రెండోసారి అధికారంలో దూకుడుగా మోడీ పరిపాలన

సహజంగా ఎవరైనా మొదటిసారి వచ్చినప్పుడు తన ముద్ర వుండటం కోసం త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకు యు పిఏ 1 లో ఎన్నో విధానపర నిర్ణయాలు తీసుకొని చరిత్ర సృష్టించారు. అదే రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత విధానపర నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడి అపఖ్యాతి మూట కట్టుకున్నారు. ఇది అమెరికాలో కూడా జరుగుతూ వుంటుంది. మొదటిసారి అధికారం లోకి వచ్చిన అధ్యక్షుడు చాలా దూకుడుగా ఉంటాడు. రెండోసారి అంత దూకుడు కనబడదు. కానీ మోడీ […]

Written By: Ram, Updated On : September 26, 2020 7:02 am
Follow us on

సహజంగా ఎవరైనా మొదటిసారి వచ్చినప్పుడు తన ముద్ర వుండటం కోసం త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకు యు పిఏ 1 లో ఎన్నో విధానపర నిర్ణయాలు తీసుకొని చరిత్ర సృష్టించారు. అదే రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత విధానపర నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడి అపఖ్యాతి మూట కట్టుకున్నారు. ఇది అమెరికాలో కూడా జరుగుతూ వుంటుంది. మొదటిసారి అధికారం లోకి వచ్చిన అధ్యక్షుడు చాలా దూకుడుగా ఉంటాడు. రెండోసారి అంత దూకుడు కనబడదు. కానీ మోడీ సీను రివర్స్ అయ్యింది. మొదటిసారికన్నా రెండోసారి చక చకా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే 1991 లో సరళీకృత విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత సంస్కరణలవేగం అనుకున్న స్థాయిలో లేదని ఆర్ధిక నిపుణులు పెదవి విరుస్తూ వచ్చారు. అందులో దేశీయ ఆర్ధిక నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు కూడా వున్నారు. ఇది కొంతవరకు నిజమే ననిపిస్తుంది. పేరుకు సంస్కరణలు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వాలు ధైర్యంగా ముందు కెల్లటానికి జంకుతూ రెండడుగులు ముందుకేస్తే తిరిగి ఒకడగు వెనక్కిలాగటం చూస్తూవున్నాము. మొట్టమొదటిసారి ఎటువంటి బెదురూ లేకుండా అనుకున్న నిర్ణయాలు చక చకా తీసుకోవటం జరుగుతూవుంది. మొదటి టర్మ్ లో ఎంతోమంది మోడీకి మద్దతిచ్చినవాళ్ళు కూడా నిరుత్సాహం తో రెండోసారి దూరంగా జరిగారు. అయినా దేశ వ్యాప్తంగా మోడీ పలుకుబడి కి ధీటైన ప్రత్యామ్నాయం లేకపోవటం, బాలాకోట్ లాంటి సంఘటనలు తిరిగి మోడీని పూర్తి మెజారిటీ తో అధికారంలో కూర్చోబెట్టాయి. కానీ వచ్చిన తర్వాత చాలా దూకుడుగా సంస్కరణలు అమలు చేయటం మొదలుపెట్టాడు. అవేమిటో ఒక్కసారి చూద్దాం.

దేశాన్ని కుదిపే విధాన నిర్ణయాలు 

రాజకీయంగా చూస్తే ఆర్టికల్ 370 ని రద్దుచేయటం, జమ్మూ-కాశ్మీర్ ని రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయటం అతి సాహసోపేత నిర్ణయంగా చెప్పాలి. లడఖ్ ప్రాంతవాసులు స్వతంత్రం వచ్చినప్పటినుంచి జమ్మూ-కాశ్మీర్ నుండి విడిపోవాలని కోరుకుంటూనే వున్నారు. ఇన్నాళ్టికి వాళ్ళ కోరిక తీరింది. అలాగే 70 సంవత్సరాలనుంచి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు. ఈ రోజు మోడీ అతి పెద్ద రిస్కు తీసుకొని కొత్త విధానం తీసుకొచ్చాడు. విజయవంతమయితే భారత సమగ్రతకు వల్లభాయ్ పటేల్ తర్వాత చరిత్రలో నిలిచిపోతాడు. విఫలమయితే అది భారత సమగ్రతకే విఘాతమవుతుంది. అందుకనే మోడీ అతి పెద్ద రిస్కు తీసుకున్నాడని ఘంటాపధంగా చెప్తున్నాం. నాయకుడు ‘చల్తే హై గాడీ’ లాగా ఉండకుండా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోగలిగి వుండాలి. దేశంలో కొనసాగుతున్న దారుణమైన ‘తక్షణ ముమ్మూరు తలాక్’ ఆచారాన్ని తొలగించి ముస్లిం మహిళలకు మేలుచేసాడు.  పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చి పోరుగుదేశాలనుంచి వచ్చిన అక్కడి మైనారిటీ ప్రజలకు రక్షణ కల్పించాడు. ఇది కూడా సాహసోపేత నిర్ణయమే.

ఇక సామాజిక అంశాల్లోకి వచ్చేసరికి ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు హక్కులు కల్పించటం ఓ పెద్ద ముందడుగు. ఇది సహజంగా వుదారవాదుల ఎజెండా గా ఉంటుందని భావన. సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తారని కూడా అనుకుంటాము. సంప్రదాయ వాద ముస్లిం దేశాల్లో, అమెరికాలోని రిపబ్లికన్ పార్టీలో చాలామంది ఇప్పటికీ ఈ విషయాల్లో కఠినంగా వుంటారు. కానీ మోడీ ఈ చట్టం తో వారికి గౌరవం తీసుకొచ్చాడు. అందుకే ప్రాశ్చాత్య పరిభాషలో నిర్వచనాలు మనదేశానికి మక్కికి మక్కి వర్తించవు. ఉదాహరణకు వుమ్మడి పౌర సంస్కృతి అంశం ఉదారవాద ఎజండా లో భాగంగా వుండాలి. కానీ ఇక్కడ మోడీ ఎజండా లో అది భాగం. ఉదారవాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇస్లాం వాదుల ఎజండా వుదారవాదుల ఎజండా గా భారత్ లో వుంది. అందుకనే ప్రాశ్చాత్య నిర్వచనాలలో మేధావులు ఇక్కడ విషయాల్ని చూడకుండా వుంటే మన పరిస్థితులు మరింత చక్కగా అర్ధమవుతాయి. సరే ప్రస్తుత విషయానికొద్దాం. పరిపాలనాపరంగా కొత్త మోటార్ వాహనాల చట్టం కూడా నూతన పరిస్థితులకు అనుగుణంగా వుంది.

విద్యా, వైద్య సంస్కరణలు 

ఈ టర్మ్ లో తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో విద్యా, వైద్య సంస్కరణలు కూడా వున్నాయి. బూజుపట్టిన విద్యావిధానాన్ని సంస్కరించి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు. 21వ శతాబ్దపు ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించటం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అలాగే పూర్తి అవినీతిమయమైన భారత వైద్య మండలి స్థానం లో జాతీయ మెడికల్ కమీషన్ ని తీసుకురావటం కూడా పెద్ద ముందడుగే. దానితోపాటు మెడికల్ సీట్లు, నర్సింగ్ సీట్లు పెద్దమొత్తం లో పెంచటం, మెడికల్ కాలేజి లు, అనుబంధ ఆసుపత్రులు విరివిగా అనుమతించటం కూడా గుణాత్మక మార్పే. ఈ వ్యాసానికున్న పరిమితులవలన వివరంగా వీటిపై రాయలేకపోయినా ( ఇంతకుముందు అనేకసార్లు వివరంగా వివరించటం జరిగింది) ఈ రెండు సంస్కరణలు విద్యా రంగంలో విన్నూత్న మార్పుకి దోహదం చేస్తాయి. వీటిపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ వీటిపై ఇంత లోతుగా సంస్కరణలు తీసుకురావటం మాత్రం స్వాతంత్రానంతరం ఇదే మొదటిసారి. నాయకుడు తీసుకొనే ప్రతిచర్య అందరికీ నచ్చాలని లేదు. కావలసిందల్లా ధైర్యంగా సంస్కరణలపై నిర్ణయాలు తీసుకోవటం. ఉదాహరణకు భారత వైద్య మండలి రద్దు పై వెనక్కుతగ్గాలని విపరీతమైన ఒత్తిడి వచ్చింది. డాక్టర్ల లాబీ పెద్దఎత్తున ఆందోళన చేసారు. కానీ లొంగకుండా జాతీయ మెడికల్ కమీషన్ తీసుకురాగాలిగాడు. ఖచ్చితంగా ఇది సాహసోపేతమైన చర్యనే.

వ్యవసాయ , ఆర్ధిక రంగం లో పెనుమార్పులు 

వ్యవసాయ రంగానికొచ్చేసరికి ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులు చారిత్రాత్మకమైనవి. 1991 లో సరళీకృత ఆర్ధిక విధానాలు తీసుకొచ్చిన తర్వాత తయారీ రంగం, సేవా రంగం లో అనేక సంస్కరణలకు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు స్వీకారం చుట్టాయి , కానీ వ్యవసాయ రంగం లో ఉన్నదాన్ని నడుపుకుంటూ వచ్చాయి. ఇక్కడా మోడీ ధైర్యం చేసి సంస్కరణలకు స్వీకారం చుట్టాడు. వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాల విధానాన్ని తీసుకురావటం, దానికి కావాల్సిన ఆర్ధిక సహాయానికి పధకాలు ప్రకటించటం నా దృష్టిలో భవిష్యత్తులో పెట్టుబడిదారీ వ్యవసాయ సంస్కరణ గా చెప్పొచ్చు. ఈ సంఘాలు కార్పొరేటు సంస్థలతో అన్ని విధాలుగా పోటీపడే అవకాశముంది. అలాగే అత్యవసర సరుకుల చట్టాన్ని సడలించటం, వ్యవసాయ ఉత్పత్తుల కు పోటీ మార్కెట్ వాతావరణాన్ని కల్పించటం, కాంటాక్ట్ వ్యవసాయ విధానాన్ని తీసుకురావటం మారుతున్న అవసరాలకు దీటుగా సంస్కరణలు తీసుకోచ్చినట్లయ్యింది. కాకపోతే ఈ బిల్లులు ఆమోదించిన పద్దతి బాగాలేదు. ప్రతిపక్షం రాజ్యసభలో ప్రవర్తించిన తీరు గర్హించ దగ్గదే. అదేసమయం లో ప్రభుత్వం కూడా సంయమనం పాటించి పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆమోదించి వుంటే బాగుండేది. అవతలి వారి తప్పు మనం తప్పుచేయటానికి ఒంక కాకూడదు.

ఇకపోతే ఆర్ధికరంగం లో పెట్టుబడులను ఆకర్షించటానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పన్నులు కూడా ప్రపంచ పోటీ మార్కెట్ కి అనుగుణంగా తగ్గించారు. ఇక బ్యాంకింగ్ రంగం లో అనేకమార్పులు తీసుకొచ్చారు. జాతీయ బ్యాంకుల్ని కుదించి విలీనాలు చేసారు. అలాగే కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కూడా వున్నట్లు ప్రకటించారు ( వీటిపై మాకు రిజర్వేషన్లు వున్నాయి ). పిఎం సి బ్యాంకు కుంభకోణం తర్వాత కోపరేటివ్ బ్యాంకులను కూడా ఆర్ బి ఐ పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రైవేటీకరణ పై ఓ విధాన ప్రకటన తీసుకొచ్చారు. విదేశాలనుంచి నిధులు తీసుకొనే సంస్థలపై పర్యవేక్షణ పెంచారు. వీటి ఫలితాలు ఎలావుంటాయో తెలుసుకునే అవకాశం లేకపోయింది. కరోనా మహమ్మారి తో మొత్తం పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఇది ఎవరూ ఊహించని పరిణామం.

చివరిగా 

మొత్తం దేశం లోని 44 కార్మిక చట్టాల్ని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఇందులో కొన్ని హర్షించదగ్గవి, మరికొన్ని కార్మికులకు ఖేదం కలిగించేవి. ఒక్కమాటలో చెప్పాలంటే కార్మికులకు మరింత సంక్షేమం, అదేసమయంలో కార్మిక హక్కులకు భంగం. స్థూలంగా ఇదీ ఈ చట్టాల సారం ( ఇంతవరకూ వీటిని చదివే అవకాశం రాలేదు కాబట్టి మీడియా వార్తల పైనే ఆధారపడ్డాము) . కానీ ఒక్కటి మాత్రం వాస్తవం 2013 భూసంస్కరణల చట్టం లాగా కార్మిక చట్టాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్పులు చేసాయి. ఉదాహరణకు ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఫ్యాక్టరీలు మూసివేయటానికి 100 మంది కార్మికుల పరిమితిని  300 మందికి రాజస్తాన్ ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అనుసరించాయి. ఈ విషయం లో కేంద్ర, రాష్ట్రాలు ఒకలాగానే ఆలోచిస్తున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించటానికి పోటీపడుతున్న తరుణంలో రాష్ట్రాలు ఒకదానిమీద ఒకటి పోటీపడి చట్టాల్ని మారుస్తున్నాయి. కేంద్ర చట్టంలో అసంఘటిత కార్మికుల పరిధి వలస కార్మికులకు, గిగ్ కార్మికులకు విస్తరించినట్లు ప్రకటించారు. ఈ అంశం పూర్తి అధ్యయనం తర్వాత మరింత వివరంగా చర్చించుకుందాం.

చివరిగా చెప్పేదేమిటంటే మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఇది సహజం. ఒక్కో ప్రభుత్వం ఒక్కో ఆలోచనా సరళి కలిగివుంటుంది. కాకపోతే ఎన్నికల్లో చెప్పటానికి , ఆచరణలో పెట్టటానికి ఎంతో వ్యత్యాసం మనం చూస్తుంటాము. కానీ మోడీ విషయం లో అలా కాకుండా ఎన్నికల ప్రణాళికను, తన ఆలోచనలను అమలుచేయటానికి వెనకాడలేదనిపిస్తుంది. అవి అందరికీ నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నాయకుడికి కావాల్సింది తను అనుకున్నది ధైర్యంగా అమలుచేయటం, దానికోసం రిస్కు తీసుకోవటం. ఆ లక్షణాలు మోడీ లో పుష్కలంగా వున్నాయి. ప్రస్తుత భారతావనికి కావాల్సింది ఇదే. కేవలం ఒకటిన్నర సంవత్సరం లోనే ఇన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవటం అభినందనీయం. ఇప్పటివరకు ‘బిగ్ బ్యాంగ్ సంస్కరణలు’ మోడీ తీసుకోవటం లేదనే మేధావులకు రాయటానికి ఏమీ లేకుండా చేసాడు మోడీ. అయితే ఇవి ప్రజలు ఆమోదిస్తారా లేదా అనేది వచ్చే కొన్ని సంవత్సరాల్లో ప్రజా క్షేత్రంలోనే తేలాలి. చూద్దాం మరి.