Renunciation Citizenship: ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో పాస్‌పోర్టు సరెండర్లు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందినవారు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు. గడిచిన ఏడాదిలో పాస్‌పోర్టు సరెండర్ చేసిన వారిసంఖ్య రెట్టింపు అయింది. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు 1,187 మంది భారతీయ పౌరసత్వం వదులుకోవడం గమనార్హం.
2011లో మొదలు..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన ఉత్పల్ పటేల్ 2011లో గుజరాత్‌ను వీడారు. కెనడాలో విద్యార్థిగా జీవితం ప్రారంభించాడు. 2022 నాటికి కెనడియన్ పౌరసత్వం పొందాడు 2023లో భారత పాస్‌పోర్టు సరెండర్ చేశారు. ఇలా పటేల్‌లో మొదలైన పాస్‌పోర్టు సరెండర్లు కొనసాగుతూనే ఉన్నాయి. పటేల్ నిర్ణయం భారీ వలసలకు కారణమైంది.
పాస్‌పోర్టు ఆఫీస్ డేటా..
గుజరాత్ రాష్ట్రంలోని ప్రాంతీయ పాస్‌పోఉ్ట కార్యాలయం సమాచారం ప్రకారం.. నర్మదాతో సహా దక్షిణ గుజరాత్ ప్రాంతం మినహా గుజరాతీలు తమ భారత పాస్‌పోర్టును సరెండర్ చేస్తున్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. 2023లో 485 మంది పాస్‌పోర్టులు సరెండర్ చేశారు. 2022లో 241 మంది పాస్‌పోర్టులు వదులుకున్నారు. ఇక 2024 మే నాటికి 244 మంది పాస్‌పోర్టు వదులుకున్నారు.
45 ఏళ్లలోపువారే..
ఇక పాస్‌పోర్టు వదులుకుంటున్నవారిలో 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసువారేనని పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇలా పాస్‌పోర్టు వదులుకున్నవారిలో ఎక్కువ మంది అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు గుర్తించారు. ఆయా దేశాల పౌరసత్వం పొందిన కారణంగా వారు భారతీయ పౌరసత్వం వదులుకున్నట్లు తెలిపారు.
పార్లమెంటరీ డేటా ఇలా..
ఇక భారత పార్లమెంట్ డేటా ప్రకారం.. 2014 నుంచి 2022 వరకు గుజరాత్ నుంచి 22,300 మంది భారత పౌరసత్వం వదులుకున్నారు. ఇలా భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య పరంగా చూస్తే గుజరాత్ మూడోస్థానంలో ఉంది. ఢిల్లీలో అత్యధికంగా 60,414 మంది భారత పౌరసత్వం వదులుకున్నారు. తర్వాత పంజాబ్ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 28,117 మంది భారత పౌరసత్వం వదులుకున్నారు.
కోవిడ్ తర్వాత పెరిగిన సరెండర్లు..
ఇదిలా ఉంటే.. కోవిడ్ సమయంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా చాలా మంది స్వదేశానికి వచ్చారు. దాదాపు ఏడాదిపాటు స్వదేశంలోనే ఉన్నారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత క్రమంగా విదేశీల బాటపడుతన్నారు. ఈ క్రమంలో కరోనా తర్వాత పాస్‌పోర్టు సరెండర్ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గుజరాత్ పాస్‌పోర్టు అధికారి అభిజిత్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు పాస్‌పోర్టు కార్యాలయం తెరుచుకోలేదని తెలిపారు. రెండేళ్ల తర్వాత కార్యాలయం తెరిచామని, దీంతో పాస్‌పోర్టు వదులుకుంటున్నవారి సంఖ్య పెరిగిందని వెల్లడించారు.
చదువు కోసం వెళ్లి..
కోవిడ్ తర్వాత గుజరాత్‌కు చెందిన చాలా మంది యువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారు అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో పాస్‌పోర్టు సరెండర్లు పెరుగుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.మరోవైపు ఇన్వెస్టర్ వీసాలకు ప్రాధాన్యత పెరుగుతుందని ఇన్వెస్ర్ వీసా కన్సల్టెంట్ లలిత్ అద్వానీ తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవనం కోసం చాలా మంది వ్యాపారులు కూడా విదేశాలకు వెళ్తున్నట్లు తెలిపారు. భారత్‌లో ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్నవారు కూడా పచ్చని ప్రదేశాలు లేనికారణంగా విదేశాలబాట పడుతున్నట్లు తెలిపారు.
2013–14 మధ్య అధికంగా..
2012 నుంచి గుజరాత్ నుంచి విదేశాలకు వెళ్లేవారు పెరుగుతున్నారు. ముఖ్యంగా 2013–14 మధ్య విదేశాలకు భారీగా విద్యార్థులు వెళ్లారు. ఇప్పుడు వారంతా విదేశీ పౌరసత్వం పొందారు. దీంతో వారు భారత పాస్‌పోర్టులు సరెండర్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. 2028 నాటికి పాస్‌పోర్టు సరెండర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సరెండర్ సర్టిఫికెట్ జారీ..
ఇదిలా ఉంటే.. భారతీయ పౌరసత్వం వదులుకుంటున్న వారికి సరెండర్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. పాస్‌పోర్టు చట్టం 1967 ప్రకారం, భారతీయ పాస్‌పోర్టు హోల్డర్లు విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత తప్పనిసరిగా తమ పాస్‌పోర్టులను సరెండర్ చేయాల్సింఏద. విదేశీ పౌరసత్వం పొందిన మూడేళ్లలోపు సరెండర్ చేస్తే ఎలాంటి జరిమానా ఉండదు. ఆ తర్వాత చేస్తే రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.