Chandrababu Naidu: వైసీపీ, టీడీపీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు ఆయన కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయాలపై దాడుల జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు మాటల వాడి పెంచుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు కుప్పం వస్తే బాంబులు వేస్తామన్నారు. రెస్కో సంస్థ చైర్మన్ సెంథిల్ కుమార్ చంద్రబాబు వస్తే ఆయన కారుపై బాంబులేస్తామని చెప్పడం గమనార్హం.

దీంతో టీడీపీ దీక్షలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. టీడీపీ దీక్షలను దొంగ దీక్షలుగా అభివర్ణించారు. కుప్పం దీక్షల్లో జరిగిన కార్యక్రమంలో సెంథిల్ కుమార్ రెచ్చిపోయి టీడీపీపై విమర్శలకు దిగారు. పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ రెచ్చిపోయారు. దీంతో పలువురు నేతలు సెంథిల్ కుమార్ దగ్గర మైకు లాక్కున్నారు. చంద్రబాబును బండ బూతులు తిడుతూ చెలరేగిపోయారు.
సెంథిల్ కుమార్ వ్యాఖ్యలతో కుప్పంలో కూడా రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోతున్నాయని దుయ్యబడుతున్నారు. రాష్ర్టంలో పాలన గాడితప్పిందని వాపోతున్నారు. ఇలాగైతే పరిస్థితి అదుపు దాటే స్థితి నెలకొంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుప్పంలో రాజకీయ సెగ రేగడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ నేతల మాటలకు టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడుతున్నారు. లేకపోతే పరిణామాలు మరింతగా రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ఏదిఏమైనా రెండు పార్టీల మధ్య రేగిన గొడవ రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద గాలిదుమారమే రగిలిస్తోంది.