బిజెపి-జనసేన మూడో ప్రత్యామ్నాయం కావాలంటే?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న రాజకీయాలు మూడో వర్గం ప్రవేశంతో రంగులు మారుతున్నాయి. ఇంతవరకు వై ఎస్ ఆర్ పి, తెలుగుదేశం మధ్య నే వున్న కొట్లాటలు బిజెపి కి కొత్త అధ్యక్షుడు నియామకం తో మార్పులు చక చకా జరిగిపోతున్నాయి. ఇంతవరకు ఈ కొట్లాటలు రెండు అగ్ర కులాల సంకుల సమరంగానే అనుకున్నారు. సోము వీర్రాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడయిన తర్వాత ఇది మూడు కులాల సంకుల […]

Written By: Ram, Updated On : September 7, 2020 10:15 am
Follow us on

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న రాజకీయాలు మూడో వర్గం ప్రవేశంతో రంగులు మారుతున్నాయి. ఇంతవరకు వై ఎస్ ఆర్ పి, తెలుగుదేశం మధ్య నే వున్న కొట్లాటలు బిజెపి కి కొత్త అధ్యక్షుడు నియామకం తో మార్పులు చక చకా జరిగిపోతున్నాయి. ఇంతవరకు ఈ కొట్లాటలు రెండు అగ్ర కులాల సంకుల సమరంగానే అనుకున్నారు. సోము వీర్రాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడయిన తర్వాత ఇది మూడు కులాల సంకుల సమరంగా మారబోతుంది. ( ఇది ఒక్కటే కారణం కాకపోయినా ఇదికూడా ఓ ప్రధాన కారణంగా ఆంధ్ర రాజకీయాల్లో ఉండబోతుంది).  మిగతా కులాలు ఈ మూడు కూటముల్లో ఏ వైపు మొగ్గు చూపుతాయనే దాన్నిబట్టి రాజకీయ మొగ్గు ఆ వైపు ఆధారపడి వుంటుంది. ఇప్పటివరకయితే ఈ సామాజిక సమీకరణలు వైఎస్ ఆర్ పి కే అనుకూలంగా వున్నాయి. అయితే ముందు ముందు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేము. బిజెపి కి ఆర్ ఎస్ ఎస్ అండదండలు అన్నిరకాల సాధన సంపత్తి గల బిజెపి జాతీయ నాయకత్వం అండగా వుండటాన్ని తక్కువగా అంచనా వేయలేము. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టింది వామపక్ష మేధావి వర్గం.

Also Read : అగ్రిగోల్డ్ కేసు : కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష మేధావుల పట్టు 

రాజకీయంగా సిపిఎం బలహీనపడినా తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో, మేధావి వర్గంలో వాళ్ళ పట్టు ఇప్పటికీ బలంగానే వుంది. సిపిఐ కి అంత కాకపోయినా కొంతమేరకు ఈ వర్గాల్లో పట్టుంది. మీడియాలో ఈ మేధావులు నిరంతరం పార్టీ లైనును ప్రజల్లోకి చొప్పించటానికి ప్రయత్నం చేస్తూనే వుంటారు. ఇందులో అగ్రగణ్యులు ప్రొఫెసర్ నాగేశ్వర్( పూర్వ ఎస్ ఎఫ్ ఐ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు), వీరయ్య ( ప్రస్తుత రాష్ట్ర సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు), తెలకపల్లి రవి ( పూర్వ ప్రజాశక్తి సంపాదకులు), పాపారావు ( ఆర్ధిక విశ్లేషకులు) ఇంకా అనేకమంది వివిధ రంగాల్లో పనిచేస్తున్న నాయకులు ( మీడియాలో ఆయా రంగాల నిపుణులుగా గుర్తించబడినా వాస్తవానికి సిపిఐ, సిపిఎం సభ్యులు). వీరితోపాటు సిపిఐ, సిపిఎం లు రాజకీయంగా రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినా  ఆ నాయకులకు మీడియా లో విపరీతమైన అవకాశం ఇస్తారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష మేధావుల పట్టు మీడియా లో చాలా బలంగా వేళ్ళూనుకొని వుంది.

ఇది ప్రస్తుతం వాళ్ళు తిరిగి రాష్ట్రంలో పుంజుకోవటానికి వీలు కల్పించకపోయినా తెలుగు రాష్ట్రాల రాజకీయ ఆలోచనల్ని ప్రభావితం చేయటానికి ఉపయోగపడుతుంది. ఇటీవలికాలంలో వాళ్లకు సరైన అంశం లేకపోయింది. తెలంగాణాలో కెసిఆర్ , కాంగ్రెస్ ; ఆంధ్రలో జగన్, చంద్రబాబు నాయుడు కొట్లాటల మధ్యలో వాళ్ళకంటూ ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు ప్రచారం చేసే అంశం లేదు. వాళ్ళ దృష్టిలో ఇవి గ్రూపు రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు. అయినా గుర్తింపు పోకుండా ఉండటానికి ఏదో విధంగా మీడియా విశ్లేషణల్లో వుంటూవున్నారు. ఈ సంధికాలంలో కూడా తమ పట్టు పోకుండా కాపాడుకోగల్గుతున్నారు. అందుకు వీరిని అభినందించాలి.

Also Read : కాంగ్రెస్ స్వయంకృతం: జగన్‌ని పిలిస్తే వస్తాడా..?

పార్టీ విధానమే వీళ్ళకు ముఖ్యం 

ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక్కోసారి వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతిన్నా పరవాలేదుగానీ వాళ్ళ పార్టీ విధానాలే ముఖ్యంగా పనిచేస్తూ వుంటారు. ఉదాహరణకు ప్రఖ్యాత హిందూ పత్రిక పూర్వ సంపాదకుడు, ప్రస్తుత చైర్మన్ అయిన ఎన్ రామ్ నే తీసుకుందాం. ఆయన సంపాదకుడుగా వున్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అది భారత-అమెరికాల మధ్య అణు ఒప్పందం. ఆ ఒప్పందాన్ని స్వాగతిస్తూ ఎన్ రామ్ ఓ పెద్ద సంపాదకీయం రాసాడు. ఆ తర్వాత సిపిఎం ఆ అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దత్తు వుపసంహరించుకోవటం అందరికీ తెలిసిందే. దానితో ఏ మనసు తో అణు ఒప్పందాన్ని సమర్ధిస్తూ సంపాదకీయం రాసాడో అదే మనసుతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇంకో సంపాదకీయం రాసాడు. అంటే మనసుకి కూడా రెండు పార్శ్వాలు ఉంటాయని అప్పుడే అర్ధమయ్యింది. మనసులో మాట ఎలా వున్నా పార్టీ చెప్పింది కాబట్టి మనసుని చంపుకొని కూడా మాట్లాడవచ్చని అప్పుడే అర్ధమయ్యింది. ఈ తమాషా మొత్తం మేధావి వర్గంలో అప్పటిదాకా ఎన్ రామ్ పై వున్న గౌరవాన్ని ఒక మెట్టు కిందకి దించింది.

ఇదే విధానం మన తెలుగు రాష్ట్రాల మేధావులకు కూడా వర్తిస్తుంది. నిన్నటిదాకా పొగిడిన నోటితోనే అదే వ్యక్తుల్ని తెగడటం కూడా జరగొచ్చు. ఉదాహరణకు ఈ మేధావులందరూ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ని ఆకాశాని కెత్తినవాళ్ళే. ముఖ్యంగా తెలకపల్లి రవి, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటివాళ్ళు. మరి ఈ రోజో . బిజెపి తో పొత్తుపెట్టుకోవటంతో  పవన్ కళ్యాణ్ పై దాడులకు రంగం సిద్దమయ్యింది. ఇప్పటివరకు ఈ మేధావులకు పవన్ కళ్యాణ్ ఓ ఆశా కిరణంగా కనిపించాడు ( వామ పక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు). మరి ఇప్పుడో బిజెపి తో పొత్తు కదా. ఈ మేధావులకు ఇప్పటివరకూ సరైన అంశం మీడియా లో చొచ్చుకుపోవటానికి దొరకలేదు. ఇప్పుడు బిజెపి-జనసేన పొత్తుతో ఈ సంఘటన పై రోజుకో ప్రచారం చేయటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నిన్ననే తెలకపల్లి రవి మోడీ పై విరుచుకుపడుతూ ఓ పెద్ద పోస్టు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఇప్పటిదాకా మోడీ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూసేవాళ్ళకు మొన్నటి ‘మన్ కి బాత్’ కి డిజ్ లైక్ లు రావటం, కరోనా కేసులు పెరగటం, జిడిపి ఫలితాలు అనుకున్నదానికన్నా దారుణంగా పడిపోవటం తో పండగగానే వుంది. అర్ధసత్యాలు, అసత్యాలు, కొన్ని సత్యాలు కలగలిపి వండి వార్చటం మొదలుపెట్టారు. దానిలో తప్పేముంది. వాళ్ళ పార్టీ విధానమది. తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు అభినందించాలి మరి!

Also Read : నూతన్ నాయుడుపై నాలుగో కేసు.. దిమ్మదిరిగే వాస్తవాలు

బిజెపి-జనసేన పరిస్థితి ఏంటి?

జగన్ పార్టీకి స్వంత చానలు, పత్రిక వున్నాయి. అధికారం లో వున్నాడు కాబట్టి మరికొన్ని మీడియా సంస్థలూ ఎంతో కొంత సానుకూలంగా వుంటారు. అలాగే తెలుగుదేశానికి కావలసినన్ని మీడియా సంస్థల మద్దతుంది. మరి బిజెపి-జనసేన కో? ఆ పరిస్థితి లేదు. అందునా బలంగా మీడియా లో నాటుకుపోయిన వామపక్ష మేధావులకు ప్రధమ శత్రువు బిజెపి కూటమి కాబట్టి మరింత దూకుడుగా ఈ కూటమి పై విమర్శలు ఎక్కుపెట్టటం సహజం. దానిని తట్టుకునే ప్రత్యామ్నాయ ప్రచారం ఈ కూటమికి ఉందా? ఓకే, ఆ కూటమికి ఉందా లేదా అనేదానికన్నా ప్రజలకు మూడు వైపులా వాదనలు తెలిసినప్పుడే ఏది ఉన్నవాటిల్లో బెటరో ( ఉత్తమం ఎటూ వుండదు కాబట్టి) ఎంచుకొనే అవకాశం వుంటుంది. లేకపోతే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీడియా చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అదే పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటినుంచే మూడో కూటమి మీడియా, మేధావి వర్గం పై దృష్టి సారించాల్సిన అవసరం వుంది. అప్పుడే ప్రజలకు మీడియా సమాచారం సమతుల్యంగా అందుతుంది. ప్రజాస్వామ్యం లో ఇది చాలా అవసరం. దురదృష్టవశాత్తూ ఏ ఒక్కరూ నిష్పక్షపాతంగా వార్తలు, విశ్లేషణలు ఇచ్చే రోజులు కావివి. ఎవరికి వారు తమ అనుకూలవాదనలనే నిజమని భ్రమింపచేసే కాలమిది. అందుకే ప్రజలు  మూడు రాజకీయ పక్షాల వాదనలు విని అందులో నిజాన్ని వెలికి తీసుకోవాల్సి వుంది. ప్రజలకు ఆ అవకాశం కల్పించటం కోసం బిజెపి-జనసేన కూటమి ఆంధ్రలో తమ ప్రచార వ్యవస్థ ని తయారుచేసుకుంటుందని ఆశిద్దాం.

Also Read : హైకోర్టు మీ ఇష్టం అనేసినా… జగన్ మాకొద్దు అన్నాడు