Raviprakash News Channel: జెమినీ టీవీలో వార్తలు చదివే జర్నలిస్టుగా తొలిసారి తెరముందు కనిపించిన రవిప్రకాష్.. న్యూస్ కు ఉన్న విలువను గ్రహించి.. తెలుగు నాట స్థాపించిన ‘టీవీ9’ అన్నది అప్పట్లో ఒక సంచలనం.. డేరింగ్, డ్యాషింగ్ జర్నలిస్టులను ఎంపిక చేసుకొని వారికి స్వేచ్ఛనిచ్చి దూకుడు నేర్పి వడ్డించిన వార్తలు నిజంగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్నాయి. టీవీ9ను టాప్ చానెల్ గా మార్చాయి. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా విస్తరించి ‘రవిప్రకాష్’ టీవీ9 బ్రాండ్ ను జాతీయ లెవల్ లో అందరికీ గుర్తుండేలా తీర్చిదిద్దాడు.
Image credits: Raviprakash.live
అయితే మీడియాతో తెలుగు రాజకీయాలను శాసించిన రవిప్రకాష్ ఉమ్మడి ఏపీ విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక టీవీ9 నుంచి ఆరోపణలతో వైదొలగాల్సి వచ్చింది. టీవీ9 పెట్టుబడిదారులతో గొడవ చిలికి చిలికి గాలివానగా మారి.. అది అధికార పార్టీ ప్రమేయంతో రాజకీయ రంగు పులిమి కేసులతో రవిప్రకాష్ ను టీవీ9 నుంచి తొలగించే వరకూ సాగిందన్నది ఇన్ సైడ్ టాక్.
దెబ్బతిన్న పులి ఎప్పుడూ సమయం సందర్భం కోసం వేచి ఉంటుంది. అది రాగానే పంజా విసురుతుంది. రవిప్రకాష్ కు తాను టీవీ9 నుంచి బయటకు రావడానికి కారకులు ఎవరో తెలుసు.. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేశాడు. బలమైన శక్తులతో కలిసి దేశవ్యాప్తంగా బలమైన మీడియా ను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు.
TV 9 ఫౌండర్-ఛైర్మన్ రవిప్రకాశ్ కొత్త మీడియా ప్రకటన త్వరలోనే వెలువడనున్నదని తెలుస్తోంది. టెలివిజన్, న్యూస్ పేపర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్తున్న రవిప్రకాశ్ బృందం ఏడు భారతీయ భాషల్లో కొత్త మీడియా సృష్టించటానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Image credits: tv9journalists.live
18 సంవత్సరాల క్రితం TV9ను స్థాపించి, దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ నెట్ వర్క్ గా మలచిన టీమ్ ఇప్పుడు కొత్త పోకడలతో, సాంకేతిక మార్పులతో ఈ మీడియాకు రూపకల్పన చేయబోతున్నట్టు తెలుస్తోంది.
మిడిల్ ఈస్ట్ సావరిన్ ఫండ్ తో పాటు సిలికాన్ వ్యాలీ మీడియా టెక్నాలజీ ఈక్విటీ గ్రూపులు రవిప్రకాశ్ ప్రయత్నాలకు అండదండలందిస్తున్నట్టు తెలిసింది. ఇక మరో టాక్ ఏంటంటే.. రవిప్రకాష్ అప్పట్లో కేంద్రహోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ పెద్దలను కలిశారు. తన మీడియా ప్రయత్నాలను వివరించినట్టు ప్రచారం సాగింది. రవిప్రకాష్ వెనుక బీజేపీ పెద్దలే ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
Image credits: Raviprakash.live
దేశంలో జర్నలిజం పతనమైందనీ, ధనిక స్వాములకు, నేతలకు మీడియా దాసోహమంటోందన్నఆరోపణల నేపథ్యంలో, ఈ కొత్త మీడియా సంస్థ జర్నలిజం సత్తాను ప్రజలకు చూపిస్తుందని ఈ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. మరి రవిప్రకాష్ ప్రారంభించిన న్యూస్ చానెల్ ప్రస్థానం ఇప్పుడు ఆయన గ్యాప్ ఇచ్చి మళ్లీ పునరుత్తేజంతో తిరిగి ప్రారంభిస్తున్న ఈ న్యూస్ నెట్ వర్క్ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? జనాన్ని ఎంత ఆకట్టుకుంటుంది? తెలుగు రాజకీయాలను ఏ మేరకు షేక్ చేస్తుందన్నది వేచిచూద్దాం..