ఆంధ్ర సమాజంలో రాజకీయాలు, సినిమాలు చేదోడు వాదోడుగా కలిసి మెలిసి ప్రయాణం చేస్తాయని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. మరి ఈ మాత్రం ఇంగితజ్ఞానం లేకుండా రాజకీయాల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే ఎప్పటికీ షైన్ కాలేరు. వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఏమైనా కుదరదేమోగానీ తెలంగాణ విడిపోయాక మిగిలిపోయిన ఆంధ్రాలో ఇది అక్షరాలా సత్యం. దాదాపు శతాబ్దంపైగా తమిళులతో కలిసి సహజీవనం చేసిన చరిత్ర కదా. ఆ మాత్రం అరవ వాసనలు వుండాలికదా . సహతెలుగు వాళ్ళతో మన సహజీవనం 58 ఏళ్ళయితే తమిళులతో అబ్బో దాదాపు రెండు వందల ఏళ్ళు. అందుకే తమిళుల కాఫీ, ఇడ్లి, దోశ మన తెలుగింటి ఆచారంగా మారింది. అదేబాటలో సినిమాలు కూడా . కొత్తవాళ్లకు తెలియదుకానీ సినిమా అంటే మద్రాసే . ఇప్పటి ఆంధ్ర, రాయలసీమ వాళ్లకు ఏ పనికావాలన్నా మద్రాస్ పరిగెత్తేవాళ్లు. విజయ-వాహిని స్టూడియో అలాంటిదే. చందమామ పుస్తకం అక్కడిదే. ఒకటేమిటి , ఇప్పుడు ప్రతి పనికీ హైదరాబాద్ ఎట్లా వస్తున్నారో అలాగా మద్రాస్ వెళ్ళేవాళ్ళు. అంతగా మద్రాస్ తో ఆంధ్ర వాళ్ళ జీవనం పెనవేసుకుపోయింది. అందుకే మద్రాస్ లేని రాజధాని మాకొద్దని చాన్నాళ్లు భీష్మించుకు కూర్చున్నారు. చివరకు ఇష్టంలేకుండానే మద్రాస్ ని వదులుకొని వచ్చారు. అదేంటోగానీ ఆంధ్రులకి , రాజధానికి ఎదో పొసగటం లేదు . మద్రాస్ పోయే కర్నూల్ వచ్చే; కర్నూలు పోయే హైదరాబాద్ వచ్చే; హైదరాబాద్ పోయే అమరావతి వచ్చే; అమరావతి పోయే వైజాగ్ వచ్చే; వైజాగ్ పోయే ….. అసలు మనం ఆంధ్ర అనే పదం మానేస్తే గతిమారిద్దంటారా ! ఆమ్మో అదెట్లా పోతేపోనీ రాజధానీ, ఆంధ్ర పదం మనకు వేల సంవత్సరాల అనుభూతికదా. మరి మన తెలుగు చానళ్ళు ఇప్పటికే జ్యోతిష్యులు, పంచాంగ పండితులు, స్వామీజీలతో దీనిపై చర్చోప చర్చలు పెట్టివుండాలే. వాళ్ళకు ఇంతకన్నా గొప్ప టాపిక్ ఇంకేముంటుంది? మనమైనా సలహా ఇద్దాం . ఓ నెల రోజులు చానళ్లకు పండగే పండగ.
సరే అసలు విషయానికి వద్దాం. రాజకీయాలకి, సినిమాలకి లింక్ ఏందంటారా? ఇటీవలే ఈ లింక్ మరోసారి ముందుకొచ్చిందండోయ్ . జేడీ లక్ష్మీనారాయణ గారు ( ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటా ) పవన్ కళ్యాణ్ మాటతప్పి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని కోపంతో నిరసనగా జనసేన నుంచి బయటికెళ్లిపోయాడంట. దీనితో అందరూ ముక్కున వేలేసుకున్నారు. జేడీ గారు జనసేన నుంచి బయటికెళ్తాడనే రూమర్ చాలా రోజుల్నుంచి చెక్కరు కొడుతోంది. కాబట్టి అందులో ఆశ్చర్యం ఏమీలేదు , ఆశ్చర్యమల్లా ఆయన చెప్పిన కారణం గురించే. పవన్ కళ్యాణ్, జేడీ గారి మధ్య అసలేంజరిగిందనే దానిమీద , యోగ్యతా యోగ్యతల మీద మనం జడ్జిమెంట్ పాస్ చెయ్యటంలేదండోయ్. కేవలం ఈ సినిమా లింక్ గురించే మాట్లాడుకుందాం. ఇందాకనే చెప్పినట్లు అరవ వాసనలు మన సంస్కృతిలో భాగమై పోయాయనేది సత్యం, పాపం జేడీ గారికి ఈ విషయం బోధపడినట్లు లేదు. చిన్నప్పుడు సినిమా రిలీజ్ అవగానే మొదటి షో టికెట్ కొనుక్కొని సినిమా చూసే అలవాటు జేడీ గారికి ఉన్నట్లు లేదు. ఆంధ్ర రాజకీయాల్ని అవపోసన పట్టాలంటే ఈ అలవాట్లు, సంస్కృతులను కూడా స్టడీ చేయాలని జేడీ గారికి తెలిసినట్లు లేదు. ఆయనంతా సిస్టమాటిక్ గా వున్నత చదువులు చదవటం, వృత్తిని దైవంగా భావించి నిర్మొహమాటంగా పాటించటం, డ్యూటీలో సినిమా హీరో లాగా వున్నాడే తప్పించి రియల్ లైఫ్ లో సినిమా జీవితానికి అలవాటుపడినట్లు లేదు. జేడీ గారూ , తమిళనాడులో , ఆంధ్ర లో సినిమా , రాజకీయాలు విడి విడి గా చూడలేమండి.
ఒక్కసారి డీఎంకే చరిత్ర చూడండి. సినిమా రచయితలే నాయకులు. అన్నాదురై కి ఎంత కనెక్షన్ వుందో తెలియదుగానీ కరుణానిధి మాత్రం పూర్తిగా సినిమా నేపధ్యం నుండే వచ్చాడు. ఎంజీఆర్ , జయలలితల సంగతి చెప్పాల్సిన పనిలేదు. అలాగే విజయకాంత్, కమల్ హాసన్ , రజనీకాంత్ లు కూడా. అదే ఒరవడి తెలుగులో కూడా వచ్చేదేకానీ మధ్యలో హైదరాబాద్ తో కలవటంతో కొంత బ్రేక్ వచ్చింది. అయినా ఎన్టీఆర్ అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్ళందరినీ ఒకటిచేయగలిగాడు. అయినా తెలంగాణ లో సినిమా ప్రభావం మొదట్నుంచీ పరిమితంగానే ఉండేది. తిరిగి పాత ఆంధ్ర ఏర్పడటంతో మెల్లిగా తమిళనాడు వాతావరణం ఏర్పడుతుంది సుమా. ఈ ఎన్నికల్లోనే ఆ సూచనలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ తో పాటు వైస్సార్సీపీ కూడా ఎంతోమంది సినిమా వాళ్ళతో ప్రచారం చేయించింది. అలాగే తెలుగుదేశం. అసలు సన్ స్ట్రోక్ లేకపోతే తెలుగుదేశంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నాయకుడిగా ఎదిగేవాడనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే రాజకీయాలు, సినిమాలు ఆంధ్రాలో విడదీయలేమని జేడీ గారికి ఇప్పటికే అర్ధమైవుండాలి. అందుకనే పాపం జేడీ గారు బయటకెళ్తూ చెప్పిన కారణం ఎవ్వరినీ కన్విన్స్ చేయలేకపోయింది.
జేడీ గారూ , మీరు దేన్నయినా టచ్ చేయండి గానీ సినిమా ఫీల్డ్ ని టచ్ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ ఏ కారణం చెప్పినా, జేపీ లాంటి వాళ్ళు సమర్ధించినా అసలు కారణం ఇంకా నాలుగు సంవత్సరాలు పైగా పవన్ కళ్యాణ్ ని ప్రజలు గడ్డంతో చూడటానికి ఇష్టపడటంలేదంట . అది పవన్ కళ్యాణ్ కి అర్ధమయ్యింది. చూడండి ఇప్పుడు గడ్డం తీసిన స్టిల్స్ సోషల్ మీడియా లో కొట్టే చక్కర్లకి జనం ఫిదా అవుతున్నారు. ఆయన అభిమానులూ, సినిమా ప్రియులు పవన్ కళ్యాణ్ ని మరలా సినిమాల్లో చూసుకోవాలని తహ తహ లాడుతున్నారు , మీరెందుకు అడ్డుపడటం. ఈ రాజకీయాలు ఎప్పుడూ వుండేయే . ఆరడుగుల బుల్లెట్టుని సినిమాల్లో చూసి ఆనందించనీయండి. మధ్యలో ఆయనకి వాళ్ళ అన్నయ్య లాగా సినిమా ఫీల్డే హాయిగా అనిపిచ్చిందనుకో అప్పుడు రాజకీయ రంగం మీలాంటి వాళ్లకు పూర్తిగా దొరుకుతుందికదా. పవన్ కళ్యాణ్ సంగతేమోగానీ మీకు నా ఉచిత సలహా . మీరు కూడా సినిమా ఫీల్డ్ ఎందుకు ట్రై చేయకూడదు. ఆంధ్ర రాజకీయాలకు సినిమా రంగం స్టెప్పింగ్ స్టోన్ అంటారు. ఇంకెందుకు ఆలస్యం , మీరూ సినిమా లోకి దూకండి. మీరూ ఆరడుగుల బుల్లెట్టే కదా. సరదాకి , ఎవరినీ నొప్పించటానికి కాదు సుమా.
ఇదీ ఈ వారాంతపు ముచ్చట్లు , వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ….
… మీ రామ్
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Re entry of pavan kalyan in to cinemas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com