తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ఈ ధరణి వెబ్ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో ఇదో మైలురాయిగా నిలవనుంది. ధరణి ద్వారా ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందనున్నాయి. దస్తావేజుల రాతలు అవసరం లేని ఈ విధమైన సేవలు వేరే ఏ రాష్ట్రంలోనూ లేవు.
Also Read: తనది కాని చోట..! ఎంపీగా గెలిచినా తృప్తి లేని ‘కోమటిరెడ్డి’..!
కాగా.. ఈ ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్నారు. ధరణి సేవలు అందుబాటులోకి వస్తే.. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న దస్త్రాల నిర్వహణ ఇకపై పోర్టల్‌లో డిజిటల్ రూపంలో కొనసాగుతాయి. భూమి యజమానికి తెలియకుండా భూ వివరాల్లో ఎటువంటి మార్పు చేర్పులకు వీలుండదు. యజమాని ఆధార్ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు జరుగుతాయి.
భూమి యజమాని సెల్‌ఫోన్‌కు పంపే ఓటీపీ ఆధారంగానే ఈ మార్పులుచేర్పులు జరుగుతాయి. అక్రమంగా హక్కులు మార్చే పరిస్థితి లేదు. అంతేకాదు బయోమెట్రిక్‌తోనే దస్త్రాలు తెరుచుకుంటాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల సేవలను ఒకే సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచింది. దీనివల్ల వ్యవసాయ భూములను మండల తహసీల్దారు కార్యాలయాల్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. గతంలో భూమిపై యాజమాన్య హక్కులు పొందాలంటే మ్యుటేషన్ కోసం గ్రామస్థాయిలో వీఆర్వో నుంచి డిప్యూటీ తహసీల్దారు వరకు పలుమార్లు తిరిగితే తప్ప పూర్తయ్యేదికాదు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ కాగానే మ్యుటేషన్ కూడా పూర్తయిపోతుంది.
Also Read: రాములమ్మా.. చల్లబడమ్మా..!
రాష్ట్రంలో ఇప్పటివరకు 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. వీటికితోడు కార్యాలయాలను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 570 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అమల్లోకి రానున్నాయి. ధరణి అమలుకు రూ.51.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతీ తహసీల్దార్ కార్యాలయానికి రూ.9 లక్షల చొప్పున కేటాయించింది.