జగన్ కి షాకిచ్చిన హైకోర్టు!

గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌ సంస్థల ఎన్నికలలో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల గూర్చి గత ఏడాది జనవరి నుండి హైకోర్టులో చర్చ జరుగుతుంది. న్యాయవాదులు తిరుమలశెట్టి కిరణ్‌, కేఎస్‌ మూర్తితోపాటు పలువురు వేర్వేరుగా ఈ రిజర్వేషన్ల పై పిటిషన్లు దాఖలు […]

Written By: Neelambaram, Updated On : March 3, 2020 3:26 pm
Follow us on

గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌ సంస్థల ఎన్నికలలో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల గూర్చి గత ఏడాది జనవరి నుండి హైకోర్టులో చర్చ జరుగుతుంది. న్యాయవాదులు తిరుమలశెట్టి కిరణ్‌, కేఎస్‌ మూర్తితోపాటు పలువురు వేర్వేరుగా ఈ రిజర్వేషన్ల పై పిటిషన్లు దాఖలు చేశారు. దింతో అప్పటి నుంచి హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్‌ నంబరు 176ను న్యాయ స్థానం రద్దు చేసింది.

బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లను తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 9, 15, 152, 180ను రద్దు చేసింది. నెల రోజుల్లోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీ జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడంపై ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. నెల రోజుల్లోగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయాలని ఫిబ్రవరిలోనే ప్రభుత్వం భావించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. మార్చిలోగా స్థానిక ఎన్నికల సమరాన్ని పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భావించగా, హైకోర్టు తీర్పుతో అది బెడిసి కొట్టింది.