ బాగోగులు చూసుకోనప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఎందుకు మేము సపోర్ట్ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఒంటెత్తు పోకడలు భరించలేకనే తాము రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ మంత్రికి పోటీగా ఒక బలమైన నాయకుడిని ప్రతిపక్ష పార్టీ నిలపడంతో.. ఆ నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడింది. ఆయనను కచ్చితంగా ఓడిస్తామని ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వారే చెబుతున్నారు. సొంత సామాజికవర్గంలోనూ ఆయన చిచ్చుపెట్టారని, అందుకే ఈసారి కచ్చితంగా ఆయనను ఓడించి ఇంటికి పంపిస్తామని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ మంత్రికి లేనంత విధంగా..ఆ నియోజకవర్గంలో మంత్రికి సొంత పార్టీ నాయకులనుంచి నిరసన సెగ తగులుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో కీలకమైన వ్యక్తితో అత్యంత సాన్నిహిత్య సంబంధం ఉన్నప్పటికీ ఆ మంత్రిని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని వారు చెబుతున్నారు. ఎన్నికలవేళ తన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు కావడంతో, ఆ మంత్రి తన సన్నిహితుల వద్ద అంతర్మథనం చెందుతున్నారని ప్రచారం జరుగుతున్నది.