Rekki On Pawan Kalyan: పవన్ కదలికలపై ఇటీవల రెక్కీ నిర్వహిస్తున్నారన్న వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. అటు పవన్ ప్రాణానికి హని తలపెట్టారని స్వయాన జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు కూడా. విశాఖలో పవన్ పర్యటనలో దారిపొడవునా విద్యుత్ లైట్లు నిలిపివేశారని.. పవన్ పై దాడికి పక్కాగా కుట్ర జరిగిందని కూడా మనోహర్ ఆరోపించారు. పవన్ ఎక్కడికి వెళుతుంటే అక్కడకు ఓ టీమ్ అనుసరిస్తోందన్న టాక్ నడుస్తోంది. అటు హైదరాబాద్ లో పవన్ నివాసం వద్ద కూడా రెక్కి నిర్వహిస్తున్నారని.. అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారని.. ఇంటికి ఎవరెవరు వస్తున్నారో? ఆరా తీస్తున్నారని..కీలక వ్యక్తులు వచ్చే సమయంలో ఇలా ఆరా తీయడం ఎక్కువవుతుండడంతో జనసేన వర్గాలు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలో రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడేవారికి వైసీపీ సర్కారు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. విపక్ష నేతలను, పడని వారిని వేటాడడానికి నిఘా వ్యవస్థలు జగన్ జేబులోనే ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అటు సీఐడీ, ఇటు ఇంటెలిజెన్స్ తో పాటు సాధారణ పోలీస్ శాఖ ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఎంతకైనా తెగిస్తున్న విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారంలోనే హైదరాబాద్ లో ఏపీ సీఐడీ, ఇంటెలిజెన్స్, సాధారణ పోలీసుల అతి చొరవ చేశాం కూడా. ఇప్పుడు పవన్ విషయంలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. వైసీపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ సహకారం ఉండడంతో రెక్కీలు, నిఘాలు ఏపీ గవర్నమెంట్ కు సులువు మార్గాన జరిగిపోతున్నాయి. కానీ జనసేన లాంటి ఒక పార్టీ నాయకుడిపై రెక్కీ అంటే మాత్రం చిన్నవిషయం కాదు.

పోనీ పవన్ కళ్యాణ్ పై ఏమైనా కేసులు నమోదయ్యాయా అంటే? దానిపై కూడా స్పష్టత లేదు. అయితే ఏపీ సీఐడీ అధికారులకు కేసులతో పనిలేదు. ముందుగా కేసులు నమోదుచేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ ను బయటపెట్టరు. ముందుగా రెక్కీ నిర్వహించి అదుపులోకి తీసుకొని.. సదరు కేసును బయటపెడతారు. పదుల కేసుల్లో సీఐడీ అధికారుల వ్యవహార శైలి దీనినే తెలియజేసింది. ఇప్పుడు కూడా పవన్ విషయంలో అటువంటి కుట్ర ఏమైనా ఉందా అని జన సైనికులు అనుమానిస్తున్నారు. ఇటీవల విశాఖ ఎపిసోడ్ లో పవన్ పై కేసు నమోదుచేశారన్న ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేదు. ఇప్పుడు ఏకంగా రెక్కీల మీద రెక్కీలు నిర్వహిస్తుండడంతో ఏమైనా కేసులు నమోదుచేశారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికైతే ఏపీలో విపక్ష నేతలు ఎక్కడికి వెళ్లిన నిఘా వర్గాలు వీడడం లేదన్న మాట.