కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

  హైదరాబాద్‌ లో సచివాలయంను కూల్చేసి, అదే స్థలంలో కొత్త సచివాలయ భవనం కట్టాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. నిజానికి ప్రభుత్వం ఈ నిర్ణయం గత ఏడాది జూన్‌ లోనే తీసుకుంది. జూన్ 27న ఇదే ప్రాంగణంలో కొంచెం అవతలివైపు సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈలోపు కొందరు సచివాలయ కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇవి దాదాపు ఏడాదిపాటు నడిచాయి. ఈ భవనాలు బాగానే ఉన్నాయని, వాటిన కూల్చాల్సిన అవసరం […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 12:06 pm
Follow us on

 

హైదరాబాద్‌ లో సచివాలయంను కూల్చేసి, అదే స్థలంలో కొత్త సచివాలయ భవనం కట్టాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. నిజానికి ప్రభుత్వం ఈ నిర్ణయం గత ఏడాది జూన్‌ లోనే తీసుకుంది. జూన్ 27న ఇదే ప్రాంగణంలో కొంచెం అవతలివైపు సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈలోపు కొందరు సచివాలయ కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇవి దాదాపు ఏడాదిపాటు నడిచాయి. ఈ భవనాలు బాగానే ఉన్నాయని, వాటిన కూల్చాల్సిన అవసరం లేదని పిటిషనర్లు వాదించారు. చివరికి మూడు నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఈ అంశంలో తుది తీర్పు ఇచ్చింది. భవనాల కూల్చివేతలో తాము జోక్యం చేసుకోలేమని, సచివాలయం ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిర్మించాలి అనేది ప్రభుత్వం ఇష్టమని తీర్పు ఇచ్చింది. దాంతో సోమవారం అర్థరాత్రి నుంచి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా కూల్చివేత పనులు ప్రారంమయ్యాయి. కూల్చివేత పనులు జరుగుతున్న ప్రాంతం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏడాదిలోపే కొత్త భవనం నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పాత సచివాలయం కూల్చివేతకు కారణాలు?

పాత సచివాలయం దగ్గర పార్కింగ్ స్థలం సరిగ్గా లేదని, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సందర్భాల్లోనూ సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోందని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేవని.. ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు కొరవడ్డాయని భావించింది. అధికారులు, సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడం కష్టంగా ఉందని, ఫైళ్ల తరలింపులోనూ ఇబ్బందులు ఉంటున్నాయని ప్రభుత్వం గతంలో వివరించింది. ఈ నిర్మాణాలు నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి లేవని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే జనం బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితిలో అవి ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు గతంలో చెప్పారు.

ఏ లోటుపాట్లు లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సమీకృత సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ మొదటి నుంచీ చెబుతున్నారు. తెలంగాణకే తలమానికంగా ఉండేలాగా దానిని నిర్మిస్తామన్నారు. దీనికి తోడు 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించి ఐకానిక్ భవనాలు ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఆయన ఆధునీకరించారు. దానికి ప్రగతి భవన్ అనే పేరుపెట్టారు. కేసీఆర్ తర్వాత అసెంబ్లీ, సచివాలయం కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రయత్నించారు. దాని నిర్మాణం కోసం జంట నగరాల్లో చాలా ప్రాంతాలను పరిశీలించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లేదా జింఖానా గ్రౌండ్స్ లో నిర్మిస్తారని, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని తరలించి అక్కడ కడతారని, ఎర్రమంజిల్‌ లో సచివాలయం నిర్మిస్తారని రకరకాల వార్తలు వచ్చాయి. చివరకు పాత సచివాలయం ఉన్నచోటే, ఆ భవనాన్ని కూల్చేసి కొత్త భవనం కట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది.