BRS List : “రేవంత్ రెడ్డి కార్పొరేషన్ పదవుల్లో సింహభాగం రెడ్లకే ఇచ్చాడు. తన చుట్టూ ఉన్న వాళ్లల్లో రెడ్లనే పెట్టుకున్నాడు. చివరికి పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు రెడ్లకే ఇచ్చాడు. తెలంగాణను మొత్తం రెడ్ల రాజ్యం చేశాడు.. ఇదేనా మనం కోరుకున్న సామాజిక తెలంగాణ? దీనినేనా మార్పు అని ఎన్నికల ముందు కాంగ్రెస్ పదేపదే చెప్పింది”..ఇలానే కదా భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో జరుగుతున్నది చర్చ. కానీ అదే భారత రాష్ట్ర సమితి అధినేత పార్లమెంట్ ఎన్నికల్లో రెడ్ల అభ్యర్థులకే ప్రయారిటీ ఇచ్చాడు. పేరుకు బీసీలకు ఐదు స్థానాలు ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో బీసీలదే సింహ భాగం జనాభా. అయినప్పటికీ రెడ్ల తో పోల్చితే వారికి ఒక సీటే అదనంగా ఇచ్చింది.
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉండగా.. హైదరాబాద్ స్థానానికి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని పోటీలో పెట్టడం కొంత కాలం క్రితం నుంచి మర్చిపోయింది. పైగా అధికారంలో ఉన్నప్పుడు దోస్తుగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ కోసం హైదరాబాదులో స్నేహపూర్వక పోటీ ని కూడా వదిలిపెట్టింది. అయితే ఈసారి ఈ స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఇక త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. బీసీలకు ఐదు, రెడ్లకు నాలుగు, వెలమలకు ఒక స్థానం, రిజర్వ్ స్థానాలలో ఎస్సీలకు మూడు, ఎస్టీలకు రెండు స్థానాలు కేటాయించింది.
వరంగల్ (ఎస్సీ రిజర్వుడ్ స్థానం) కడియం కావ్య, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ), జహీరాబాద్ గాలి అనిల్ కుమార్( బీసీ), పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్డ్ స్థానం) కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్డ్ స్థానం) మాలోత్ కవిత, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్(బీసీ), మహ బూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి (రెడ్డి), ఖమ్మం నామ నాగేశ్వరరావు (కమ్మ), ఆదిలాబాద్(ఎస్టీ రిజర్వ్డ్ స్థానం) ఆత్రం సక్కు మల్కాజ్ గిరి రాగిడి లక్ష్మారెడ్డి (రెడ్డి), మెదక్ వెంకట్రామిరెడ్డి ( రెడ్డి), నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( ఎస్సీ రిజర్వ్డ్) కు కేటాయించింది. భువనగిరి, నల్లగొండ, హైదరాబాద్ స్థానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ హైదరాబాద్ స్థానం బీసీకి కేటాయిస్తే.. అప్పుడు 17 పార్లమెంటు స్థానాల్లో ఏడు బీసీలకే ఇచ్చినట్టు అవుతుందని.. అంటే 50 శాతం సీట్లు వారికే కేటాయించినట్టవుతుందని భారత రాష్ట్ర సమితి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే బీసీలతో పోల్చితే ఎంతో తక్కువ జనాభా ఉన్న రెడ్డి సామాజిక వర్గం వారికి అన్ని సీట్లు ఎందుకు అనే ప్రశ్నకు మాత్రం భారత రాష్ట్ర సమితి వద్ద సమాధానం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి ఇటీవల వరకు భారత రాష్ట్ర సమితికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రాలేదని ప్రచారం జరిగింది. ఒకానొక దశలో కొన్ని స్థానాల్లో పోటీని విరవించుకుంటుందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే కెసిఆర్ రంగంలోకి దిగి.. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం.. కొంతమంది అభ్యర్థులను బుజ్జగించడంతో వారు పోటీ చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. అయితే నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్ స్థానాల్లో ఎవరితో పోటీ చేయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.